అందితే జుట్టు..లేదంటే కాళ్ళు.. అన్నట్టుగా ఆ నియోజకవర్గ జనసేన నాయకులు వ్యవహరిస్తున్నారా ? గెలిచేవరకు అసవరమున్న నేతల కాళ్ళావేళ్ళా పడ్డ లీడర్లు…అధికారంలోకి రాగానే కారాలు మిరియాలు నూరుతున్నారా ? అంతంత మాత్రంగా ఉన్న జనసేన పార్టీకి భుజం కాసి గెలిపిస్తే…ఇపుడు తమనే పక్కనపెట్టాలని చూస్తుండటంతో అసంతృప్తితో రగిలిపోతున్నారా ? పొత్తుధర్మాన్ని పాటిస్తూ…పల్లకి ఎక్కిస్తే ఇపుడు తమ ఉనికికే పాడిగట్టాలని చూస్తున్నారని వాపోతున్నదెవరు ?
అధికారంలోకి వచ్చి ఏడాదికే క్షేత్రస్థాయిలో నాయకులు…అసంతృప్తిని మాత్రం చల్లార్చలేకపోతున్నారు టిడిపి-జనసేన పెద్దలు. 2024 ఎన్నికల్లో జనసేన తరపున ఉంగుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన పత్సమట్ల ధర్మరాజుతో పాటు ఆయన అనుచరవర్గం…అందితే జుట్టు లేదంటే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిచేవరకు తమ కాళ్ళావేళ్ళాపడ్డ నేతలంతా…ఇపుడు టిడిపి ఉనికిని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారని తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇటీవల నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమంటున్నారు టిడిపి నాయకులు. ఉంగుటూరు నియోజకవర్గంలో సీనియర్ లీడర్ గన్నీ వీరాంజనేయులుకు రావాల్సిన అవకాశాన్ని…జనసేన ఎగరేసుకుపోయిందనేది ఓపెన్ సీక్రెట్. జనసేన అధ్యక్షుడి తర్వాత కీరోల్ ప్లే చేసే నేతను బుట్టలో వేసుకుని… ఉంగుటూరు సీటు సంపాదించడాన్ని టిడిపి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. వాస్తవానికి ఉంగుటూరులో జనసేన కంటే టిడిపికి ఉన్న బలం ఎక్కువ. పార్టీ అధినేత ఆదేశాలతో సీటు జనసేనకు వెళ్ళినా…ఏ మాత్రం వెనుకడుగేయకుండా తిరుగులేని విజయాన్ని అందించడంలో టిడిపి కీ రోల్ ప్లే చేసిందనేది జగమెరిగిన సత్యం.
నిన్నమొన్నటి వరకు అన్ని కార్యక్రమాలకు టిడిపి నేతలను వెంట పెట్టుకుని తిరిగిన జనసేన నేతలు…ఇపుడు దూరం పాటిస్తున్నారని మండిపడుతున్నారు. అదే సమయంలో తాము బలపడటానికి ప్రయత్నిస్తుంటే…మధ్యలో మీ పెత్తనమేంటనేలా జనసేన నేతలు వ్యవహరిస్తున్నారు. దీంతో రెండు పార్టీల్లో కార్యకర్తలు, నాయకులు ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. జనసేన నేతల తీరుతో మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్న కొందరు టిడిపి నేతలు…సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో రెండు పార్టీల మధ్య దూరం మరింత పెరిగింది. గాలివాటంగా గెలిచిన నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోండనేలా…జనసేన నేతల్ని ఉద్దేశిస్తూ టిడిపి నాయకులు కామెంట్స్ చేయడం పెద్ద దుమారాన్నే రేపిందట. దీనికి కౌంటర్‌గా జనసేన నేతలు నాలుగడుగులు ముందుకేసి…ఉండేది మేమే..మిగిలేది మేమే అన్నట్టుగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశమయిందట. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇపుడు టిడిపి-జనసేన నేతల మధ్య ఎవరిది పైచేయి అన్నట్టుగా రాజకీయం సాగుతోందట. సీటు వదులుకున్న తర్వాత ఏడాది పాటు ఇబ్బందులు పడిన మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకి…ఇటీవల నామినేటెడ్ పదవులు దక్కడంతో స్పీడు పెంచారట. గత ఎన్నికల్లో జనసేనకు సీటు కేటాయించాం…వచ్చే ఎన్నికల్లో టిడిపికే ఇస్తామని మాజీ ఎమ్మెల్యేకు అధిష్టానం నుంచి హామీ వచ్చిందట. దీంతో తొలి అడుగు కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్నారట గన్ని వీరాంజినేయులు. మళ్ళీ జనంలో ఉండేందుకు మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తుంటే…జనసేన ఎమ్మెల్యే “పల్లెపల్లెకు పత్సమట్ల” అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో ఎవరి దారివారితే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట.
ఆధిపత్యపోరులో కొందరు నేతలు…కామ్‌గా ఉండిపోతున్నారట. మట్టి అక్రమతవ్వకాల నుంచి అక్రమ చేపల చెరువులకు వంత పాడే విషయంలో…టీడీపీకి మాత్రం సహకరించడం లేదట. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి టిడిపి నేతలు తీసుకెళ్ళినా…పైకి ఓకే అంటున్న ఆ తర్వాత తన రాజకీయం తాను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట తమ్ముళ్ళు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇద్దరికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కొంతమంది పార్టీ నేతలు…ఇరుపార్టీల నేతలు కలసి కుర్చుని మాట్లాడుకుని సామరస్యంగా ముందుకెళ్ళాలని సూచిస్తున్నారట.
