Site icon NTV Telugu

Off The Record : తెలంగాణ బీజేపీలో కట్టు తప్పుతున్న క్రమశిక్షణ

Bjp Tg

Bjp Tg

క్రమశిక్షణకు కేరాఫ్‌ అని ఢంకా బజాయించే బీజేపీలో ఆ పరిస్థితులు మారిపోతున్నాయా? కీచులాటలకు కేరాఫ్‌ అవుతోందా? ఎక్కడికక్కడ జిల్లాల్లో లొల్లి పెరిగిపోతోందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు ఏం చెబుతున్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ బీజేపీలో పరిస్థితులు మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్ళు, బలం, జనంలోకి వెళ్లే సంగతులు ఎలాఉన్నా… క్రమశిక్షణ విషయంలో మాత్రం కట్టు తప్పలేదన్న అభిప్రాయం ఉండేది. కానీ… తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆ పరిస్థితుల్ని మార్చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పంచాయతీ కొంత కాలంగా నడుస్తోంది. జిల్లా అధ్యక్షుడి ఎంపిక విషయంలో నేతల మధ్య కోల్డ్ వార్ నడిచింది. జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డిపై ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బహిరంగంగానే కామెంట్ చేశారు. ఆయన్ని తీసేయాలని పట్టుబట్టారు.

ఆ పంచాయితీని తీర్చేందుకు రాష్ర్ట పార్టీ ఓ కమిటీ వేసింది. జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన కమిటీ రాష్ర్ట అధ్యక్షుడికి రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగా.. జిల్లా అధ్యక్షుడిని రాజీనామా చేయాలని స్టేట్‌ ప్రెసిడెంట్‌ రామచందర్‌రావు ఆదేశించారని, ఆ ప్రకారమే రాజీనామా లేఖను సమర్పించినట్టు సమాచారం. మొత్తం మీద ఆ ఎపిసోడ్‌లో తన పంతం నెగ్గించుకున్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. ఇలాంటి పరిస్థితి ఇంకా ఆరు జిల్లాల్లో ఉన్నట్టు చెప్పుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. ఆ ఆరు చోట్ల అధ్యక్షుల పరిస్థితి చివరికి వచ్చిందని, వాళ్ళ మెడల మీద కత్తులు వేలాడుతున్నాయన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌. మరోవైపు మంచిర్యాలలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ నేతలు గొడవపడ్డారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే తిట్టుకున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత, గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్ మధ్య పంచాయితీ తీవ్ర స్థాయికి చేరింది.

వాళ్ళిద్దరికీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ షో కాజ్ నోటీసు ఇచ్చింది. ప్రస్తుతం వాళ్ళు పార్టీలో కలిసి కొనసాగే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. పార్టీ పెద్దలు చర్యలకు సిద్ధమవుతున్న క్రమంసో… వాళ్ళు ఉంటారా గుడ్ బై కొడతారా అన్న చర్చ జరుగుతోంది. పెద్దలు మాత్రం లైన్ దాటితే కఠినంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. గతంలో ఈ పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి లో నేతలు లొల్లి పెట్టుకున్నారు .. అప్పుడు కూడా పార్టీ అధ్యక్షుడి ముందే జరిగింది…. చాలా జిల్లాలో ఇలాగే అంతర్గత క్రమశిక్షణారాహిత్యం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది బీజేపీ సర్కిల్స్‌లో. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాది ఇంకో వివాదం. ఇక్కడ ఉన్న బలమే అంతంత మాత్రం, అందులో కూడా గొడవలే. ఆ వివాదాల్ని సెట్‌ చేయడానికి రాష్ర్ట పార్టీ ఒక కమిటీని నియమించింది. రిపోర్ట్ వచ్చాక అక్కడ కూడా చర్యలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి కమలంలో క్రమ శిక్షణ కట్టు తప్పుతోంది… పార్టీ లెటర్ లు, షో కా జ్ నోటీసులు ఏ మేరకు పనిచేస్తాయో మరి.

Exit mobile version