ఆ మేయర్ టిక్కెట్ కోసం టీడీపీ, బీజేపీ దోబూచులాడుతున్నాయా? ఎవరికి వారు బల ప్రదర్శనలతో మేం ఇదీ…. అని చెప్పాలనుకుంటున్నారా? రాష్ట్రంలో ఎక్కడా చేయకుండా… ఆ సిటీలో మాత్రమే కాషాయదళం వంద జెండాల పండగ చేయడం వ్యూహంలో భాగమేనా? మిగతా మిత్రపక్షాలు రెండూ నువ్వా నేనా అంటుంటే… జనసేన మాత్రం డిప్యూటీ మేయర్ ఇచ్చిన చాలు అంటూ సరిపెట్టుకోవడానికి కారణాలేంటి? అసలు ఎక్కడ నడుస్తోందా వెరైటీ రాజకీయం? ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ… రాజమండ్రి మేయర్ సీటు వ్యవహారం ఆసక్తి రేపుతోంది. కూటమిలో ఏ పార్టీకి ఈ టిక్కెట్ దక్కుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉందట. ఇప్పుడు మేయర్ టిక్కెట్ తీసుకునే పార్టీకి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వ కూడదన్నది ఇంటర్నల్ కండిషన్‌గా చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పట్టుబట్టి తమ కోటాలో తీసుకుంటే… రేపు 29 ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఆటోమేటిక్‌గా బీజేపీ కోటాలోకి వెళ్తుందని చెప్పుకుంటున్నారు. ఈసారి రాజమండ్రి సిటీ అసెంబ్లీ టిక్కెట్ కావాలనుకునే పార్టీ కచ్చితంగా ఇప్పుడు మేయర్ సీటు విషయంలో వెనక్కి తగ్గాలన్న రాజీ ఫార్ములా ఉందట. అయితే… పైకి మాత్రం కూటమిలోని మూడు పార్టీలు మేయర్ టికెట్ మాదంటే మాదేనంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. టిడిపిలో సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ తప్ప… మేయర్ టిక్కెట్ ఆశిస్తున్న మిగతా వాళ్ళంతా కార్పొరేటర్ స్థాయి నాయకులేనని అంటున్నారు.
అందుకే…. ఆశావాహుల్ని చూస్తుంటే సిగ్గేస్తోందని ఆయన మీడియా ప్రతినిధుల ముందు చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఇక గన్ని కృష్ణకు వయస్సు రీత్యా టికెట్ ఇవ్వకపోవచ్చునని టిడిపిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే… రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మద్దతు ఎవరికి ఉంటుందనే క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. మూడు పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థే ఉంటారని మాత్రం చెబుతున్నారు. మరోవైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం టీడీపీ తరపున అభ్యర్ధిని నెలబెట్టాలన్న పట్టుదలతో ఉన్నారట. ప్రస్తుతం యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న వైసీపీ నేతలతో బచ్చయ్య మంతనాలు జరుపుతున్నారన్న ప్రచారం ఉంది. గతంలో మేయర్లుగా గెలిచిన చక్రవర్తి, ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, పంతం రజిని శేషాయిలను తీసుకు వచ్చింది కూడా గోరంట్లనే. దీంతో… ఆయన ఈసారి ఏ కొత్త అభ్యర్థిని తెర మీదికి తీసుకు వస్తారన్న ఆసక్తి పెరుగుతోంది. ఇక బీజేపీ కూడా… మేయర్ రేస్ లో మేము ఉన్నామని ప్రచారం చేసుకుంటోంది.
ఇప్పటికే రాజమండ్రిలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహించింది కమలదళం. ఇటీవల సిటీలోని 50 డివిజన్స్‌లో 100 స్థూపాలను ఏర్పాటు చేసి మన ఊరు మన జెండా పేరుతో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. వేలాదిమంది కార్యకర్తలతో 100 జెండాల పండుగ నిర్వహించడమే కాకుండా… మాజీ డిప్యూటీ మేయర్ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఎదుట బల ప్రదర్శన చేసిమరీ… ఇదీ… మన సత్తా అని స్థానిక నాయకులు చూపించారు. మేయర్ టికెట్ రేస్‌లో ఉన్నామని చెప్పడానికే ఈ కార్యక్రమం నిర్వహించారా అన్న సందేహాలు సైతం ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మేయర్ టిక్కెట్టు ఇవ్వకపోతే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నాయకుడికే ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ చేయడానికి కూడా ప్రోగ్రామ్ పెట్టి ఉండవచ్చని అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా చేయకుండా రాజమండ్రిలోనే100 జెండాల పండగ నిర్వహించడానికి కారణం ఇదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జనసేన నేతలు కూడా మేయర్ రేసులో మేం ఉన్నామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ…. ఇక్కడ సామాజికంగా, ఆర్థికంగా పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడం లోటని అంటున్నారు. దాంతో… కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా దక్కుతుందన్న ఆలోచనలో గ్లాస్ లీడర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
పైగా ఇక్కడ పార్టీకి గ్రూపుల సమస్య ఉంది. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను రెండు వర్గాలుగా విడిపోయి వేరువేరుగా నిర్వహించుకున్నారు కార్యకర్తలు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్, పార్టీ నగర అధ్యక్షుడు ఎవరికి వారుగా ఉంటున్నారు. ఈ అనైక్యత కారణంగా రాజమండ్రి జనసేనలో చేరేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని చెప్పుకుంటున్నారు. సిటీలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఆ పార్టీకి కంచుకోట కూడా. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఇక్కడ కూటమి అభ్యర్థులే గెలిచారు. వీటిలో ఒకసారి బిజెపి, రెండు విడతలు టిడిపి గెలిచాయి. అయితే… మేయర్ టిక్కెట్‌ని బీజేపీకి ఇస్తే… తెలుగుదేశం శ్రేణులు మనస్ఫూర్తిగా పనిచేయకపోవచ్చని, కాస్త వెనకడుగు వేసే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. మేయర్ ఎన్నిక డైరెక్ట్ ఎలక్షన్ కావడంతో… క్రాస్ ఓటింగ్ ముప్పు కూడా ఉండవచ్చన్న భయాలున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే… వైసీపీ కూడా బలమైన నేతను మేయర్ అభ్యర్థిగా నిలిపే ప్రయత్నాల్లో ఉందట. ఆ సంగతి ఎలా ఉన్నా… టీడీపీ, బీజేపీ మధ్య దోబూచులాట మాత్రం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

