Off The Record : ఏఐసీసీ కార్యదర్శులకు తెలంగాణ కలిసివస్తోందా..?

  • తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శులకు కలిసి వస్తోందన్న టాక్‌
  • కుంతియా నుంచి దీపాదాస్‌ వరకు కలిసిరాని ఇన్ఛార్జ్‌ పదవి
  • అందరికీ కలిసి వస్తున్న కార్యదర్శుల పోస్ట్‌లు
  • రాష్ట్ర కార్యదర్శులుగా ఉన్న ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపు
Congress

Congress

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాలు కొందరికి అస్సలు కలిసి రాకుంటే… మరికొందరు మాత్రం ఇక్కడ అడుగు పెడితే నక్కతోక తొక్కినట్టు ఫీలవుతున్నారా? రాష్ట్ర వ్యవహారాలు చూసిన కొందరికి అదృష్టం తేనెపట్టు పట్టినట్టు పడుతోందా? ఇక్కడి వ్యవహారాలు ఎవరికి కలిసి రావడం లేదు? ఎవరెవరికి కలిసి వచ్చాయి..? అసలా లక్కీ భాస్కర్స్‌ ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి ఏఐసీసీ ఇన్చార్జ్‌ పదవితో పాటు.. కార్యదర్శుల నియామకం కూడా ఉంటుంది. ఆ రకంగా స్టేట్‌లో ప్రస్తుతం ఏఐసీసీ నుంచి ఇద్దరు కార్యదర్శులు పనిచేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్‌ల హోదాలో పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అయితే… తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డ క్రమంలో ఓ సరికొత్త చర్చ మొదలైంది. తెలంగాణకి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్‌లుగా వస్తున్న వాళ్లకు కలసి రావడం లేదుగానీ….. కార్యదర్శులుగా వచ్చే వాళ్లకి మాత్రం కలిసి వస్తోంది, వాళ్ళకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతున్నట్టు విశ్లేషిస్తున్నారు.

 

తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్చార్జ్‌లుగా పనిచేసిన వాళ్లలో… కుంతియా నుంచి మొదలుకొని దీపాదాస్ మున్షీ వరకు చూస్తే.. వాళ్ళు ఎవ్వరికీ రాజకీయంగా పెద్దగా కలిసి వచ్చింది లేదు. వివాదాలతో ఠాగూర్‌ను రాష్ట్ర ఇన్ఛార్జ్‌గా తొలగించారు. ఎన్నికలకు ముందున్న ఠాక్రేను… ప్రభుత్వం ఏర్పడగానే…. ఇక్కడి నుండి షిఫ్ట్ చేశారు. ఇక దీపాదాస్ మున్షీని కూడా వివాదాలు.. విమర్శలతోనే తప్పించింది అధిష్టానం. ఐతే ఇన్ఛార్జ్‌లకు కలిసి రాకున్నా… ఎఐసిసి కార్యదర్శులకు మాత్రం తెలంగాణ కలిసి వస్తోంది. ఎన్నికల సమయంలో ఇక్కడ ఎఐసిసి కార్యదర్శిగా పనిచేసిన బోసురాజు ప్రస్తుతం కర్ణాటక క్యాబినెట్లో ఉన్నారు.

ఠాక్రే తోపాటుగా బోస్ రాజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులను సమన్వయం చేయడంలో కీలకంగా పని చేశారు. ఇక ప్రస్తుతం కేరళ… తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన వేళ ఏఐసీసీ కార్యదర్శుల అవకాశాలు చర్చకు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసిన pc విష్ణునాథ్, p. విశ్వనాధ్ ఇద్దరూ విజయం సాధించారు. కేరళలోని కుందర నియోజకవర్గం నుండి PC విష్ణునాథ్ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కేరళ ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. ఇక మరో కార్యదర్శి P. విశ్వనాథన్.. తమిళనాడులోని మెల్లూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా.. ప్రస్తుతం అక్కడ హంగ్‌ ఏర్పడ్డ క్రమంలో కాంగ్రెస్‌ టీవీకేతో చేతులు కలవవచ్చని అంటున్నారు. అదే జరిగితే…. తమిళనాడు ప్రభుత్వంలో విశ్వనాథన్‌కు మంత్రి పదవి దక్కవచ్చన్న అంచనాలున్నాయి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్ఛార్జ్‌లుగా వచ్చేవాళ్ళకు కలిసి రాకున్నా… కార్యదర్శులకు మాత్రం బాగా కలిసొస్తోందన్న టాక్‌ మొదలైంది. ఇప్పుడు కేరళ…తమిళనాడు లో గెలిచిన ఇద్దరూ కార్యదర్శులు కొనసాగుతారా..? లేక సొంత రాష్ట్రాల్లో బిజీ అయిపోతారా..? అన్నది ఒక డౌట్‌ అయితే… వాళ్ళు అక్కడ బిజీ అయిపోతే.. కొత్తగా ఎవరికి ఛాన్స్‌ వస్తుందన్నది ఇంకో క్వశ్చన్‌. ఎవరొచ్చినా మళ్లీ వాళ్ళు కూడా లక్కీ భాస్కర్స్‌ అవుతారేమోనంటూ చమత్కరిస్తున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు.