Site icon NTV Telugu

Off The Record : లోకల్ బాడీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ కొత్త ఎత్తులు

Bjp

Bjp

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం తెలంగాణ బీజేపీ కొత్త ఎత్తులేస్తోందా? ఇన్నాళ్ళు… ఎక్కడ, ఎందుకు వెనకబడ్డామో… ఆ పార్టీకి ఇప్పుడు తెలిసొచ్చిందా? అందుకే ఇప్పటికైనా మించిపోయిందేం లేదనుకుంటూ… పార్టీ లీడర్స్‌కు స్పెషల్‌ మైకులు అందిస్తోందా? ఇంతకీ ఏ విషయంలో బీజేపీ రియలైజ్‌ అయింది? లోకల్‌ బాడీస్‌ ఎలక్షన్స్‌లో జనానికి ఏం చెప్పాలనుకుంటోంది? తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కొత్త అస్త్రానికి పదును పెడుతోందట. ఇన్నాళ్ళు అనుసరించిన వ్యూహానికి భిన్నంగా ఇప్పుడు కేంద్ర ప్రాధాన్యతను వివరిస్తూ…తమను తాము హైలైట్‌ చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే… కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టుకోవడం ఎంత ముఖ్యమో ఊరూరా వివరించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇన్నాళ్ళు సరిగా ప్రజెంట్‌ చేయలేకపోవడం వల్లే నష్టపోయామని భావిస్తున్న కాషాయ దళం ఇప్పుడా లోటును భర్తీ చేసుకుని ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోందట. గ్రామాలకు కేంద్ర నిధులు రావాలన్నా…అభివృద్ధి జరగాలన్నా… బీజేపీని గెలిపించాల్సిందేనన్న నినాదాన్ని అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే గ్రామాలకు కళ వస్తుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి పుష్కలంగా నిధులు వస్తే… అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్నారు కమలం నేతలు. కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొంటూ, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదని అంటున్నారు బీజేపీ లీడర్స్‌.

ఉచిత బియ్యంతోపాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల అకౌంట్లలో క్రమం తప్పకుండా నిధుల్ని కేంద్రమే జమ చేస్తోందని చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు, ఇంటింటికీ నీళ్లు వంటి కార్యక్రమాలన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని, ఎరువుల సబ్సిడీని కూడా కేంద్రమే ఇస్తోందన్న ప్రచారాన్ని గ్రామగ్రామాన చేసేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయట. గతంలో బీఆర్‌ఎస్ స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని, కేంద్ర నిధులను దారి మళ్లించడం వల్ల గ్రామాలు దెబ్బతిన్నాయని, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితి మారకపోగా… ఇచ్చిన రైతు భరోసా వాగ్దానం అమలులో కూడా విఫలమైందని అంటున్నారు కాషాయ నేతలు. ఎరువుల పంపిణీ చేతకాక కృత్రిమ కొరతకు పూర్తి బాధ్యులు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలేనని ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్స్‌. ఇక కేంద్ర ప్రభుత్వం పథకాలు, రాష్ర్ట ప్రభుత్వాలు చేసింది, చేస్తున్నదాన్ని పోల్చి చూపెట్టి ప్రజల్ని తమ వైపునకు తిప్పుకోవాలనే ఎత్తుగడ కమలం పార్టీకి ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వల్ల గ్రామాలు నిర్వీర్యం అయ్యాయని, తాము గెలిస్తే మళ్ళీ కళకలలాడుతాయని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. మరి లోకల్ వార్‌లో కమలం పార్టీ వేసిన స్కెచ్‌ సక్సెస్ అవుతుందా… బీజేపీ చెప్పుతున్న దానికి ప్రజలు కనెక్ట్ అయ్యి ఓట్లు గుద్దేస్తారా? లేదా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version