తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఎక్కడ? ఈసారైనా అన్ని వార్డుల్లో అభ్యర్థుల్ని నిలబెట్టగలదా? ప్రత్యామ్నాయ శక్తి మేమేనంటూ గొప్పలు చెప్పడమేనా? మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఆ సత్తా ఏంటో చూపించేది ఉందా? రాష్ట్రంలో అధికార పీఠం కోసం కలలుగంటున్న కమలనాథులు కార్యాచరణలో ఎక్కడున్నారు? లెట్స్ వాచ్. తెలంగాణలో అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమంటూ చాలా రోజులుగా చెబుతోంది బీజేపీ. అయితే… అవన్నీ మాటలే తప్ప చేతల్లో మేటర్ ఉండటం లేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. నెక్స్ట్ మేమేనని కొన్నేళ్ళుగా అంటునే ఉన్నా… ఎన్నికల టైం వచ్చేసరికి చతికిలపడుతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. జాతీయ నాయకత్వపు ఛరిష్మాతో లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపడం మినహా… స్టేట్ లీడర్ షిప్ ప్రమేయం ఉన్న ఏ ఎన్నికలోనూ కాషాయ దళం ఆశించినంత ప్రభావం చూపలేకపోయిందన్నది విశ్లేషకుల మాట. అందుకు సమాధానంగా మాకు సీట్లు రాకున్నా ఓట్ల శాతాన్ని పెంచుకోగలుగుతున్నామన్నది తెలంగాణ కమలనాధుల మాట. కానీ… అందుకు కూడా కౌంటర్స్ గట్టిగానే పడుతున్నాయి వివిధ వర్గాల నుంచి. నెక్స్ట్ మేమే…. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని గట్టిగా మాట్లాడే పార్టీ ఎప్పటికప్పుడు కేవలం ఓట్ల శాతం పెరుగుతోందంటూ సంబరపడితే ఎలాగన్నది విమర్శకుల ప్రశ్న. దీంతో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఈసారి అధికార పీఠం మాదేనని చెప్పుకుంటున్న స్థాయిలో ఇప్పుడు పట్టణాల్లో ప్రభావం చూపగలదా అన్న చర్చలు నడుస్తున్నాయి. 2020 మున్సిపల్ ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపలేకపోయింది బీజేపీ. అప్పుడు 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్స్‌కు ఎన్నికలు జరిగాయి.
అప్పుడు కేవలం రెండు మున్సిపాలిటీలు, అందులోనూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని మక్తల్, ఆమనగల్‌ను మాత్రమే గెల్చుకుంది బీజేపీ. ఇక వార్డుల విషయానికి వస్తే…. మొత్తం 2 వేల 727 వార్డ్స్ ఉంటే…. అప్పుడు 2 వేల 26 వార్డుల్లో పోటీ చేసిన కమలం పార్టీ… 237 చోట్ల మాత్రమే గెలవగలిగింది. అప్పుడసలు 700 వార్డుల్లో బీజేపీకి అభ్యర్థులు కూడా కరవయ్యారు. ఇక కార్పొరేషన్స్ విషయానికి వస్తే…. 10 మున్సిపల్ కార్పొరేషన్స్‌లో 385 డివిజన్స్ ఉంటే…. బీజేపీ 344 చోట్ల పోటీ చేసి కేవలం 78 డివిజన్స్‌లోనే గెలవగలిగింది. అర్బన్ పార్టీ ఇమేజ్ ఉన్న బీజేపీ కనీసం అన్ని డివిజన్స్‌లో కార్పొరేటర్ అభ్యర్థులను పెట్టలేకపోవడం ఏంటన్న చర్చ అప్పట్లో జరిగింది. అప్పుడు అభ్యర్థులను పెట్టినా…. 48 మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్స్‌లో అస్సలు ఖాతా తెరవలేకపోవడం గురించి కూడా రకరకాల విశ్లే,ణలు వినిపించాయి. ఒక్క నిజామాబాద్, కరీం నగర్ కార్పొరేషన్లలోనే బీజేపీ ప్రభావం చూపగలిగింది. ఇక ప్రస్తుతానికి వస్తే…. ఈసారి 116 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్స్‌కు ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 2 వేల 996 వార్డ్‌లు ఉన్నాయి. గతం గతహ అనుకున్నా…. ఈసారన్నా అన్ని వార్డుల్లో బీజేపీ అభ్యర్థులను పెట్టగలదా అన్న ప్రశ్నలు అలాగే ఉన్నాయట రాజకీయవర్గాల్లో.
ఉన్నది తక్కువ టైం.. ఆ పార్టీ బలం ఉన్న, నేతలు ఉన్న చోట ఒకేగానీ…. మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది అంతుబట్టకుండా ఉందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంద శాతం సీట్లలో పోటీ సంగతి తర్వాత… 95 శాతాన్ని భర్తీ చేయగలిగినా గొప్పేనని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. డౌటే లేదు… వంద శాతం బరిలో ఉంటామని కొందరు నాయకులు అంటున్నా… నామినేషన్స్ ఉప సంహరణ తర్వాతే దాని గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందన్నది పొలిటికల్ డిస్కషన్. ప్రస్తుతం బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ కలిపి 50 వరకు ఉన్నాయి. దీంతో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో తమకు పట్టు ఉంటుందని, ఓట్ బ్యాంక్ మొత్తం అక్కడే ఉందని ఘనంగా చెప్పుకుంటున్న పరిస్థితుల్లో….తెలంగాణ కాషాయ దళానికి ఈ మున్సిపల్ ఎన్నికలు అగ్నిపరీక్షేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో తాము కూడా బలమైన శక్తి అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో సత్తాచాటి తామేంటో నిరూపించుకుంటేనే కేడర్‌లో కూడా కాస్త ఆత్మ విశ్వాసం పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు. అలా కాకుండా… ఎప్పట్లాగే ప్రత్యామ్నాయం మేమేనంటూ భారీ భారీ డైలాగులు కొట్టి… తీరా ఆచరణలో విఫలమైతే… దాని ప్రభావం ఈసారి అసెంబ్లీ ఎన్నికలదాకా ఉంటుందన్నది పొలిటికల్ పండిట్స్ మాట.
