Site icon NTV Telugu

Off The Record : ఆసక్తికరంగా ఆత్మకూరు టీడీపీ రాజకీయం

Tdp T

Tdp T

ఆ సీనియర్‌ మినిస్టర్‌ ముందు చూపు మామూలుగా లేదా? అసలు ఆలోచనేంటో అర్ధమైన కొందరు వావ్‌…. వాటే స్కెచ్‌. ఈయన మామూలోడు కాదంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారా? సార్‌…. చాలా దూరం ఆలోచించే కొత్త కొత్త వ్యూహాలు పన్నుతున్నారా? ఎవరా ఏపీ మంత్రివర్యులు? సొంత పార్టీ వాళ్ళ ముందరి కాళ్ళ బంధాలు ఎందుకు వేస్తున్నారు? 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి కేబినెట్‌ బెర్త్‌ పట్టేశారు ఆనం రామనారాయణ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటగిరి నుంచి గెలిచిన ఆనం….. గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ కొట్టి ఆత్మకూరుకు షిఫ్ట్‌ అయ్యారు. దీంతో అప్పటిదాకా నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా ఉన్న గూటూరు కన్నబాబును తప్పించి ఆనంకు అవకాశం ఇచ్చింది పసుపు అధిష్టానం. కన్నబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మనాయుడు కూడా టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేసినా…..ఫైనల్‌గా రామనారాయణరెడ్డి వైపే మొగ్గు చూపారు పార్టీ పెద్దలు. అయినా అసంతృప్తుల్ని బయటపెట్టకుండా… పార్టీ గెలుపు కోసం పని చేశారు ఇద్దరు నాయకులు. పైగా… నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతల్ని ఏకం చేసి ఆ ఓట్లు ఆనంకు సాలిడ్‌ అయ్యేలా ఇద్దరూ జాగ్రత్తలు తీసుకున్నారన్నది లోకల్‌ టాక్‌.

కానీ… తీరా గెలిచాక వాళ్ళకు షాకుల మీద షాకులు తగులుతున్నాయన్నది లేటెస్ట్‌ హాట్‌. కష్టపడి గెలిపించాం, మన నాయకుడికి మంత్రి పదవి కూడా దక్కింది. ఇక మనకు కూడా అంతా బాగుంటుంది, ప్రాధాన్యం దక్కుతుందని ఏడాదిన్నరగా ఎదురు చూస్తున్నా… కనుచూపు మేరలో ఆ అవకాశం కనిపించడం లేదట. ఇంకా మాట్లాడితే…కన్నబాబు, లక్ష్మనాయుడిని ఆనం వర్గం నైతికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందని చెప్పుకుంటున్నారు. అలా ఎందుకంటే… దాని వెనక చాలా పెద్ద స్కెచ్చే ఉందన్నది సమాధానం. 2014లో టిడిపి తరపున ఆత్మకూరులో పోటీ చేసి ఓడిపోయారు గూటూరు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్‌గానే తిరుగుతున్నారు, అవసరమైనప్పుడు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు మోశారు. అయినాసరే… పార్టీ అధిష్టానం ఆయన్ని ఎమ్మెల్యే స్థాయి నేతగా చూడటం లేదట. ఇక కొమ్మి లక్ష్మనాయుడు 1994లో టిడిపి నుంచి, 2004లో ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. తర్వాత వైసీపీలోకి వెళ్ళి తిరిగి సొంత గూటికే చేరుకున్నారు. గత ఎన్నికల్లో టిక్కెట్‌ ఆశించినప్పుడు అధికారంలోకి రాగానే రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందన్న ప్రచారం సైతం ఉంది. ఆ సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడు కనీసం నియోజకవర్గంలో గుర్తింపు దక్కకపోవడం,మంత్రి ఆనం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో తీవ్ర అసహనంగా ఉన్నారట మాజీ ఎమ్మెల్యే.

కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలుపులు ఉండటం లేదంటూ కొమ్మి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నామినేటెడ్‌ పదవి కోసం వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ద్వారా కొమ్మి ప్రయత్నాలు చేస్తున్నా… ఆనంను కాదని ఇచ్చే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక కన్నబాబు అయితే… ఏడాదిన్నరగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ క్రమంలో… నెల్లూరు పాలెం సమీపంలోని ఓ కాలేజీ సమీపంలో వేసిన లేఔట్ పై మాజీ ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. మంత్రి ఆనం అండతో నిబంధనలకు విరుద్ధంగా లేఔట్లు వేస్తున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మనాయుడు కలెక్టర్‌ని కోరడాన్ని బట్టి చూస్తే… ఆత్మకూరు టీడీపీలో ఏం జరుగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు పరిశీలకులు. ఇక ఆ తర్వాతి నుంచి కొమ్మి వర్గానికి గవర్నమెంట్‌ ఆఫీసుల్లో అనధికారిక నో ఎంట్రీ బోర్డ్స్‌ పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. అసలిదంతా ఎందుకు జరుగుతోందని అంటే…తన వారసత్వాన్ని నిలుపుకోవడానికి మంత్రి ఆనం ముందు చూపుతో తీసుకుంటున్న చర్యల ఫలితం అని టీడీపీ కేడరే అంటోంది. అందుకే నియోజకవర్గంలో ప్రభావం చూపగలిగిన ఇద్దరు నేతల్ని దూరం పెడుతున్నారంటూ గుసగుసలాడుకుంటున్నారు.

వయసు రీత్యా… వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రామనారాయణ రెడ్డి సిద్ధంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పట్టు తగ్గకుండా కన కుమార్తె కైవల్యారెడ్డిని ఆత్మకూరు బరిలో దింపే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఎంట్రీ ఇచ్చేలోపు…. నియోజకవర్గంలో బలమైన టీడీపీ నేతలు ఎవ్వరూ ఉండకుండా, తమకు తామే ప్రత్యామ్నాయం, వన్ అండ్ ఓన్లీ కైవల్యా అనే చేయాలన్నది మంత్రి ప్లాన్‌ అట. అందుకోసమే ఈ ముందస్తు గ్రౌండ్‌ వర్క్‌ అని అంటున్నారు. గత ఎన్నికల్లోనే తన కుమార్తెకు టిక్కెట్ ఇవ్వాలని ఆనం అడిగినా…. మరోసారి చూద్దామని చెప్పారట లోకేష్‌.దీంతో.. వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ వారసురాలితో గ్రాండ్‌ ఎంట్రీ ఇప్పించేందుకు అడ్డంకులన్నిటినీ తొలగిస్తున్నారన్నది లోకల్‌ టాక్‌. ఆత్మకూరులో వర్గాలు లేకుండా, అందరూ తమకే సహకరించేలా చూసుకునేందుకే పథకం ప్రకారం కమ్మ నేతలు ఇద్దర్నీ ఆనం దూరం పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి ఆత్మకూరు టీడీపీలో ట్విస్ట్‌లు ఉంటాయా? లేక ఆనం స్కెచ్‌ వర్కౌట్‌ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version