ఒకరు మాజీ ఎమ్మెల్యే…మరొకరు మేజర్ సిటీకి మేయర్. రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించే అన్నదమ్ములకు వ్యక్తిగతంగా మిస్టర్ కూల్ ఇమేజ్ ఉంది. అధికారం చేతుల్లో ఉన్నా మెత్తగా కనిపిస్తే మొత్తేస్తున్నారని అనుకున్నారో ఏమోగానీ….ఇటీవల ట్రెండ్ మార్చి సీమటపాకాయల్లా పేలుతున్నారు. త్యాగాలు చేస్తే చిన్న చూపు చూస్తారా…? అంటూ సొంత పార్టీ నాయకత్వం మీదే రుసరుసలాడుతున్నారు. మాకే ఎందుకిలా అని ఫీలవుకున్న ఆ నాయకులు ఎవరు? ఎక్కడ జరుగుతోందా ఎపిసోడ్?
పీలా బ్రదర్స్…!. ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో ఈ అన్నదమ్ముల వ్యవహార శైలే ఇప్పుడు హాట్ టాపిక్. ఒకరు మాజీ ఎమ్మెల్యే అయితే…. మరొకరు విశాఖ మేయర్. 2014 – 19 మధ్య అనకాపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు పీలా గోవింద్ సత్యనారాయణ . రెండో సారి పోటీ చేసి ఓడిపోయినా… ఐదేళ్లు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడారాయన. వర్గ రాజకీయాలు, అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ దూకుడును తట్టుకుని నిలబడటం గుర్తింపు తెచ్చింది. పార్టీకి మరోసారి అధికారం ఖాయమని….గవర సామాజిక వర్గం కోటాలో తనను అమాత్య యోగం వరిస్తుందని ఊహించుకున్న పీలా…. టిక్కెట్స్ ప్రకటించక ముందే ఒక విడత ఎన్నికల ప్రచారం ముగించి కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ప్రత్యర్థి ఎవరైనా….పీలాతో ఫైట్ కష్టం అనే జోష్ తెచ్చుకున్న టైంలో హైకమాండ్ ఇచ్చిన ట్విస్ట్ ఆయనకు కన్నీళ్ళు తెప్పించింది. జనసేన, టీడీపీ కూటమి తొలి షాక్ గోవింద్ కే తగిలింది. అనకాపల్లి సీటు కోసం పవన్ కళ్యాణ్, నాగబాబు పట్టుబట్టడంతో కూటమి ధర్మం కోసం పీలాను పక్కనబెట్టేసింది టీడీపీ అధిష్టానం. ఉమ్మడి అభ్యర్ధిగా వరుసకు వియ్యంకుడైన కొణతాల రామకృష్ణ పోటీ చేయడంతో ఇంటా బయట సర్దుబాటు ఈ మాజీ ఎమ్మెల్యేకు తప్పలేదు. ఇక అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నగోవింద్ కు ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే కీలకమైన అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. ప్రజా ప్రతినిధులతో సమానంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ ఆఫీషియోఅవకాశం కల్పించింది ప్రభుత్వం. ఐతే, రాజకీయంగా తన లక్ష్యం నెరవేరలేదని మథనపడుతున్న మాజీ ఎమ్మెల్యేకు ఇటీవలి పరిణామాలు పుండు మీద కారం చల్లినట్టు గానే అనిపిస్తున్నాయట.
సిట్టింగ్ ఎమ్మెల్యే కొణతాల జిల్లాలో చురుకైన రాజకీయం చేస్తున్నారు. అటు యంత్రాంగం, ఇటు ప్రభుత్వ వర్గాలు ఆయనకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ స్థాయిలో ఎమ్మెల్యే కూటమిని లీడ్ చేస్తుండగా… పీలాకు మాత్రం అధికారిక కార్యక్రమాలకు కూడా పిలుపు అందడం లేదట. కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ ఆయన కస్సుబుస్సులాడుతున్నట్టు తెలుస్తోంది. వరుస అవమానాలతో విసిగిపోయిన మాజీ ఎమ్మెల్యే…. మరీ ఇంత చీప్ ట్రీట్మెంట్ ఎందుకంటూ జిల్లా మంత్రి అనిత దగ్గరకు వెళితే అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయిందట. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి ఆలస్యంగా పిలుపు అందుకుని వెళితే…. హోం మంత్రి కనీసం కారు కూడా ఆపకుండా వెళ్ళిపోవడం పీలాకు గొంతులో పచ్చికారం పడ్డట్టయింది. సహనం చచ్చిపోయి ఫోన్లోనే హోం మంత్రిని ఓ రేంజ్‌లో నిలదీసి సీఎం దగ్గరే పంచాయితీ పెడతానని చేసిన హెచ్చరికలు బాగా వైరల్ అయ్యాయి. గోవిందే ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవుతుంటే… ఆయన సోదరుడు శ్రీనివాస్‌ది కూడా అదే పరిస్థితి. గ్రేటర్ విశాఖ తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిది. అధికారంతో సంబంధం లేకుండా సిటీ పరిధిలోని నాలుగు స్థానాలను గెలుస్తూ వస్తోంది. సంస్థాగతంగానూ., ప్రజల మద్దతు కూడగడంలోనూ సక్సెస్ అవుతున్న సైకిల్ పార్టీకి….జీవీఎంసీవై పట్టు సాధించడానికి చాలా కాలం పట్టింది. 98 స్థానాలు ఉన్న జీవీఎంసీకి 2021లో జరిగిన ఎన్నికలో 58 మంది కార్పొరేటర్ల బలంతో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది వైసీపీ. అప్పట్లోనే మేయర్ అభ్యర్థిగా ప్రచారం లోకి వచ్చిన పీలా శ్రీనివాస్ ఆ కోరిక తీర్చుకోవడానికి నాలుగేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అనూహ్య పరిణామాల మధ్య వైసిపి మేయర్ ను అవిశ్వాసంతో దించేసిన కూటమి పార్టీలు పీలా శ్రీనివాస్‌్కు పట్టం కట్టాయి. మరో రెండు నెలల్లో పదవీకాలం ముగుస్తుండగా మేయర్ వైఖరి తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఎవరన్నా ఆదేశించారో….లేక అధికారులే పట్టించుకోవట్లేదో తెలియదు కానీ కీలక సమావేశంలో మేయర్‌కు కనీస గౌరవం దక్కడం లేదట.దీంతో ఆయన రియాక్షన్ కూడా తీవ్రస్థాయిలోనే కనిపిస్తోంది. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో చివర సీటు ఇచ్చారని అలిగారు మేయర్. ఇన్చార్జ్ మంత్రి కలగ చేసుకుని సర్ది చెప్పడంతో ఆ వివాదం అక్కడికి సద్దుమణిగింది. మళ్లీ విశాఖ ఉత్సవాల దగ్గరకొచ్చేసరికి సేమ్ టు సేమ్ అదే సీన్. ఈ సారి ఆర్కే బీచ్ సాక్షిగా మంత్రులు అనిత, డోలా, దుర్గేష్ సమక్షంలోనే కుర్చీ ఫైట్ నడిచింది. ఇంత జరుగుతున్నా మంత్రులు ఫెస్ట్ మూడ్‌లో ఉన్నారు తప్ప మేయర్ ఆవేదనను కనీసం పట్టించు కోలేదు. స్వయంగా కలెక్టర్ జోక్యం చేసుకుని సముదాయించే ప్రయత్నం చేయగా పీలా శ్రీనివాస్ వ్యవహరించిన తీరు అధికారుల మనసు నొప్పించిందట. అటు మాజీ ఎమ్మెల్యే గోవింద్…ఇటు మేయర్ శ్రీనివాస్ ఇద్దరూ మర్యాద కోసం పాట్లు పడటం, యంత్రాంగం లైట్ తీసుకోవడం చూస్తుంటే అంతర్గతంగా ఏదో జరుగుతుందనే గుసగుసలు ఊపందుకున్నాయి. ఇక్కడ టార్గెట్ హోం మంత్రి అనిత కూడా కావొచ్చని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. మొత్తంగా ఉమ్మడి విశాఖజిల్లా టీడీపీలో ఇగో పాలిటిక్స్ అగ్గి రాజేస్తున్నట్టే కనిపిస్తోంది. కూటమి అధికారంలోకి రావడం కోసం త్యాగం చేసిన నేతలు ఒక్కొక్కరుగా ఎదురు తిరుగడం సైకిల్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
