OTR : నెల్లూరులో వైసీపీకి రెండుసార్లు జెడ్పీ పీఠం.. ఇప్పుడు అభ్యర్థి కరువా..?

Ycp

Ycp

అక్కడ జిల్లా పరిషత్ ఎన్నికలలో రెండు సార్లు సత్తా చాటిన ఫ్యాన్ పార్టీ… ఈసారి చాప చుట్టేసిందా? ఫలానా నేత మా ఛైర్మన్‌ అభ్యర్థి అని ప్రకటించలేని స్థితికి వెళ్ళిపోయిందా? గట్టిగా మాట్లాడితే… అసలు ఆ స్థాయి అభ్యర్థి దొరకలేదా? వైసీపీకి ఎడ్జ్ ఉంటుందని చెప్పుకునే, ఒకప్పుడు అక్కడ గిర గిరా తిరిగిన ఫ్యాన్.. ఇప్పుడు ఎందుకు స్లో అయింది? జడ్పీ ఛైర్మన్‌ స్థాయి నాయకుడు కూడా ఎందుకు దొరకడం లేదు? ఏపీ పాలిటిక్స్‌లో నెల్లూరు పేజీ కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదట్లో రేసులో ఉన్నామని హడావిడి చేసే నేతలు…. మధ్యలోకి రాగానే హ్యాండ్సప్‌ అంటుంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు సార్లు జడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఫ్యాన్ పార్టీ ఇప్పుడు అదే సమస్యను ఫేస్ చేస్తూ.. ఉనికి కోసం పోరాడుతోందట. తమ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో సైకిల్ పార్టీ… ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఫ్యాన్‌ వెనుకబడిపోయిందంటున్నారు. జిల్లాలోని 35 జడ్పీటీసీలకు గాను.. ఇందుకూరుపేట, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, చిల్లకూరు, సీతారాంపురం తెలుగుదేశం పార్టీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా అందులో టిడిపి నుంచి 28, జనసేన, బిజెపిల నుంచి ఒక్కొక్కరు, వైసిపి తరపున 29 మంది బరిలో నిలిచారు. టిడిపి నుంచి జడ్పీ చైర్మన్ పీఠాన్ని కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలవరం రెడ్డి శ్రీనివాసుల రెడ్డితో పాటు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ఆశిస్తున్నారు.

ఇక ఈ జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఇప్పటి వరకు వైసిపి రెండుసార్లు కైవసం చేసుకుంది. 2014లో బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి లక్కీడిప్‌తో ఆ కుర్చీలో కూర్చున్నారు. అప్పుడు టిడిపి, వైసిపికి చెరో 23 ఓట్లు రావడంతో డ్రా తీయగా… బొమ్మిరెడ్డిని అదృష్టం వరించింది. తర్వాత 2021లో ఆనం అరుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఆ ఎన్నికల్లో వైసీపీ మొత్తం 46 జెడ్పిటిసి స్థానాలను గెలుచుకుంది. అయితే… ఇప్పుడు జిల్లా పునర్విభజన తర్వాత 35 జెడ్పిటిసీలు మాత్రమే ఉన్నాయి. ఇక ఇప్పుడు వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేని పరిస్థితి. మొదట మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వైపు రాష్ట్ర నాయకత్వంతో పాటు జిల్లా నాయకత్వం కూడా మొగ్గు చూపింది. రెండు మూడు దఫాలు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో రాఘవేందర్ రెడ్డి భేటీ అయ్యారు కూడా. దాంతో… ఆయన పేరు ఖరారైందన్న ప్రచారం జరిగింది. అయితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దెబ్బకు బొమ్మిరెడ్డి కూడా వెనకడుగు వేశారన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. బొమ్మిరెడ్డి వదిన డాక్టర్ షకీలా రెడ్డిని లాస్ట్‌ మినిట్‌లో ఆనం టిడిపిలో చేర్చుకుని.. ఆమెకు ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చారు.. దీంతో… రాజకీయాల వల్ల కుటుంబంలో చీలిక రాకూడదనుకుని బొమ్మిరెడ్డి జడ్పీ చైర్మన్ రేస్ నుంచి తప్పుకున్నారట.

అయితే… తర్వాత ఆ స్థాయికి తగ్గ నేతలు ఎవరూ లోకల్‌ వైసీపీలో కనిపించలేదంటున్నారు. ఒకవేళ ఎవరో ఒకర్ని అనుకున్నా… ఆర్థికంగా బలంగా లేకపోవడంతో అభ్యర్థిని ప్రకటించేందుకు వైసీపీ వెనకడుగు వేసిందన్న చర్చ జరుగుతోంది. ముందస్తు వ్యూహాలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమన్న మాట పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో జడ్పీ చైర్మన్ పదవికి ఎవ్వరు మొగ్గు చూపడంలేదన్నది ఫ్యాన్‌ ఇన్‌సైడ్‌ టాక్‌.

ప్రస్తుత పరిస్థితుల్లో… తమ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకునే అవకాశం కనిపించడం లేదని, ఇప్పుడు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అడిగితే… పార్టీకి చెందిన అందరు అభ్యర్థుల ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుందన్న ఆలోచన ఒకరిద్దరు వైసీపీ నాయకులు వెనకడుగు వేసినట్టు చెప్పుకుంటున్నారు. దీంతో వైసిపికి జెడ్పీ చైర్మన్ అభ్యర్థి కూడా దొరకలేదన్న ప్రచారం సింహపురి రాజకీయాల్లో జరుగుతోంది. అయితే పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతల వాయిస్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంది. తాము అత్యధిక జడ్పిటిసి స్థానాలను గెలిచిన తరువాత అభ్యర్థిని ప్రకటిస్తామని, వ్యూహంలో భాగంగానే ముందుగా ప్రకటించలేదని చెప్పుకొస్తున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… రెండుసార్లు జడ్పీ చైర్మన్ పీఠాన్ని అధిరోహించిన వైసీపీ… ఇప్పుడు నెల్లూరులో ఉనికి కోసం పాకులాడుతుంటే…. టీడీపీ మాత్రం ఆ పదవికి అడుగు దూరంలో ఉంది.