Site icon NTV Telugu

Off The Record : కాంగ్రెస్ ఇంచార్జ్ మంత్రులకు మున్సిపల్ ఎన్నికలు రియల్ ఛాలెంజ్?

Congress

Congress

నియోజకవర్గాలు అప్పగించారు. బాధ్యతలు పంచేశారు. పాజిటివ్‌ అయినా, నెగెటివ్ అయినా…. ఇక పూర్తి భారం మీదేనని క్లారీటీ ఇచ్చేశారు. ఇదే కొందరు తెలంగాణ మంత్రుల్ని టెన్షన్‌ పెడుతోందట. ఈ పరీక్ష ఎలా నెగ్గాలంటూ సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇంతకీ ఏంటా పరీక్ష? ఇన్ఛార్జ్‌ మినిస్టర్స్‌కు కంగారు ఎందుకు? మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ అధికార పక్షానికి సవాల్‌గా మారుతున్నాయి. పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌ని గెలుచుకోవాలని ఇప్పటికే నేతలకు దిశా నిర్దేశం చేసింది కాంగ్రెస్‌ హై కమాండ్. ఇవి పార్టీ సింబల్ మీద జరిగే ఎన్నికలు కావడంతో…. అనివార్యంగా ప్రభుత్వ పనితీరు, పార్టీ బలానికి సంబంధించిన లెక్కలు తెర మీదికి వస్తాయి. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎలక్షన్స్‌ ఛాలెంజ్‌ అవుతాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకే….అభ్యర్థుల ఎంపిక నుంచి మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకునే దాకా…. బాధ్యత మొత్తం ఇన్ఛార్జ్‌ మంత్రులదేనంటూ వాళ్ళ భుజాల మీద పెట్టారు పార్టీ పెద్దలు.

 

ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతను ఒక్కో మంత్రికి అప్పగించాలని సూచించారట సీఎం రేవంత్‌రెడ్డి. ఆ లెక్క ప్రకారం అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు తన పరిధిలోని మున్సిపాలిటీల పూర్తి బాధ్యత సదరు మంత్రిదే. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ బలంగా ఉందన్నది పార్టీ నాయకుల లెక్క. దాంతో… అక్కడ ఇన్ఛార్జ్‌ మంత్రులు పార్టీని గెలిపించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదన్న విశ్లేషణలున్నాయి. కానీ… మిగతా కొన్ని జిల్లాల్లో గడ్డు పరిస్థితులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాటిని అధిగమిస్తూ పూర్తిస్థాయిలో మెజారిటీ మున్సిపాలిటీలను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. అక్కడ లోక్‌సభ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి పార్టీలన్నీ కలిసి పనిచేశాయని ఇప్పటికే భావిస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు.

ఈ పరిస్థితుల్లో కొన్ని మున్సిపాలిటీలు ఇన్ఛార్జ్‌ మంత్రులకు సవాలేనన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కొందరిని టెన్షన్‌ పెడుతున్నాయట. ప్రధానంగా.. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో బలం పెంచుకున్నట్టు కనిపించడం లేదు. ఇక్కడ బీఆర్‌ఎస్‌, బీజేపీ బలంగా ఉన్నాయి. దాంతో ఆయా నియోజక వర్గాల్లో గెలిచి రావడం అంత తేలిక కాదన్న మాటలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండటం కొంత కలిసి వచ్చే అవకాశం అంశం అయినా….అప్రమత్తంగా ఉండాల్సిందేనని, గట్టిగా కష్టపడాల్సిందేనని అంటున్నారు పార్టీ నాయకులు. ఇలాంటి చర్చల నడుమే…. ఆయా నియోజకవర్గాల ఇంచార్జ్‌లకు టెన్షన్ పట్టుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆదిలాబాద్ ఇంచార్జ్‌గా.. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఆ నియోజకవర్గంలో కష్టపడకుండా కాంగ్రెస్‌ గెలుపు సాధ్యం కాదు. సిట్టింగ్ ఎంపీలు కూడా ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వారే కావడంతో టఫ్ ఛాలెంజ్. మరో నియోజకవర్గం కరీంనగర్.

 

ఇక్కడ కేంద్రమంత్రి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీ, BRS కూడా బలంగానే ఉన్నాయి. దీంతో.. అక్కడ ఇంచార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకి కూడా టఫ్‌ టాస్క్‌ అంటున్నారు. మిగిలిన పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న క్రమంలో ఆయన ఎలా వర్కవుట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరో సీనియర్ మినిస్టర్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయనకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా.. నిజామాబాద్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడి మున్సిపాలిటీ లు.. కార్పొరేషన్‌ను పూర్తిగా గెలిచి తీరాల్సిన అనివార్యత ఏర్పడింది. అటు PCC చీఫ్… ఇటు సీనియర్ మంత్రి ఉత్తం ఉన్నందున నిజామాబాద్ మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడి నాయకుల పనితీరుపై మంత్రి ఉత్తం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలంగా లేని నియోజకవర్గంలో గెలిచి రావాలనే టార్గెట్ పెట్టడంతో… ఉత్తమ్‌కు ఇది సవాలేనని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాల్ని సరిదిద్దే పనిలో పడ్డారు ఉత్తం. మొత్తానికి ఈ మూడు నియోజక వర్గాలతో పాటు బీజేపీ ఎంపీలు ఉన్న చోట..బీఆర్‌ఎస్‌ కూడా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదంటున్నారు. ఈ సవాళ్ళను ఇన్ఛార్జ్‌ మంత్రులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.

Exit mobile version