పార్టీ పాదుకునేందుకు అపారమైన అవకాశాలున్నా… అక్కడి బీజేపీ లీడర్స్ మాత్రం స్వయంకృతాలతో పాడు చేస్తున్నారా? ఆధిపత్య పోరులో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ… కేడర్‌ని కూడా గందరగోళ పెడుతున్నారా? క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో పబ్లిక్ డయాస్ మీదే తిట్టుకునే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎక్కడ ఉందా పరిస్థితి? బీజేపీ అంటేనే క్రమశిక్షణకు కేరాఫ్ అనుకుంటారు. కానీ సంగారెడ్డి జిల్లాలో మాత్రం వ్యవహారం కాస్త తేడాగా ఉందట. ఇక్కడ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్ లాంటి నేతలున్నారు. ఆశిష్ గౌడ్, ఆదిత్య లాంటి యువ నాయకులు కూడా జిల్లాలో ఉన్నారు. కానీ…ఎవరి మధ్య సరైన సయోధ్య లేక గ్రూప్‌వార్ పెరుగుతోంది. చివరికి రాష్ట్ర నాయకత్వం చీవాట్లు పెట్టేవరకు వెళ్ళిందట. మిగతా జిల్లాల్లోనూ గ్రూపు గొడవలున్నా… ఎక్కడా బయటపడటంలేదుగానీ సంగారెడ్డిలో మాత్రం పార్టీ కార్యక్రమం జరిగితే చాలు…. ఏదో ఓ వివాదం చెలరేగి చినికి చినికి గాలి వానలా మారుతోందట. జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలుంటే ఆందోల్, జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో పార్టీని నడిపించే నాయకులే లేరు. మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలవడం పార్టీకి కొంత ఊరటనిచ్చింది. జహీరాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా పోటీ చేసిన బీబీ పాటిల్ ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. జిల్లా పార్టీలోని పెద్దలు తమ స్వలాభమే చూసుకుంటున్నారు తప్ప వోవరాల్‌గా బలోపేతంపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనేది క్యాడర్ ఆరోపణ. ఈ పరిస్థితుల్లో… త్వరలోనే పరిషత్ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకోసమైనా… ఇప్పటి నుంచే పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సింది పోయి కుమ్ములాటలకు దిగుతున్నారట నేతలు. గోదావరి అంజిరెడ్డి మొదటి సారి జిల్లా అధ్యక్షురాలైనప్పుడు పార్టీలో ఎటువంటి గొడవలు లేవు.
కానీ రెండో సారి బాధ్యతలు తీసుకున్నాక లుకలుకలు బయటపడ్డాయి. పదవుల పంపకాల్లో అన్యాయం జరిగిందని సొంత పార్టీ నాయకులే జిల్లా కార్యాలయం ఎదుట ఆందోళనలు చేసిన ఘటనలున్నాయి. అలాగే ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలవకముందే ఆయన గోదావరికి జిల్లా అధ్యక్షురాలి పదవి ఇచ్చారు. ఒకే ఇంట్లో రెండు పదవులివ్వడమేంటి? కొత్త వారికి అవకాశమిస్తే బాగుంటుందని అప్పటి నుంచే పార్టీలోని ఆశవహులు గొడవలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య ఈ వివాదం మరింత ముదిరిందట. సంగారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. దీంతో ఈ సారైనా బీసీలకు పదవి ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బీసీ నేతల్లో పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిశ్ గౌడ్ ఆశిస్తున్నట్టు తెలిసింది. దీనికి తోడు ఇద్దరిది పటాన్ చెరు నియోజకవర్గమే కావడంతో గోదావరి అంజిరెడ్డి దంపతులకు, నందీశ్వర్ గౌడ్ కుటుంబం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. ఇదిలా ఉంటే సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ శిక్షణ కార్యక్రమం సాక్షిగా పార్టీలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయట. పార్టీ రాష్ట్ర నేత ఓ.శ్రీనివాస్ రెడ్డి నాయకులకు క్లాస్ చెబుతుండగా…. తనకి టైం లేదని, తాను చెప్పాల్సింది చెప్పేసి వెళ్తానని అన్నారట మాజీ ఎంపీ బీబీ పాటిల్. దీంతో ఓ శ్రీనివాస్ రెడ్డి ఇది తనకు ఇచ్చిన సమయం కాబట్టి తానే క్లాస్ చెబుతానని మీకు పార్టీ విధి విధానాలు తెలియవు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారని అనడంతో ఇ్దదరి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీకి తాను ఎంతో సేవ చేశానని…ఫండింగ్ కూడా భారీగా ఇచ్చానని అలాంటి నన్ను పట్టుకుని విధివిధానాలు తెలియవంటారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట బీబీ పాటిల్. తర్వాత ఇంకొంచెం ముదుకు వెళ్ళి బీజేపీ ఆప్ కా బాప్ కా పార్టీ హే క్యా… అంటూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయారట మాజీ ఎంపీ. అదే సమయంలో పటాన్ చెరు నాయకుడు ఆశిశ్ గౌడ్ అక్కడికి వచ్చి కార్యక్రమానికి తనను ఎందుకు ఆహ్వానించలేదంటూ జిల్లా అధ్యక్షురాలితో గొడవకు దిగారట. ఇలా సంగారెడ్డి జిల్లా బీజేపీ లుకలుకలు బయటపడుతుండటంతో పార్టీ కార్యకర్తలు ఆందోళనలో ఉన్నారు. జిల్లా అధ్యక్షురాలు అందరిని కలుపుకుపోతున్నారని ఓ వర్గం చెబుతుంటే… మరో వర్గం మాత్రం ఆమె ఎఎవ్వర్నీ పట్టుంచుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తోంది. అలాగే ఒక లీడర్ దగ్గరికి వెళ్తే మరో లీడర్ ఏమనుకుంటారోనని కొందరైతే ఎవరి దగ్గరకు వెళ్లకుండా ఉంటున్నారట. ఈ వివాదాలకు ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందోనని కేడర్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
