OTR: ఈటల-కేటీఆర్ బంధం ఇంకా అలాగే ఉందా? పెళ్లి వేడుకలో ఆసక్తికర సన్నివేశం!

Ktr

Ktr

పార్టీలు వేరైనా…. ఆ నేతలు ఇద్దరి మధ్య పాత బంధం చెక్కు చెదరలేదా? చివరికి ఫెవికాలే అసూయపడేంతగా వాళ్ళిద్దరి బాండింగ్‌ ఉందా? కేసీఆర్‌తో విభేదించి బయటికి వచ్చి కాషాయ కండునా కప్పుకున్న ఆ నాయకుడు.. ఆ ఒక్కరితో తప్ప మిగతా అందరితో పాత రిలేషన్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారా? ఇటీవలే ఆపాత మధురాలను గుర్తు చేసుకుని మురిసిపోయిన మాజీ బీఆర్‌ఎస్‌ లీడర్‌ ఎవరు? ఏంటా జ్ఞాపకాలు?

రాజకీయ రణరంగంలో మాటల తూటాలు పేల్చుకోవడం, విమర్శలకు పదును పెంచడం సహజం. అధికారం కోసం, సిద్ధాంతాల కోసం పార్టీలు మారవచ్చు.. ఆవేశంతో ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ, పాత జ్ఞాపకాలు, ఆత్మీయ అనుబంధాలు కూడా అంతే సులభంగా చెరిగిపోతాయా? అంటే… నిర్మొహమాటంగా పోవనే చెప్పవచ్చు. అచ్చం ఇలాంటి దృశ్యమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు గులాబీ నేతలతో కలిసి నడిచిన ఎంపీ ఈటల రాజేందర్… ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో కీలక నేత. ఆ రకంగా రాజకీయ విరోధులుగా మారిన నేతలు, ఒక పెళ్ళి వేదికపై కలుసుకున్నప్పుడు జరిగిన ఆత్మీయ పలకరింపుల గురించి ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్‌ నాయకులతో రాజకీయంగా కత్తులు దూస్తున్నా…. అది రాజకీయం వరకే తప్ప వ్యక్తిగతంగా ఉన్న బంధం పూర్తిగా తెగిపోలేదని నిరూపించింది ఓ సన్నివేశం. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు, రాజేందర్‌కు మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ పరిచయం మాత్రమే కాదు. ఎంపీ గులాబీ తోటలో ఉన్న రోజుల్లో, వీరిద్దరి మధ్య ఎంతో ఆత్మీయమైన సాన్నిహిత్యం ఉండేది. చివరికి ఈటల పార్టీ వదిలి వెళ్ళడం కూడా కేటీఆర్‌కు ఇష్టం లేదని చెబుతారు.

ఆయన కొనసాగాలని కేటీఆర్ మనస్ఫూర్తిగా కోరుకునేవారని అంటారు. కానీ… కేవలం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో ఏర్పడ్డ సిద్ధాంతపరమైన విభేదాలు, రాజకీయ పరిణామాలు ఈటల కారు దిగక తప్పని పరిస్థితిని సృష్టించాయని రాజకీయ వర్గాల్లో అప్పట్లో చర్చ జరిగింది. పార్టీ మారినా, రాజకీయంగా ప్రత్యర్థులైనా.. కేటీఆర్-ఈటల మధ్య ఉన్న వ్యక్తిగత గౌరవం ఏ మాత్రం తగ్గలేదట. కొడుకుతో ఓకే…. తండ్రితో మాత్రం నాట్‌ ఓకే అన్నట్టుగా ఉందట వ్యవహారం. తాజాగా ఒక పెళ్లి వేదిక మీద వీరిద్దరూ ఎదురుపడినప్పుడు ఆ పాత స్నేహం, ఆత్మీయానుబంధాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్‌నే ఎత్తుకున్న మధుర జ్ఞాపకం ఆ పెళ్లిలో చర్చకు వచ్చిందట. దాన్ని గుర్తు చేసుకుంటూ…. ఇప్పుడు ఎదిగి ఇంత పెద్దవాడయ్యాడంటూ మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఆ మాటల మధ్య…. ముసిముసి నవ్వులు చూసినవాళ్ళంతా ఇద్దరి అనుబంధం ఏ మాత్రం చెక్కుచెదరలేదని కామెంట్‌ చేశారట. రాజకీయ కక్షలు లేదా పార్టీల వైరుధ్యాలు వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఎప్పుడూ ప్రభావితం చేయలేదని ఈ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్నటి సహచరులు, నేటి ప్రత్యర్థులు అయినప్పటికీ.. పలకరింపులో ఉన్న ఆ ఆత్మీయత, నవ్వుల్లో ఉన్న సహజత్వం రాజకీయాల్లో ఇంకా మానవత్వం బతికే ఉందని చాటిచెప్పాయి. ఏది ఏమైనా రాజకీయ పోరు…. వేదికపైనే ఉండాలి, వ్యక్తిగత బంధాలు మాత్రం ఇలాగే పదిలంగా ఉండాలని ఈ ఘటన మరోసారి నిరూపించింది.