ఏ పార్టీ పవర్‌లో ఉంటే అందులోకి జంప్ చేయడం ఆ మాజీ మంత్రికి అలవాటైపోయిందా? అలవాటు ప్రకారం ఇప్పుడు టీడీపీలో చేరడానికి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారా? పార్టీ అధిష్టానం మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసిందా? అయినాసరే…మీరొద్దంటే నేను ఊరుకుంటానా అంటూ… సీక్రెట్ ట్రయల్స్‌లో ఉన్నారా? ఎవరా మాజీ మంత్రి? ఆయన చుట్టూ జరుగుతున్న తాజా చర్చ ఏంటి? ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ప్రస్తుతం పొలిటికల్ సైలెన్స్ పాటిస్తున్నారు. అయినాసరే…. రాజకీయం మాత్రం ఆయన్ని వదలడం లేదట. ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పి ఏడాది దాటుతున్నా…ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఏ పార్టీలో చేరేది క్లారిటీ లేకపోవటంతో ఎవరికి నచ్చిన స్టోరీస్ వాళ్ళు రాసేసుకుంటూ…వాటిని జనంలోకి వదులుతున్నారు. తిరిగి టీడీపీలోకే వెళ్తారని కొన్నాళ్లు, కాదు.. కాషాయ జెండా పట్టుకుంటారని ఇంకొన్నాళ్లు… రకరకాలుగా మాట్లాడేసుకుంటున్నారు. ఆయన మాత్రం తన మనసులోని మాట బయటపెట్టకుండా ఈ ప్రచారాల్ని ఎంజాయ్ చేస్తున్నారట. చీమకుర్తిలో గ్రానైట్ వ్యాపారి అయిన శిద్ధా రాఘవరావు 1999లో టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, మంత్రిగా వివిధ పదవులు అనుభవించారు. అత్యంత కీలకమైన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఛాన్స్ కూడా దక్కింది. ఇక 2019లో ఒంగోలు లోక్‌సభ సీటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. అదే సమయంలో పార్టీ కూడా అధికారం కోల్పోవటం, మారిన రాజకీయ పరిస్దితుల కారణంగా… తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయారు సిద్దా.
ఆ తర్వాత ఆయన కుమారుడు సుధీర్‌కు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇచ్చింది వైసీపీ. ఇక 2024లో వివిధ కారణాలతో పోటీకి దూరంగా ఉన్న సిద్దా రాఘవరావు…కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వ్యూహాత్మకంగా వైసీపీకి దూరం పాటిస్తున్నారు. అప్పటి నుంచి తిరిగి తెలుగుదేశంలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా…అట్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదని చెప్పుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం ఇంతవరకూ నేరుగా ఈ అంశంపై ఎక్కడా స్పందించలేదు. వైశ్య సామాజికవర్గంలో కీలక నేతగా ఉన్న శిద్దా ప్రస్తుతం వ్యాపారాలతో పాటు.. తన సామాజిక వర్గ కార్యక్రమాల్లో ఫుల్ యాక్టివ్‌గా మారిపోయారు. గతంలో పాలిటిక్స్‌లో తీరికలేకుండా ఉన్నప్పుడు కుల సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయించ లేకపోయానని, వారితో గ్యాప్ వచ్చిందన్నది శిద్దా అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఈ సమయాన్ని ఆ గ్యాప్ భర్తీ చేసుకునేందుకు వాడుకుంటున్నారట. అదే సమయంలో తిరిగి సైకిలెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా… ఎప్పటికప్పుడు రివర్స్ అవుతున్నట్టు సమాచారం. గతంలో తనతో బాగా సన్నిహితంగా ఉన్న, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతలతో చంద్రబాబు దగ్గరికి రాయబారం పంపినా.. అట్నుంచి నో రియాక్షన్ అట. కష్టకాలంలో టీడీపీని వదిలి వైసీపీలో చేరిన శిద్దా విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్ర అసంతృప్తిగా ఉండటం వల్లే బ్రేకులు పడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ విపక్షంలో ఉన్న సమయంలో తన వ్యక్తిగత అవసరాల కోసం మారిపోయి…. ఇప్పుడు తిరిగి రావటానికి ప్రయత్నిస్తున్న శిద్దాను స్వాగతించాల్సిన అవసరం లేదని జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత ఒకరు చెప్పారట.
అందుకే ఆగిందని ఓవైపు ప్రచారం జరుగుతుండగానే…. మరోవైపు గ్రీన్ సిగ్నల్ పడిందని తాజాగా మరో ప్రచారం మొదలైపోయింది. దీంతో ఇదంతా ఎవరు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన దర్శిలో అయితే… బాస్ ఈజ్ బ్యాక్.. తిరిగి ఇక్కడే బాధ్యతలు అప్పగిస్తున్నారని తెగ చెప్పేసుకుంటున్నారట ఆయనంటే అభిమానం ఉన్నవాళ్ళు. కానీ…. దీనిపై శిద్దా రాఘవరావు కాని.. ఆయన కుమారుడు సుధీర్ కానీ స్పందించడం లేదు. సమయం వచ్చినప్పుడు దాచాల్సింది ఏమీ ఉండబోదని, మేమే నిర్ణయం చెబుతున్నామని అంటున్నారట. మరి వాళ్ళకు లేని హడావిడి వేరే వాళ్ళకు ఎందుకు? ఈ ప్రచారాల బ్యాక్‌గ్రౌండ్ వేరే ఉందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి ప్రకాశం జిల్లాలో. ప్రస్తుతానికైతే… సిద్దాకు టీడీపీ ఆఫీస్ గేట్లు ఓపెన్ అవుతాయా? లేదా అన్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.
