OTR : దోస్త్ మేరా దోస్త్ అంటున్న రఘునందన్, ప్రభాకర్ రెడ్డి

Raghu

Raghu

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని ఆ ఇద్దరు నేతలు నిరూపిస్తున్నారా..? మొన్నటిదాకా కత్తులు దూసుకున్న ఆ ఇద్దరు నేతలు సడెన్‌గా దోస్త్‌ మేరా దోస్త్‌ అని ఎందుకు అంటున్నారు..? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రువులు ఉండరనే సామెతకు ఆ నియోజకవర్గం వేదికగా మారిందా..? గతంలో ఉప్పు-నిప్పులా ఉండి ప్రస్తుతం పాలునీళ్లలా కలిపోయిన ఆ ఇద్దరు నేతలెవరు..? వారి కథేంటి..? లెట్స్‌ వాచ్‌. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్తా ప్రభాకర్‌ రెడ్డి, మెదక్‌ ఎంపీ రఘునందన్‌ రావులు ఈమధ్య స్నేహమేరా జీవితం అంటూ పాటలు పాడుకుంటున్నారట. 2020 ఉపఎన్నికలో దుబ్బాక నుంచి బీజేపీ తరపున రఘునందన్ రావు గెలిచి సంచలనం సృష్టించారు. అప్పట్లో అధికార పార్టీ అయిన బీఆర్ఎస్‌ని ఢీకొని ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా రఘునందన్ రాష్ట్ర రాజకీయాలను ఆకర్షించారు. ఆ ఉప ఎన్నిక తర్వాత దుబ్బాక వివాదాలకు కేరాఫ్‌గా మారింది. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే చాలు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగేవి. ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్ కాబట్టి మేం నిధులిస్తేనే పనులయిందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తే… ఎమ్మెల్యే రఘునందన్ కృషితోనే ఆ పని అయిందని బీజేపీ నేతలు వాదించేవారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో అధికారులు తల పట్టుకునేవారు. వందలాదిగా పోలీసులు మోహరించేవారు. దీనికి ప్రధాన కారణం అప్పటి మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులే. ఇద్దరిదీ దుబ్బాక నియోజకవర్గం కావడంతో ఆధిపత్యం కోసం ఎత్తులు-పైఎత్తులు వేసేవారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయాలుండేవి.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు నేతలు దుబ్బాక బరిలో దిగారు. రఘునందన్ పై కొత్తా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. సీన్ కట్ చేస్తే ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలిచారు. దీంతో మళ్లీ దుబ్బాకలో దబిడిదిబిడే అవుతుందని అందరూ భావించారు. కానీ కొన్ని నెలలుగా దుబ్బాకలో సీన్ మారిపోయిందట. గతంలో కత్తులు దూసుకున్న ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు దోస్త్‌ మేరా దోస్త్‌ అంటున్నారట. అప్పట్లో ఉప్పనిప్పుగా ఉన్నవారు ఇప్పడు పాలునీళ్లలా కలిసిపోవడంతో వీరిద్దరి వ్యవహరం ఇటు బీఆర్ఎస్‌లో.. అటు బీజేపీలో చర్చనీయాంశంగా మారిందట. ఒకప్పడు ఒకరిపైఒకరు ఒంటికాలితో లేచిన నేతలు… ఇప్పుడు చేతులు కలపడంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారట. తాజాగా జరిగిన ఓ ఘటన రెండు పార్టీల నేతలకు షాక్‌కి గురి చేసిందట. భూంపల్లి-అక్బర్ పేట మండలంలో జరిగిన పలు అభివృద్ది పనులకు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్తా ప్రభాకర్ రెడ్డి కలిసి ఒకే కారులో వెళ్లడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారట. మహిళా సంఘం భవన్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రిబ్బన్ కట్‌ చేస్తుండగా… రఘునందన్ పక్కనే నిల్చోవడంతో అందరూ ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా తిలకించారట. గతంలో కొబ్బరికాయలు కొట్టడానికి, రిబ్బన్ కటింగుల కోసం పోటీ పడిన నేతలు… ఇప్పడు పక్కపక్కనే ఉంటూ ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉండటంతో కొందరైతే తాము చూసేది నిజమా…? కలా..? అని తమను తాము గిల్లుకుని మరీ అనుమానాలు తీర్చేసుకుంటున్నారట. అయితే ఈ ఇద్దరి నేతల స్నేహగీతంపై స్థానికంగా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఒకరు ఎంపీ, ఇంకొకరు ఎమ్మెల్యే కాబట్టి దుబ్బాక నియోజకవర్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేస్తున్నారని వారి అనుచరులు చెబుతున్నారట. మరికొందరు మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది కాబట్టి వీరిద్దరూ ఇలా వ్యవహరిస్తున్నారని కామెంట్ చేస్తున్నారట. ఒకప్పటి రాజకీయ బద్ద శత్రువులు… ఇప్పుడిలా చెట్టపట్టాల్ వేసుకుని తిరగడం, కలిసికట్టుగా వెళ్లి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో దుబ్బాక రాజకీయాలు ఆసక్తికరంగా మారాయట. అయితే… ఈ స్నేహబంధం ఎంతకాలం ఉంటుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.