గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? రేస్‌లో ఉన్న అభ్యర్థులు ఎవరు? వాళ్ల గురించి పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? అసలు రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎంత మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు? పార్టీ పెద్దల ఆలోచన ఎలా ఉంది? తెలంగాణలో పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ అధికార కాంగ్రెస్ పార్టీలో నేతల హడావుడి పెరిగిపోతోంది. టిక్కెట్ కోసం చాలా మంది నేతలు ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ మొదలుపెట్టారు. పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నిక ఏదైనాసరే… టిక్కెట్ కోసం సీనియర్ నేతలు పోటీపడటం సహజం. కానీ… ఈసారి మాత్రం అందుకు భిన్నంగా అంతా యువ నాయకులే రేస్‌లోకి వస్తున్నారు. మరోవైపు ఇటీవల ఢిల్లీలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చర్చ జరిగిందట. రెండు సీట్లు గెలిచి తీరాల్సిందేనని అధిష్టానం టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. అందుకే వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టడంతో పాటు… జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను ప్రకటించే దిశగా పార్టీలో కసరత్తు జరుగుతోంది. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగాలన్నది హై కమాండ్ ఆలోచన. సామాజిక సమీకరణాలు… వ్యూహాలు ఎలాఉన్నా… అంతిమంగా గెలుపు మాత్రమే ముఖ్యం అన్నది పార్టీ వాయిస్. అందుకు అనుగుణంగానే రాష్ట్ర నాయకత్వం పావులు కదుపుతోందట.
ఇక మహబూబ్ నగర్- హైదరాబాద్-రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. ఉపాధ్యాయ సంఘం నేత హర్ష వర్ధన్ రెడ్డి, msm పారిశ్రామిక వేత్త కుటుంబం నుండి మన్నే జీవన్ రెడ్డి, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, t sat చైర్మన్ శివసేనా రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ రెడ్డి, మరో సీనియర్ కాంగ్రెస్ నేత గౌరీ సతీష్… ఇలా చాలా మంది MLC టికెట్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. అదే సమయంలో మరో సీటు నల్గొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూడా డిమాండ్ ఉంది. మూడు జిల్లాల్లో పార్టీ బలంగా ఉంటుంది. ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువే. సీనియర్ కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వంలో కీలక నాయకులు అంతా ఈ జిల్లాల్లోనే ఉన్నారు. ఈ సీటుకు ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఐతే…. అందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందిస్తారన్నది కీలకం. అటు Ou నేత చనగాని దయాకర్, స్టేషన్ ఘన పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సింగాపురం ఇందిర లాంటి వాళ్ళ పేర్లు కూడా తెర మీదకు వస్తున్నాయి. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని కీలకమైన నాయకులు ఇంకెవరి పేర్లు ప్రతిపాదిస్తారన్నది కూడా చూడాలి. పార్టీ ఇంకా ఫోకస్ పెట్టాల్సి ఉంది కాబట్టి.. ఎవరి ఆలోచన ఏంటో ఇంకా బయటికి రాలేదు. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ప్రధానంగా సీఎం రేవంత్… పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్ణయం కీలకం. అభ్యర్థుల కోసం త్వరలోనే పార్టీ పరంగా అభిప్రాయ సేకరణ కూడా మొదలవుతుందని అంటున్నారు. అప్పుడు మరికొన్ని పేర్లు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. అసలు వ్యవహారమంతా అప్పుడే ఉంటుందని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మొత్తం మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్లీ పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

