Site icon NTV Telugu

Off The Record : ఐఏఎస్ లను హడలెత్తిస్తున్న జిల్లా ఏది ?..అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి ?

Sircilla

Sircilla

కలెక్టర్ అంటే జిల్లాకు సుప్రీమ్‌. అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ…. ఏ చిన్నా తేడా వచ్చినా హడలెత్తించిన ఐఏఎస్ ఆఫీసర్స్‌ ఇప్పుడు ఆ జిల్లా పేరు చెబితేనే హడలి పోతున్నారట. కావాలంటే పనిష్మెంట్‌ కింద లూప్‌లైన్‌లో వేయండిగానీ… ఆ జిల్లాకు మాత్రం కలెక్టర్‌గా వద్దని అంటున్నారట. ఐఎఎస్‌లనే అల్లల్లాడిస్తున్న ఆ జిల్లా ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా బ్యూరోక్రాట్స్‌లో హాట్ టాపిక్‌ అయింది. రాష్ట్రంలోనే అతి చిన్నదైన ఈ జిల్లాకు కలెక్టర్‌గా వెళ్లాలంటేనే వణికిపోతున్నారట ఐఎఎస్‌ అధికారులు. రాజకీయ వత్తిళ్లు, కోర్ట్‌ నోటీసుల్లాంటి వ్యవహారాలతో… లూప్ లైన్లో ఉన్నా ఫర్లేదుగానీ… ఇక్కడ మాత్రం పని చేయలేమన్న భావనలో ఉన్నారట సివిల్ సర్వీసెస్‌ అధికారులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోనే జిల్లా కేంద్రం కూడా ఉంది. మరోవైపు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న వేములవాడ కూడా ఈ జిల్లాలోనిదే. దీంతో…అటు బీఆర్ఎస్, ఇటు అధికార నుంచి ఒత్తిళ్లు ఓ రేంజ్‌లో ఉన్నాయట. గతంలో సిరిసిల్ల కలెక్టర్‌గా పనిచేసిన సందీప్‌కుమార్ ఝా రాజకీయాలను పట్టించుకోకుండా తనదైన శైలిలో పనిచేయడం అప్పుడు సంచలనమైంది. బీఆర్‌ఎస్ నేతల భూ కబ్జాలపై కొరడా ఝళిపించి వార్తల్లో నిలిచారాయన.

తన మాటను ఖాతరు చేయకపోవడంతో కలెక్టర్ తీరుపై పలుమార్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు లోకల్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కలెక్టర్‌ కాదు, కాంగ్రెస్ కార్యకర్త అని… కాంగ్రెస్ కండువా వేసుకుని కుర్చీలో కూర్చోండని నేరుగా విమర్శలు చేశారు కేటీఆర్… బీఆర్ఎస్ నేతలను ముప్పు తిప్పలు పెట్టిన సందీప్‌కుమార్ ఝా అదే దూకుడు అధికార పార్టీతోనూ కొనసాగించారనే టాక్ నడించింది… ఆ తర్వాత కొన్ని వివాదస్పద నిర్ణయాలు తీసుకోవడంతో ఎంత క్రేజ్ వచ్చిందో… అంతలా పడిపోయింది ఇమేజ్‌. నష్ట పరిహారం విషయంలో ఓ మహిళను ఇబ్బంది పెట్టారంటూ కలెక్టర్‌ను హైకోర్టుకు పిలిచి సాయంత్రం వరకు నిల్చోబెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక నెలన్నర క్రితం జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో ఆయన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసి సెక్రటేరియట్‌లో పనిచేస్తున్న స్పెషల్ సెక్రటరీ హరితను సిరిసిల్ల కలెక్టర్‌గా నియమించారు. ఆమె కూడా… బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే లీవ్‌లో వెళ్లిపోయారు. చైల్డ్‌కేర్ కింద దాదాపు నెల నుంచి సెలవులోనే ఉన్నారు హరిత. దాంతో ఆమె స్థానంలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్‌గా ఉన్న గరిమా అగర్వాల్‌ను ఇంచార్జ్‌ కలెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. అయితే కలెక్టర్‌గా వచ్చి చార్జ్‌ తీసుకున్న కొద్దిరోజుల వ్యవధిలోనే హరిత లీవ్‌లో వెళ్లడం వెనక కారణాలు ఏంటన్నది మాత్రం సందేహాస్పదంగానే ఉంది. పేరుకు ఛైల్డ్‌కేర్‌ లీవ్‌ అయినా… అసలు విషయం మాత్రం వేరే ఉందని అనుమానిస్తున్నారు. వచ్చీ రాగానే కొన్ని విషయాలు హరితకు చికాకు కలిగించాయట.

ఛార్జ్‌ తీసుకున్న రోజుల వ్యవధిలోనే హైకోర్టు నుంచి పిలుపు రావడంతో బాగా నొచ్చుకున్నట్టు తెలిసింది. అటు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, ఇటు అదను కోసం వేచి చూస్తున్న బీఆర్ఎస్ నేతల కారణంగా ఏ పనిచేయాలో అర్ధంకాని గందరగోళం, ఏ నిర్ణయం తీసుకుంటే.. ఎట్నుంచి సమస్యలు ముంచుకొస్తాయోనన్న ఆందోళనతో హరిత లీవ్‌ పెట్టి ఉంటారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా… స్పెషల్ సెక్రటరీ క్యాడర్‌లో ఉన్న తనను తిరిగి జిల్లా కలెక్టర్‌గా పంపించడంతో ఇబ్బందిగా ఫీలయ్యారనే ప్రచారం కూడా ఉంది. తనను ట్రాన్స్‌ఫర్ చేస్తున్న సమయంలోనే… సిరిసిల్లకు కాకుండా వేరే జిల్లాకు పంపమని కోరినట్టు సమాచారం. ప్రస్తుతానికైతే వెళ్లండి… కొన్ని నెలల తర్వాత చూద్దామని అప్పుడే ఉన్నతాధికారులు చెప్పినట్టు తెలిసింది. అలా అయిష్టంగానే వచ్చిన హరితకు స్థానిక పరిస్థితులు కూడా ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో లీవ్ ఇట్ అనుకుని సెలవులో వెళ్లారనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో… ప్రస్తుతం ఇన్ఛార్జ్‌గా ఉన్న గరిమా అగర్వాల్‌కే పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జోరందుకుంది. అందుకు కారణాలు కూడా కనిపిస్తున్నాయి. వాస్తవానికి లీవ్‌లో ఉన్న కలెక్టర్ ఈనెల 24న రీ జాయిన్ అవ్వాల్సి ఉంది. కానీ మరోసారి సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడంతో మరో 20 రోజులు ఎక్స్‌టెండ్‌ అయింది. ఆ ప్రకారం డిసెంబర్‌ 12 వరకు ఇంచార్జ్‌ కలెక్టర్‌గా విధుల్లో ఉంటారు గరిమా అగర్‌వాల్‌. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఐఏఎస్‌ల బదిలీలు జరిగే అవకాశాలు లేకపోవడంతో సిరిసిల్ల కలెక్టర్ సెలవుల తర్వాత విధుల్లోకి వస్తారా..? మరోసారి లీవ్ పొడిగింపు కోరతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

 

 

Exit mobile version