ఎన్టీఆర్ జిల్లాలోని ఆ కీలకమైన సామాజికవర్గంపై వైసీపీ ఫోకస్ పెట్టిందా? గత ఎన్నికల్లో ఎక్కడ నష్టం జరిగిందో తొలిసొచ్చిందా? అందుకే బలమైన ఆ ఓట్ బ్యాంక్ ఈసారి చెదిరిపోకుండా ఇప్పట్నుంచే జాగ్రత్తలు మొదలుపెట్టిందా? ఇంతకీ ఏ కులం మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది ఫ్యాన్ అధిష్టానం? డ్యామేజ్‌ని కవర్ చేసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ వేస్తోంది? ఎన్టీఆర్ జిల్లాలో, ప్రత్యేకించి బెజవాడ నగరంలో కాపు సామాజికవర్గానికి దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది వైసీపీ. ఆ విషయంలో సీరియస్‌గానే వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా జనసేనకు, తర్వాత పొత్తు పెట్టుకున్న కూటమి పార్టీలకు పడుతున్నట్టు గుర్తించిందట ఫ్యాన్ అధిష్టానం. గత ఎన్నికల ఫలితాలు ఇదే విషయం చెప్పాయని అంటున్నారు. విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం ఓట్ బ్యాంక్ బలంగా ఉంది. సిటీలోని మూడు నియోజకవర్గాలతో పాటు అటు జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం సెగ్మెంట్స్‌లో కూడా కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2019 2024 ఎన్నికలను పరిశీలిస్తే… ఇదంతా జనసేనకు, టీడీపీకి ట్రాన్స్‌ఫర్ అయినట్టు లెక్కలేస్తోంది వైసీపీ అధిష్టానం. కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతం జనసేన వైపు మొగ్గు చూపుడం…. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న కూటమిలోని మిగతా రెండిటికి కూడా కలిసి వచ్చందని వైసీపీ స్థానిక నేతలు గుర్తించారట. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై అధిష్టానం దగ్గర రకరకాల ప్రతిపాదనలు పెడుతున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీకి గతంలో బలమైన కాపు నేతలు అండగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుకి, విజయవాడ తూర్పు నుంచి వంగవీటి రాధాకృష్ణకు వైసీపీ అధిష్టానం టిక్కెట్లు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయినా… టిక్కెట్ల కేటాయింపుతో… ఆ సామాజిక వర్గానికి దగ్గరగా ఉన్నామన్న సందేశం కాపుల్లోకి వెళ్లిందని నమ్ముతున్నారు.
అయితే 2019కి వచ్చేసరికి కాపు కోటాలో జగ్గయ్యపేట నుంచి ఉదయభానుకు మాత్రమే టికెట్ కేటాయించారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకే దక్కింది. కానీ…. ప్రస్తుతం సామినేని వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి టికెట్ ఎక్కడ కేటాయించాలన్న అంశంపై వైసీపీలో చర్చ జరుగుతోందట. స్థానిక నాయకత్వం మాత్రం విజయవాడ నగరంలో ఒక టికెట్ కాపులకు ఇవ్వాలన్న విషయాన్ని పదేపదే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది.కాపు సామాజిక వర్గానికి పార్టీ దగ్గరవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారట లోకల్ లీడర్స్. విజయవాడ సిటీలో ఒక సీటు ఇస్తే….మొత్తం మూడు నియోజకవర్గాల్లో కాపు ఓట్ బ్యాంక్ వైసీపీ వైపు మళ్లుతుందని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో అధిష్టానం కూడా నగరంలో కాపు సామాజిక వర్గం నుంచి బలమైన నేత ఎవరున్నారన్న అంశంపై దృష్టి పెట్టడంతో పాటు గతంలో తమతో పనిచేసి బయటికివెళ్ళి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో ఉన్న కొందరు కాపు సామాజికవర్గ నేతలు కూడా మేం లైన్‌లో ఉన్నామంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారట. గత ఎన్నికల సమయంలోనే వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరిగినా సాధ్యపడలేదు. ఆయన సోదరి ఆశ వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా అదీ లేదు. మరోవైపు గతంలో కాపు సామాజిక వర్గానికి కేటాయించిన జగ్గయ్యపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన తన్నీరు నాగేశ్వరరావును ఇన్ఛార్జ్‌గా పెట్టింది పార్టీ. ఈ పరిస్థితుల్లో… మొత్తం జిల్లాలో కాపు సామాజిక వర్గానికి వైసీపీ దగ్గర కావాలంటే విజయవాడ నగరంలో లేదా జిల్లాలో ఒక సీటును కేటాయించి తీరాల్సిందేనని అంటున్నారు.
అయితే… అది ఎక్కడన్న విషయంలో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అసలు జిల్లాలో ఎక్కడా ఇవ్వకుంటే మాత్రం దాని ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని అంటున్నారు వైసీపీ నేతలు. కూటమి నుంచి కాపు ఓట్లను వైసీపీకి మళ్లించడానికి టిక్కెట్ కేటాయింపు ఒక్కటే మార్గమని అంటున్నారు పార్టీ లీడర్స్.
