ఆ మాజీ మంత్రి పొలిటికల్ పిక్చర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్టేనా…? సూపర్ సీనియర్ అని అంతా చెప్పుకుంటున్నా, ప్రస్తుతం కూటమి భాగస్వామే అయినా…. పొలిటికల్ డార్క్ నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? తన పార్టీ పవర్‌లో ఉన్నా… తాను మాత్రం ఎందుకు పక్కన కూర్చోవాల్సి వచ్చింది? తన పొలిటికల్ కెరీర్‌కు ఇది కామానా…? లేక ఫుల్‌స్టాప్ పడ్డట్టేనా? ఎవరా ఎక్స్ ఎంపీ అండ్ ఎక్స్ మినిస్టర్? ఆయన్ని దెబ్బ కొట్టిన అంశాలేంటి? కొత్తపల్లి సుబ్బారాయుడు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. గతంలో చంద్రబాబు విద్యుత్ సంస్కరణలు మొదలుపెట్టినప్పుడు ఆయన కేబినెట్‌లో అదే శాఖ మంత్రిగా ఉన్నారు కొత్తపల్లి. కానీ… నిలకడ లేని నిర్ణయాలు, ఇక మారడానికి రాష్ట్రంలో పార్టీలేవీ మిగలకపోవడం లాంటి కారణాలతో అంత సీనియర్ అయి ఉండి కూడా….. ఇప్పుడు గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాల్సిన దుస్థితి దాపురించిందని చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు టీడీపీ హయాంలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి హోదాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చక్రం తిప్పారాయన. నరసాపురం ఎంపీగా కూడా పొలిటికల్ పవర్ చూపిన కొత్తపల్లి… ఇప్పటి రాజకీయాలకు తగ్గట్టుగా లేరన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం ఆయన జనసేనలో కొనసాగుతున్నా….. ఏదో, ఉన్నానంటే ఉన్నానన్నట్టుగా బండి లాగిస్తున్నారు. పార్టీలో అస్సలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయిందట. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా గుర్తింపు ఉన్నా… ఆయన సేవల్ని ఉపయోగించుకునేందుకు జనసేనే కాదు, అసలు ఏ పార్టీ కూడా సిద్ధం లేవని చెప్పుకుంటున్నారు. ఈ 40ఇయర్స్ ఇండస్ట్రీ పరిస్థితి అలా తయారవడానికి స్వయంకృతాలే కారణమని అనుచరవర్గమే గుసగుసలాడుకుంటోంది. 2009 ఎన్నికలకు ముందు… అప్పటిదాకా రాజకీయంగా సుదీర్ఘకాలం పాటు తనకు గుర్తింపు ఇచ్చిన తెలుగుదేశం పార్టీని కాదని ప్రజారాజ్యంలో చేరడంతో కొత్తపల్లి సుబ్బారాయుడి డౌన్ ఫాల్ మొదలైందని అంటారు. అది ఇప్పటికీ సెట్ అయినట్టు కనిపించడం లేదు.
ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్‌లో చేరి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత…. తిరిగి టీడీపీ తలుపులు తెరుచుకున్నా మరోసారి రాంగ్ బటన్ నొక్కారట కొత్తపల్లి. టీడీపీని కాదని అప్పట్లో వైసీపీలో చేరారాయన. అప్పటికే దురదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్న కొత్తపల్లిని మరోసారి ఓటమి పలకరించింది. దాంతో…ఇక లాభం లేదనుకుని చివరికి ఎన్టీఆర్ భవన్ తలుపులు తట్టగా…. డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయిగానీ….సహజంగానే గతంలోని ప్రాధాన్యం దక్కలేదు. ఫైనల్‌గా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకుని అలా కామ్‌గా ఉండిపోయారు. పోనీ… అప్పుడన్నా కుదురుగా ఉన్నారా అంటే అదీ లేదు. మరోసారి వైసీపీ వైపు అడుగులేయడంతోనే… ఆయన పొలిటికల్ కెరీర్‌కు దాదాపు ఎండ్ కార్డ్ పడిందని విశ్లేషిస్తున్నారు. ఇక ఫ్యాన్ కిందికి చేరినా… ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో సెకండ్ గ్రేడ్ నాయకుడిగానే కొనసాగాల్సి వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఏవేవో చేసి చివరికి వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసేదాకా తెచ్చుకున్నారు. ఇక 2024 ఎన్నికలకు ముందు కచ్చితంగా నరసాపురం అసెంబ్లీ నుంచి పోటీలో ఉంటానని తొడగొట్టిన కొత్తపల్లి సుబ్బారాయుడిని ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో పరిస్థితి పూర్తిగా తలకిందులైందని చెప్పుకుంటారు ఆయన అనుచరులు. కిందా మీదా పడి చివరికి జనసేనలో చేరిన మాజీ మంత్రి… ప్రస్తుతానికి ఆ పార్టీలో బ్యాక్ బెంచ్ స్టూడెంట్. ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం ఎందుకూ కొరగాకుండా పోయిందని చెప్పుకుంటున్నారు.
అవకాశాల పేరుతో పదేపదే పార్టీలు మారుతూ ఉండటమే..ఆయన రాజకీయ భవిష్యత్తు పతనం అవడానికి కారణంగా తెలుస్తోంది. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా, టిడిపి హయంలో మంత్రిగా చెప్పుకోవడానికి చరిత్ర చాలానే ఉన్నా…. ఇప్పడు ఏంటంటే నథింగ్. ఇక భవిష్యత్తులోనూ ఆయనకు అవకాశాలు వస్తాయో రావోనన్న అనమానంతో అనుచరులు సైతం మెల్లిగా జారుకుంటున్నారట. ఇప్పటికే నరసాపురం అసెంబ్లీ పరిధిలో టిడిపి తరపున అరడజన్‌కుపైగా అభ్యర్థులున్నారు. దీంతో.. వచ్చే ఎన్నికల నాటికి జనసేన తరపున ఈ సీటు ఆశించడం కష్టమేనన్న మాటల నడుమ కొత్తపల్లి పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్టేనా అన్న చర్చలు మొదలయ్యాయి. చేయాల్సిన ప్రయత్నాలన్నీ అయిపోవడం, ఇక మారడానికి పార్టీలు కూడా మిగలకపోవడంతో… ఇంకొక్క ఆశ మాత్రం మిణుకుమిణుకుమంటోందట. నియోజకవర్గాల పునర్విభజన జరిగి రేపు సీట్లు పెరిగితే…ఎక్కడో ఒక చోట ఛాన్స్ దొరక్కపోతుందా అంటూ ఆశగా చూస్తున్నారట సుబ్బారాయుడు. ఎదురుచూపుల్లోనే రెండు దశాబ్దాలు గడిచిపోయింది. మోస్ట్ సీనియర్ లీడర్ భవిష్యత్తు వచ్చే ఎన్నికల నాటికైనా మెరుగవుతుందా లేదా అనేది చూడాలి.
