Site icon NTV Telugu

Off The Record : అధ్యక్షుని పర్యటన పేరుతో భారీగా వసూళ్లు!

Nandyal Bjp

Nandyal Bjp

పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులై జిల్లాల పర్యటనకు రావడమే వారికి కాసులు కురిపించిందా…గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి ఆ జిల్లాలో తెర తీసారా….అధ్యక్షుని పర్యటన పేరుతో భారీగా వసూళ్లు చేసారా….ఈ వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయిందా…. బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ్‌…జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశం, చాయ్ పే చర్చ, బీజేపీ శ్రేణులతో ర్యాలీ, సమావేశం, వ్యాపార వర్గాలు, మేధావులతో సమావేశం…ఇలా కొత్తరకంగా మాధవ్ పర్యటన షెడ్యూల్ సాగింది. అయితే మాధవ్ పర్యటన విజయవంతం చేసేందుకు…ఆ పార్టీ నాయకులు బాగానే కసరత్తు చేశారట. గ్రామ స్థాయి నాయకులు మొదలు, మండల, నియోజకవర్గ, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. రాష్ట్ర అధ్యక్షునిగా మాధవ్ పర్యటన సక్సెస్ అయిందని బీజేపీ శ్రేణులు ఆనందపడుతున్నాయి.

నంద్యాల జిల్లాలో మాధవ్‌ పర్యటన పేరుతో కీలక నేత ఒకరు భారీ ఎత్తున వసూళ్లకు శ్రీకారం చుట్టారట. గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయనికి తెర తీసారని జిల్లాలో ప్రచారం సాగుతోంది. పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో కూడా అధికార భాగస్వామి కావడంతో…నంద్యాల జిల్లాలో బీజేపీ నేత భారీగా వసూళ్లు చేశారట. బీజేపీలో సాధారణంగా విరాళాలు లేదా ఇతర రూపంలో వసూళ్ళ సంప్రదాయం లేదనే టాక్ ఉంది. ముఖ్య నేతలు పర్యటనకు వస్తే ఏర్పాట్లకు, కార్యక్రమాల నిర్వహణకు, ఫ్లెక్సీలకు, సమావేశం ఫంక్షన్ హాల్ , భోజనాలు వంటి వాటికి రాష్ట్ర పార్టీ ఖర్చులు భరిస్తుంది. అయితే నంద్యాల జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుని పర్యటన పేరు చెప్పి వసూళ్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. నంద్యాలలో ప్రత్యక్షంగా వసూళ్లు చేయగా మండలాలు, నియోజకవర్గాల్లో వసూళ్లకు కొందరికి ఏకంగా పుస్తకాలు ముద్రించి ఇచ్చారట.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటనకు వాస్తవంగా పెద్దగా ఖర్చు కాలేదు. చాలా సింపుల్ గానే పర్యటన ప్లాన్ చేశారు. పర్యటనలో ప్రధానంగా సమావేశానికి ఫంక్షన్ హాల్, కార్యకర్తలకు భోజనాలు, ఫ్లెక్సిలు, బీజేపీ శ్రేణుల రాకపోకలకు ట్రాన్స్‌పోర్టు ఖర్చుకు మాత్రమే ఖర్చులు అయ్యాయి. ఇందులో సమావేశానికి ఫంక్షన్ హాల్, భోజనాలు ఓ విద్యాసంస్థ యాజమాన్యమే ఖర్చు పెట్టిందట. ఇక కార్యకర్తల రవాణా, ఫ్లెక్సీలు ఆయా ప్రాంతాల నేతలు ఎవరికి వాళ్లే పెట్టుకున్నారనే చర్చ నడుస్తోంది. నంద్యాలలో ఫ్లెక్సీలు, ఇతర వాటికి చిల్లర ఖర్చులు అయ్యాయి. అయితే విద్యాసంస్థల నుంచి భారీగా వసూలు చేశారట. విరాళాల వసూలుకు రాష్ట్ర పార్టీ అనుమతి లేకుండా ముద్రించి నియోజకవర్గ నాయకులకు ఇచ్చారట. వ్యాపార వర్గాల నుంచి కూడా బాగానే పిండుకున్నారనే ప్రచారం సాగుతోంది. ఇందులో చెప్పుకోదగ్గది బీజేపీ కార్యక్రమానికి వైసీపీకి చెందిన ఓ మాజీ ఎంపీని విరాళాల కోసం ఒత్తిడి చేశారట. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కార్యక్రమానికి తామెందుకు డబ్బులు ఇస్తామని ఆ మాజీ ఎంపీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సదరు వైసీపీ నేత డబ్బులు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసారట. అయినా వెంటబడి ఆ మాజీ ఎంపీ నుంచి లక్ష రూపాయలు వసూలు చేశారట. బీజేపీ ప్రోగ్రాంలకు ఇలా విరాళాలు సేకరించడం ఎప్పుడూ జరగలేదని పార్టీ సీనియర్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వవాదులైన ప్రముఖుల నుంచి విరాళాల సేకరణ చేస్తారని…అది కూడా చాలా పద్ధతిగా ఉంటుందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. నంద్యాలలో మాత్రం నిబంధనలకు గాలికొదిలేసారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి సమున్నత లక్ష్యంతో మాధవ్ పర్యటన చేపడితే…ఆయన పర్యటన పేరుతో డబ్బులు వసూలు చేయడం ఏంటనే టాక్ పార్టీలో ఉందట. మొత్తమ్మీద నంద్యాలలో బీజేపీ వసూళ్లు హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version