కమలం పార్టీలో కంచే చేను మేసిందా? మున్సిపల్ ఎన్నికల్లో నొక్కుడు బేరం బాగా జరిగిపోయిందా? ఎన్నికల ఖర్చుల కోసమని పార్టీ నాయకత్వం పంపిన డబ్బుని లోకల్ కాషాయ లీడర్స్ ఎక్కడికక్కడ సెట్ చేసుకుని జేబులు నింపేసుకున్నారా? పెద్దలు పంపిన డబ్బుకు, పోలైన ఓట్లకు పొంతన లేదని లెక్కల్లో తేలిందా? ఇప్పుడిదే ఇష్యూ మీద పార్టీలో రచ్చ జరుగుతోందా? మున్సిపల్ ఎలక్షన్స్‌లో అసలేం జరిగింది? అది ఇప్పుడెందుకు ఇష్యూ అవుతోంది? కొట్టాలి…. గట్టిగా కొట్టాలి…. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌ని ట్రయల్ రన్‌గా భావించాలంటూ అప్పట్లో పెద్ద పెద్ద మాటలే చెప్పారు తెలంగాణ బీజేపీ నాయకులు. అందుకోసం స్పెషల్ ప్లానింగ్ చేసి అంగబలం, అర్ధబలంతో రంగంలోకి దిగారు. ఆయా మున్సిపాలిటీల్లో పార్టీకున్న బలాన్ని బట్టి ABCDలుగా వర్గీకరించారు. ఇక గ్రేడ్‌ను బట్టి ఖర్చుల కోసం ఆయా మున్సిపాలీలకు డబ్బులు పంపించిందట బీజేపీ నాయకత్వం. పార్టీకి పట్టుంది, కచ్చితంగా ఎక్కువ వార్డ్‌లు గెలుస్తామనుకున్న చోటికి కాస్త అదనంగానే పైసలు సమకూర్చినట్టు చెబుతున్నారు. అంతవరకు బాగానే ఉన్నా… అనుకున్నంత ప్రభావం ఎందుకు చూపలేకపోయామంటూ ఫలితాల పోస్ట్‌మార్టం చేస్తున్న క్రమంలో కొన్ని కొన్ని సంగతులు తెలిసి పార్టీ పెద్దలు సైతం గుడ్లు తేలేస్తున్నారట.
కొన్ని మున్సిపాలిటీల్లో పెట్టిన ఖర్చుకు, వచ్చిన ఓట్లకు ఓ మాత్రం పొంతనలేకుండా ఉందని చెబుతున్నాయి రాష్ట్ర బీజేపీ వర్గాలు. దానికి సంబంధించి ఢిల్లీ పెద్దలకు కూడా సమాచారం అందిందని, వాళ్ళు రిపోర్ట్ అడిగారన్న చర్చ జరుగుతోంది పార్టీలో. గతానికి భిన్నంగా ఈ సారి పురపాలక ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బులు పంపించిందట పార్టీ అగ్ర నాయకత్వం. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ప్రతి మున్సిపాలిటీకి లెక్కలుగట్టి పంపిణీ చేసినట్టు చెబుతున్నాయి కాషాయ వర్గాలు. అక్కడ ఉన్న ఓట్లు, వార్డ్‌లు, పార్టీ పరిస్థితిని బట్టి డబ్బుల బట్వాడా జరిగిందని అంటున్నారు. కానీ… ఆ మేరకు ఫలితాలు మాత్రం కనిపించలేదని అగ్ర నాయకులు సీరియస్ అయినట్టు తెలిసింది. మున్సిపల్ ఎన్నికలను పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు తీసుకున్నంత సీరియస్‌గా స్థానిక నాయకులు తీసుకోలేదని, అందుకే అలాంటి ఫలితాలు వచ్చాయన్నది లేటెస్ట్ ఇంటర్నల్ టాక్. ఇదే సమయంలో పై నుంచి వచ్చిన డబ్బును ఎక్కడికక్డ లోకల్ లీడర్‌షిప్ గట్టిగా నొక్కేసినట్టు తేలిందట. చాలాచోట్ల మున్సిపాలిటీలకు పంపించిన డబ్బులు సద్వినియోగం కాలేదని, తమకు డబ్బులు ఇవ్వలేదని పోటీ చేసిన అభ్యర్థులు రాష్ర్ట పార్టీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. లక్షల్లో సొమ్ము పంపితే కనీసం వంద ఓట్లు కూడా పడని నియోజకవర్గాలు సైతం ఉన్నాయట.
ఆ ఫలితాలపై పార్టీ రాష్ర్ట కార్యాలయంలో ఇటీవల సమీక్ష జరిగింది. ఆ సందర్భంగానే… అయిన ఖర్చు, వచ్చిన ఓట్ల గురించి గట్టిగానే చర్చించినట్టు సమాచారం. లక్షలు ఖర్చయిన చోట్ల కూడా అసలు జీరోకు పరిమితం అవడం ఏంటని స్థానిక నాయకత్వాలను పార్టీ పెద్దలు నిలదీసినట్టు సమాచారం. ఆ సందర్భంగానే నొక్కుడు ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. పై నుంచి వచ్చిన డబ్బులు పంచకుండా చాలామంది స్థానిక నాయకులు జేబులో వేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. చివరికి అభ్యర్థులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుంటే ఏం ఓట్లు పడతాయి? ఎలా గెలుస్తారంటూ పార్టీలో అంతర్గతంగా గట్టిగా రచ్చ అవుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర పార్టీకి ఫిర్యాదులు అందడంతో…. ఢిల్లీ నేతల ఆదేశాలతో సమీక్ష పేరుతో పోస్ట్‌మార్టం పెట్టినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే డబ్బులు నొక్కేశారు నాయకులు. దీంతో… ఈవ్యవహారాన్ని అంత తేలిగ్గా వదలకూడదని, ఇక మున్సిపాలిటీల వారీగా స్పెషల్ ఎంక్వైరీ చేయించాలని బీజేపీ పెద్దలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.
