బెజవాడలో ఆ లీడర్‌కి సీనియారిటీ ఉన్నా… కాలం కలిసి రావడం లేదా? వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు అంటూ… పదిహేనేళ్ళు వెయిట్ చేశాం. ఇక మావల్ల కాదని ఆ నేత అనుచరగణం ఎందుకు అంటోంది? తమ నాయకుడిని వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు? ఇప్పుడాయన ఎలా ఉన్నారు? అసలింతకీ ఎవరా లీడర్? ఏంటాయన ఎదురుచూపుల కథ? బెజవాడ రాజకీయాల్లో వంగవీటి పేరు ఒక బ్రాండ్. ఇంకా చెప్పుకోవాలంటే… ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన పేరు అది. దివంగత వంగవీటి రంగా కుమారుడిగా… రాధాకి కూడా అదే గుర్తింపు ఉంది. తండ్రి ఒకసారి, తల్లి రెండు విడతలు ఎమ్మెల్యేలు అవగా… రాధా ఒక్క విజయానికే పరిమితం అయ్యారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో మూడు సార్లు పోటీ చేసి ఒక్కసారి మాత్రమే గెలవగలిగారాయన. మొత్తం ఐదు ఎన్నికల్ని చూసిన రాధా… రెండు విడతలు పోటీకి దూరంగా ఉన్నారు. అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన రికార్డ్ ఆయన పేరిట ఉన్నా… ఆ ఒక్కసారి మినహా… మరెప్పుడూ ఆయన పవర్‌లోలేరు. ఇపుడు అదే… ఆయన సొంత కేడర్‌ని కలవరపెడుతోందట. తొలిసారి 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు రాధా. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఆ ఐదేళ్ళు మాత్రమే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి రాధా పొలిటికల్ కెరీర్ పరిశీలిస్తే.. ఎన్నడూ అధికారంలో లేరు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓడిపోయి అధికారానికి దూరమయ్యారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు.
ఇక 2019లో టిడిపిలో చేరినా…. అప్పుడు ఆ పార్టీకి పవర్ పోయింది. ఈ క్రమంలో… 2024లో వైసీపీలో చేరాలని ప్రతిపాదనలు వచ్చినా… ఆయన మాత్రం టిడిపిలోనే కొనసాగి 20 ఏళ్ల తర్వాత అధికార పార్టీలో ఉన్నారన్నది వంగవీటి వర్గం మాట. నిలకడ లేకుండా… ప్రతి ఎన్నికల టైంలో గెలవబోయే పార్టీ నుంచి ఓడిపోయే పార్టీలోకి వెళ్ళటం ద్వారా అధికారం, పదవులు రాధాకు దక్కకుండా పోయాయన్నది ఆయన వర్గం మాట. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాసరే… ఆయనకు పదవులు దక్కడం లేదన్న ఆవేదన పెరుగుతోందట వంగవీటి అభిమానుల్లో. తెలుగుదేశం పార్టీలో రాధా చేరినప్పుడు ఆయనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చినా ఖాతరు చేయలేదు. పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల్లో పనిచేశారు. ఈసారి గెలిచిన తర్వాత రాధాకు కచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడింది ఆయన వర్గం. అధిష్టానం కూడా అంతకు ముందే హామీ ఇచ్చిందని, ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే రాధాను ఎమ్మెల్సీగా చూస్తామని ఆయన వర్గం వెయిట్ చేసింది. తనకు ఫలానా పదవి కావాలని రాధా ఎప్పుడూ అడగలేదని, ఆయనకు పదవుల మీద పెద్దగా వ్యామోహం లేదని అంటున్నా… మానేతను ఒక హోదాలో చూడాలన్నది వంగవీటి అభిమానుల ఆశగా చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లలో ఛాన్స్ దక్కకపోవడంతో…మళ్ళీ అవకాశం రావాలంటే… 2027దాకా ఎదురు చూడక తప్పని పరిస్థితి. దీంతో ఇంకెన్నాళ్ళు ఈ వెయిటింగ్ అంటూ డీలా పడుతున్నారట మాజీ ఎమ్మెల్యే అనుచరులు. తమ నాయకుడికి పదవులపై ఆశ లేకపోయినా తాము మాత్రం ఆయన్ని చట్టసభలో చూడాలని కోరుతున్నామన్నది వాళ్ళ మాట. అందుకోసం 15 ఏళ్లుగా వెయిట్ చేస్తున్నామని, టీడీపీ అధిష్టానం ఇకనైనా గుర్తించి ఆయన స్థాయికి తగ్గ పదవి ఇవ్వాలని కోరుతున్నారట. ఇన్నాళ్ళు అవకాశం లేక వెయిటింగ్ లో ఉన్నామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా వెయిటింగ్ అంటే… ఇబ్బందేనంటూ మనసులో మాట బయట పెడుతోందట వంగవీటి అనుచరగణం. దీన్ని టీడీపీ అధిష్టానం ఎలా తీసుకుంటుందో చూడాలి మరి.
