వస్తున్నా… వచ్చేస్తున్నా…. అంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి సంకేతాలు పంపుతున్న ఆ మాజీ మంత్రి ఎందుకు లేట్ చేస్తున్నారు? ఒక ఉమ్మడి జిల్లా మొత్తం మీద వైసీపీ రీ ఛార్జ్ అయితే… ఆ ఒక్క సెంగ్మెంట్‌లో మాత్రమే నాయకుడి కోసం ఎదురు చూడ్డానికి కారణం ఏంటి? అటు టీడీపీ కూడా కమ్…కమ్… వెల్కమ్. మీరు ఎంత త్వరగా వస్తే మా టార్గెట్ అంత త్వరగా పూర్తవుతుందని అంటోందా? ఎవరా నాయకుడు? సొంత కేడర్‌తో పాటు ప్రత్యర్థులు కూడా ఎందుకు ఎదురు చూస్తున్నారు?
కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం, ఇక్కడి నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయి, మంత్రిగా కూడా పని చేసిన కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ హయాంలో 2019- 24 మధ్య ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించారి కొడాలి. అప్పట్లో టీడీపీ, చంద్రబాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నోటికి బాగా పని చెప్పేవారన్న విమర్శలున్నాయి. దీంతో టిడిపి క్యాడర్ హిట్ లిస్టులో కొడాలి నాని టాప్ ప్లేస్‌లో ఉన్నట్టు కూడా చెప్పుకున్నారు. ఇక 24 ఎన్నికల్లో టీడీపీ గెలవడం, అదే సమయంలో పార్టీతోపాటు ఎమ్మెల్యేగా నాని ఓడిపోవడం లాంటి పరిణామాలతో నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. కొడాలి మీద కొన్ని కేసులు బుక్ అయ్యాయి. అదంతా ఒక ఎత్తయితే… కూటమి అధికారంలోకి వచ్చాక చాన్నాళ్ళు కామ్‌గానే ఉన్న జిల్లాకు చెందిన వైసీపీ నేతలంతా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఒక్క గుడివాడలో తప్ప మిగతా అన్ని సెగ్మెంట్స్‌లో వైసీపీ కేడర్ రీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కృష్ణా జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, వల్లభనేని వంశీ వంటి నేతలు టిడిపిపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ మాటలు, చేష్టలతో అప్పట్లో కొన్ని సందర్భాల్లో ఈ నేతలు హద్దులు దాటారన్నది టిడిపి వర్గాల మాట. అందుకే తమ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంగతి తేల్చాలన్న రేంజ్‌లో టార్గెట్ చేసినట్టు చెబుతారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీ, జోగి రమేష్‌ను జైలుకు పంపారన్నది జిల్లా వైసీపీ ఆరోపణ. ఇదే సందర్భంలో కొడాలి నాని ప్రస్తావన కూడా వస్తోంది. జైలుకు వెళ్ళి వచ్చాక కూడా… జోగి, వల్లభనేని యాక్టివ్‌గా తిరుగుతున్నారని, కొడాలి మాత్రం ఎందుకు ఎక్కడా కనిపించడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళే ఎక్కడా తగ్గకుండా నియోజకవర్గాల్లో కేడర్‌ని యాక్టివ్‌గా ఉంచే ప్రయత్నం చేస్తుంటే…ఏమీ లేని గుడివాడలో మాత్రం మా నాయకుడు ఎప్పుడు వస్తారా అంటూ వైసీపీ కార్యకర్తలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే… మాజీ మంత్రి సన్నిహితుల మాట మాత్రం వేరుగా ఉంది.
చాలా రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే నాని హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. దాని కారణంగా పూర్తి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని, దీంతో కొన్ని కేసులకు సంబంధించి వాయిదాలకు, కొందరికి ఇళ్లల్లో కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నట్టు క్లారిటీ ఇస్తోంది ఆయన వర్గం. గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడిందని, వారంలో రెండు రోజులు నియోజకవర్గంలో ఉండి పార్టీ నేతలతో మంతనాలు జరుపుతుట్టు వివరిస్తున్నారు నాని సన్నిహితులు. అయితే… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు రోజుల రాజకీయం చాలదన్నది గుడివాడ వైసీపీ కేడర్ మాట. తానిక మీదట ఎన్నికల్లో పోటీ చేయబోనని గత ఎన్నికల సమయంలో ప్రకటించారు కొడాలి. కానీ… అదంతా గతం ఇప్పుడు పరిస్థితులు మారాయని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఆయన నిలబడతారని అంటున్నారు సన్నిహితులు. కాకుంటే యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చని అంటున్నారు. మరో వైపు అధికార పార్టీ కూడా కొడాలి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తేనే బెటర్ అని ఎదురు చూస్తోందట. ఆయన నేరుగా తిరుగుతూ ఉంటే… ఎక్కడో ఒకచోట తమకు దొరక్క పోతారా? తమ టార్గెట్ రీచ్ అవ్వకపోతామా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ కోణంలోనే… ఆయన రీ ఎంట్రీ ఎంత లేటయితే మేం అంత డిజప్పాయింట్ అవుతామంటూ సెటైరికల్‌గా మాట్లాడుతున్నారట టీడీపీ నాయకులు. గుడివాడ వైసీపీ కేడర్ మాత్రం వాళ్ల సంగతి వదిలేయండి…, కమాన్, మీరు గేరు మార్చేయండంటూ నాని కోసం ఎదురు చూస్తోంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో గుడివాడ రాజకీయం మాంఛి రసవత్తరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్.
