కొడతాం… గట్టిగా కొట్టేస్తాం…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనమే ప్రత్యామ్నాయం కాబోతున్నాం… తెలంగాణ బీజేపీ నాయకులు తరచూ కేడర్‌కు చెప్పే మాటలివి. కానీ… వాస్తవంగా అంతుందా? పవర్ సంగతి తర్వాత… అసలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పార్టీ ఉనికి ఉందా? జెండా పట్టుకునే కార్యకర్తలు ఉన్నారా? మున్సిపల్ ఎన్నికల్లో బోర్లా పడ్డ పార్టీకి రేపు పరిషత్ ఎలక్షన్స్‌లో ఇంకా గట్టి దెబ్బ తగులుతుందా? అసలు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన జిల్లాలో ఏవి? తెలంగాణలో కమల వికాసం జరగాలంటే…. ముందు క్షేత్ర స్థాయిలో బలపడాలి, ఆ పార్టీ రాష్ట్ర మంతటా విస్తరించాలి. కానీ… వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఒక జిల్లాలో బలంగా ఉన్నామనుకునే లోపే… మరో జిల్లాలోని లోటు వెక్కిరిస్తోంది.
కొన్ని చోట్ల అయితే…. అసలు పార్టీ జెండా పట్టేవాళ్ళు కూడా కరవయ్యారు. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికలతో రాష్ర్ట మంతటా… విస్తరించాం అని ఆ పార్టీ నాయకత్వం చెప్పుకుంటున్నా… వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అస్సలు పుంజుకోలేదని మున్సిపల్ ఫలితాలే చెబుతున్నాయి. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ పరిస్థితి దయనీయంగా ఉందన్నది విస్తృతాభిప్రాయం. మిగతా జిల్లాల్లో అంతో ఇంతో ప్రభావం చూపగలిగినా…. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మాత్రం కనీస మాత్రంగా కూడా చూపెట్టలేక పోయింది. అసలు అక్కడ కాషాయదళం ఉందా అన్న డౌట్స్ కూడా వచ్చాయట కొందరికి. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ జిల్లాల మీద ఫోకస్ పెట్టడం లేదని, అందుకే ఇలా ఉందన్న మాటలు బీజేపీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇకనైనా…జాగ్రత్తలు తీసుకోకుంటే… ఆ మూడు జిల్లాలను పూర్తిగా మర్చిపోవాల్సి వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి కేడర్ నుంచి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయి తప్ప… ఏ మాత్రం మార్పు రాదని అంటున్నారు కార్యకర్తలు.
పార్టీలోకి జాయినింగ్ ఉన్నా, ఏదన్నా వేరే హడావుడి జరిగినా… మిగతా జిల్లాల్లోనే ఉంటున్నాయి తప్ప ఈ మూడు చోట్ల చడీ చప్పుడు ఉండటం లేదట. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెల్చుకుంది బీజేపీ. కానీ… ఈ మూడు జిల్లాల పరిధిలోకి వచ్చే లోక్‌సభ సీట్లలో ఒకటి రెండు మినహా… మిగతా ఎక్కడా డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ పరిస్థితుల్లో… త్వరలో జరగనున్న ZPTC, MPTC ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్‌లో కూడా పార్టీకి అంత సీన్ ఉండకపోవచ్చన్నది ఇంటర్నల్‌గా జరుగుతున్న చర్చ. అసలు ఈ మూడు జిల్లాల్లో పార్టీని భుజాన వేసుకుని తిరిగే నేతలు కరవయ్యారట. రాష్ర్ట పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూసే వారు సైతం ఈ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదని అంటున్నారు. మనం అంత ఎగిగాం, ఇంత ఎదిగాం, గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ ఓట్లు పడ్డాయంటూ ఎప్పటికప్పుడు అల్ప సంతోషపు మాటలు, కట్టు కథలు చెప్పుకోవడం మానేసి ముందు రాష్ట్ర మంతటా విస్తరించేందుకు ప్రయత్నిస్తేనే భవిష్యత్ అని గట్టిగా చెబుతోంది పార్టీలోని ఓ వర్గం. ఒకప్పుడు బీజేపీకి దేశంలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే…. అందులో ఒకదాన్ని ఈ ప్రాంతం నుంచే గెలుచుకున్నా… ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. వీటన్నిటికీ మించి పార్టీలో చేరిన వారు కూడా… ఇప్పుడసలు ఉండాలా పోవాలా అనే మీమాంసలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికైనా… పార్టీ ఎంపీలకు వాళ్ళ నియోజకవర్గాలను కాకుండా….. ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఒక లోక్‌సభ సీటు బాధ్యతలు అప్పగించాలన్న మాట వినిపిస్తోంది పార్టీ వర్గాల నుంచి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పరిషత్ ఎన్నికలను టార్గెట్ పెట్టుకుని ప్లానింగ్ చేసుకుంటే… కనీసం వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎలక్షన్స్ నాటికన్నా పార్టీ పుంజుకుంటుంది, లేకపోతే అంతే సంగతులని తెలంగాణ బీజేపీ నాయకుల్లోనే చర్చ జరుగుతోంది.
