దేవుడా…. ఈ గండం నుంచి గట్టెక్కితే చాలని అక్కడి టీడీపీ నాయకులు ప్రార్ధిస్తున్నారా? ఎక్స్ట్రా లగేజిని మేం మోయాల్సి వస్తోందని ఫీలవుతున్నారా? మనసొప్పకున్నా… గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయకుంటే పరువు పోతుందన్న భయంతో… ఆ విధంగా ముందుకు వెళ్తున్నారా? ఎక్కడుందా పరిస్థితి? అధికార పార్టీ నాయకులు అంతలా ఫీలవడం వెనకున్న రీజన్స్ ఏంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒక కార్పొరేషన్.. ఒక మున్సిపాలిటీ.. ఇప్పుడు కూటమి పెద్దలకు సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయట. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ తిరుగులేని మెజారిటీలతో విజయం సాధించిన నేతలకు ఇప్పుడు ఈ స్థానిక సమరం ముచ్చెమటలు పట్టిస్తోందంటున్నారు. దేవుడా… ఈ గండం నుంచి గట్టెక్కితే చాలంటూ అక్కడి ప్రజాప్రతినిధులు నిట్టూరుస్తున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలను రిపీట్ చేయకపోతే అధిష్ఠానం వద్ద పరువు పోతుందన్నది కొందరు టీడీపీ లీడర్స్ ఆందోళనగా తెలుస్తోంది. ముఖ్యంగా…నగరి నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు మున్సిపల్ పీఠం స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌కు పెద్ద పరీక్షగా మారిందట.గత ఎన్నికల్లో నగరి చరిత్రలోనే లేనివిధంగా 45 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి రోజాపై గెలిచారు భాను ప్రకాష్. నియోజకవర్గం పరిధిలో నగరి, పుత్తూరు మున్సిపాలిటీలు ఉండగా.. రెండిటిలో పసుపు జెండా ఎగరడం ఖాయమని టీడీపీ కేడర్ మొదటి నుంచీ గట్టి ధీమాతో ఉంది. వాళ్ళు అనుకున్నట్టే నగరి మున్సిపల్ చైర్మన్ ఏకగ్రీవమైంది. కానీ… అనూహ్యంగా పుత్తూరు మున్సిపాలిటీ జనసేన ఖాతాలోకి వెళ్ళడంతో…నగరి తమ్ముళ్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయిందట. పుత్తూరులో తమిళ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. అందులోనూ యాభై ఏళ్లు పైబడిన ఓటర్లే అత్యధికం. ఇలాంటి సీటును జనసేనకు ఇవ్వడం, గాజు గ్లాసు గుర్తును క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం పెద్ద టాస్క్ అయిందట. పైగా… చైర్మన్ అభ్యర్థిత్వానికి జనసేన తరపున బలమైన నేత లేకపోవడంతో, టీడీపీ నుంచి టికెట్ ఆశించిన డి.ఎన్. ఏలుమలైను చివరి నిమిషంలో జనసేనలోకి పంపి బీ ఫామ్ ఇవ్వాల్సి వచ్చందంటున్నారు. ఈ క్రమంలో… ఇటు ఆర్థిక భారాన్ని, అటు ఎన్నికల ప్రచార బాధ్యతలను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ భుజాన వేసుకోవాల్సి వచ్చిందట. నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధి మిత్రపక్షం అభ్యర్థిని గెలిపిస్తుందంటూ భాను ప్రకాష్ పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా…లోలోపల మాత్రం గ్లాస్ గుర్తును ఇక్కడి ఓటర్లలోకి ఎలా తీసుకువెళ్ళాలా? దాని ప్రభావం ఎంతమేర ఉంటుందా అన్న టెన్షన్ వెంటాడుతోందంటున్నారు ఆయన సన్నిహితులు. గత ఎన్నికల్లో పుత్తూరులోనే టీడీపీకి సూమారు ఐదువేలకు ఆధిక్యం వచ్చింది. దీంతో… ఆ బలం మొత్తాన్ని జనసేనకు ట్రాన్స్ఫర్ చేయడమన్నది ఎమ్మెల్యేకి పెద్ద టాస్కేనని అంటున్నారు. ఇక భానుప్రకాష్ కూడా… ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షం అభ్యర్థిని గెలిపించి ఇటు టీడీపీతో పాటు అటు జనసేన అధిష్టానం దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేయాలన్న తపనతో ఉన్నారట. లేదంటే తన మీద నింద పడుతుందన్న భయం కూడా ఉందంటున్నారు. అయితే… క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎంతవరకు సహకరిస్తాయన్న కంగారు పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వైసీపీ కూడా కొత్త వ్యూహాలకు పదును పెడుతోందట. కూటమిలోని ఈ గందరగోళాన్ని పసిగట్టిన మాజీ మంత్రి రోజా కూడా వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. పుత్తూరులో జనసేన పోటీ చేస్తోందని తెలియగానే మళ్లీ గ్రౌండ్లోకి దిగి గట్టిగా ప్రచారం మొదలుపెట్టారామె.
కొత్తగా గ్లాస్ గుర్తుకంటే… తన ఫ్యాన్ గుర్తు ఇప్పటికే లోకల్‌గా బాగా పరిచయం ఉన్నందున… ఏమో… గుర్రం ఎగరావచ్చు అన్నది రోజా ఆలోచనగా తెలుస్తోంది. దీంతో తేడా జరిగితే… మొదటికే మోసం వస్తుందన్న ఆందోళనతో ఉన్న ఎమ్మెల్యేకి సీటు రాలేదని అసంతృప్తిగా ఉన్న టీడీపీ కార్యకర్తలను బుజ్జగించడం, జనసేన అభ్యర్థిని గెలిపించడం కత్తి మీద సాములా మారాయని అంటున్నారు. ఇక తిరుపతి కార్పొరేషన్లో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు ఆరణి శ్రీనివాసులు. ఇప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన 22 డివిజన్లలో బరిలోకి దిగింది. ఎమ్మెల్యేగా జనసేన నేత ఉన్నప్పటికీ, నగరంలో క్షేత్రస్థాయి నెట్వర్క్, బలమైన కేడర్ అంతా టీడీపీ సొంతం. దీంతో గ్లాస్ గుర్తు ఉన్న 22 స్థానాలను గెలిపించే బాధ్యత కూడా మేమే నెత్తికెత్తుకోవాల్సి వస్తోందంటూ టీడీపీ స్థానిక నేతలు మొత్తుకుంటున్నారట. మరోవైపు ఆయా వార్డుల్లో టిక్కెట్లు రాలేదని అసంతృప్తిగా ఉన్న దారికి తీసుకురావడం కూడా స్థానిక టీడీపీ నాయకులకు తలకుమించిన భారమైందని చెప్పుకుంటున్నారు. పైగా… వార్డుల్లో ప్రచార నిర్వహణ, ఇతర ఖర్చులన్నీ టీడీపీ వీళ్ళే భరించాల్సి వస్తోందన్న ఫ్రస్ట్రేషన్ కూడా పెరిగిపోతోందట. ఇక్కడ జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఆ ప్రభావం కూటమి భవిష్యత్తుపై తీవ్రంగా పడుతుందనే భయం నేతలను వెంటాడుతోందంటున్నారు. ఆ రకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకచోట మిత్రపక్షానికి పీఠం వదిలేసి సొంత పార్టీ శ్రేణులను ఒప్పించాల్సిన దుస్థితి.. మరోచోట మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించేందుకు ఆర్థికంగా, రాజకీయంగా సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాగా ఫీలవుతున్నారట తెలుగు తమ్ముళ్ళు.

