Site icon NTV Telugu

Off The Record : గందరగోళంగా ఉమ్మడి నిజామాబాద్ కాంగ్రెస్

Seethakka

Seethakka

తెలంగాణలోని ఆ జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారా? తన కళ్ళెదుటే తన్నుకోబోయిన పార్టీ నేతల్ని ఆమె ఎలా సెట్‌ చేస్తారు? ఏం చెప్పి వాళ్ళని మారుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ తన్నులాటలు పార్టీ పుట్టి ముంచుతాయా? అలా జరక్కుండా తేల్చడానికి మంత్రి దగ్గరున్న మంత్ర దండం ఏంటి? అంత దారుణమైన పరిస్థితులున్న ఆ జిల్లా ఏది? సవాల్‌ ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు మంత్రి సీతక్క. మాస్ లీడర్‌ ఇమేజ్‌ ఉన్న మినిస్టర్‌… జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అధికారులతో సమీక్షలు పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశాల్లో బిజీగా ఉన్నారామె. అంతవరకు బాగానే ఉన్నా…. కొన్ని చోట్ల వాతావరణం సానుకూలంగా ఉన్నా… మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అసలేం జరుగుతోందో అర్ధంకాని పరిస్థితులు ఉన్నాయట. ఇటీవల బాన్సువాడ నియోజకవర్గంలోని.. చందూర్, మోస్రా మండలాల్లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేశారు మంత్రి. ఆ టైంలో… ఎమ్మెల్యే పోచారం- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు.

POCSO : ‘స్నేహం’గా మొదలై దారుణంగా మారిన కథ.!

మంత్రి కళ్ల ఎదుటే ఇద్దరు నేతల ముఖ్య అనుచరులు తోపులాటకు దిగి.. కొట్టుకున్నంత పని చేశారు. ఓ దశలో రవీందర్ రెడ్డి వర్గీయులపై.. పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట. ఆయన చేరికతో మొదలైన వర్గపోరు.. బాన్సువాడలో రగులుతూనే ఉందని అంటున్నారు. ఈ వర్గపోరుపై గతంలో పీసీసీ చీఫ్ ఆద్వర్యంలో జరిగిన ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు. గ్రూపులను పక్కన పెట్టి అందర్నీ కలుపుకునిపోవాలని అప్పట్లో సూచించారట. లోపాలను సరిదిద్దుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినా…. మార్పు మాత్రం కనిపించడం లేదన్నది లోకల్‌ టాక్‌. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకుగాను నాలుగు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. బాన్సువాడలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి హస్తం గూటికి చేరడంతో ఎమ్మెల్యేల సంఖ్య ఐదుకు చేరింది. కానీ…. నియోజకవర్గాల్లో వర్గపోరు మాత్రం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట.

బాన్సువాడలో గ్రూప్ వార్, ఆర్మూర్ , జుక్కల్ లో పాత-కొత్త నేతల పంచాయతీ, బాల్కొండ నాయకుల మధ్య నువ్వా-నేనా అనే ఫైట్… ఇలా ప్రతిచోట ఏదో ఒక వివాదం పీసీసీకి తలనొప్పిగా మారిందట. జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలు కీలకంగా ఉన్నారు. పీసీసీ చీఫ్‌ సొంత జిల్లా అయినా, ఇతర కీల నాయకులు ఉన్నా… ఉమ్మడి నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ వర్గపోరు మాత్రం ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు.. నియోజకవర్గాల్లో నేతలను సమన్వయం చేయడం కత్తి సామే అవుతుందన్న అంచనాలున్నాయి. స్థానిక సంస్ధల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సెగ్మెంట్లలో వర్గపోరు పార్టీకి నష్టం చేస్తుందని టెన్షన్‌ పడుతోందట కేడర్‌. ఒక రకంగా ఈ వాతావరణం మంత్రి సీతక్కకు.. అగ్ని పరీక్షేనంటున్నారు. ఇన్ఛార్జ్‌ మంత్రిగా తొలి పరీక్షకు సిద్దమవుతున్న సీతక్క.. జిల్లాలో కొత్త- పాత నేతల్ని ఎలా సమన్వయం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని చేతులు కలిస్తేనే స్థానిక ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది. లేకుంటే.. జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న హస్తం పార్టీకి భారీ షాక్ తగిలే ప్రమాదం లేకపోలేదంటున్నారు పరిశీలకులు. మంత్రి సీనియర్ నేతలతో సమన్వయం చేసుకుని.. స్థానిక ఎన్నికల్లో ఎలా సత్తా చాటుతారో చూడాలి.

Trump Effect: అగ్రరాజ్యానికి ట్రంక్ ఎఫెక్ట్ కానుందా..?

Exit mobile version