Site icon NTV Telugu

Off The Record : కవిత విషయంలో నో కాంప్రమైజ్ అని బీఆర్ఎస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ..!

Kavitha

Kavitha

మాటకు మాట కాదు…. ఒకటికి రెండు మాటలతో సమాధానం చెప్పబోతున్నారా? ఎమ్మెల్సీ కవిత విషయంలో ఇప్పటికే హద్దులన్నీ చెరిగిపోగా… ఇక నుంచి డోస్‌ డబుల్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ డిసైడైందా? కవిత మీద ఇన్నాళ్ళు చేసిన విమర్శలు ఒక లెక్క, ఇక నుంచి చేయబోయేవి మరో లెక్కగా మారబోతోందా? ఈ మాటల యుద్ధంలో టాప్‌ సీక్రెట్స్‌ కూడా బయటపడబోతున్నాయా? లెట్స్‌ వాచ్‌. నువ్వు తమలపాకుతో ఒకటంటే… నేను తలుపు చెక్కతో నాలుగంటాను అన్నట్టుగా మారిపోయింది ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్‌ ఎపిసోడ్‌. పార్టీకి కొరకరాని కొయ్యలా మారిపోయిన ఆమె విషయంలో తగ్గొద్దని ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిన గులాబీ అధిష్టానం… ఇక డోస్‌ పెంచే విషయంలో కూడా నాయకులకు పూర్తి స్వేచ్ఛనిచ్చేసినట్టు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్‌, మరో ప్రతిపక్షం బీజేపీకంటే ఎక్కువగా కవిత తమనే టార్గెట్‌ చేస్తున్నట్టు ఫీలవుతున్నారట బీఆర్‌ఎస్‌ పెద్దలు. అందుకు తగ్గట్టే… జాగృతి జనం బాటలో హాటు ఘాటు విమర్శలు చేస్తూ…. కారు పార్టీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు కేసీఆర్‌ కుమార్తె. వెళ్ళిన ప్రతిచోట అక్కడుండే ఎమ్మెల్యేనో, మాజీ మంత్రినో లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే… నిన్న మొన్నటి వరకు మాట వేరు, ఇప్పుడు వినిపిస్తున్న తీరు వేరన్నట్టుగా ఉందట వ్యవహారం. టైం గడిచేకొద్దీ… కవిత తన విమర్శల వాడి పెంచుతున్నారట. మొదట్లో హరీష్‌రావు తోపాటు మాజీ మంత్రులను టార్గెట్ చేయగా…
ఇప్పుడు రూట్‌ మార్చినట్టు తెలుస్తోంది.

తాను ఏ నియోజకవర్గానికి వెళితే ఆ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా ఇన్ఛార్జ్‌ లక్ష్యంగా మాటల దాడి చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అక్కడ గతంలో వాళ్ళు చేసిన వ్యవహారాలు, వసూళ్ళు, భూ కబ్జాలు ఇలా… ఏ అంశాన్నీ వదలకుండా ఏకిపారేస్తున్నారామె. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు వెళ్లిన కవిత అక్కడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఉద్యమ నాయకులు కాకుండా తెలంగాణ ఏర్పాటయ్యాక పార్టీలోకి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ బీటీ బ్యాచ్ అంటూ గట్టిగానే అటాక్ చేశారు. బీఆర్ఎస్‌ని అడ్డంపెట్టుకుని ఈ బీటీ బ్యాచ్ చాలా రకాల అవినీతి చేసిందంటూ మండిపడ్డారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కవిత. దీంతో ఆయన కూడా అంతకంటే ఘాటుగానే స్పందించారు. మీడియా సమావేశం పెట్టి మరీ… దాదాపుగా కవితకు వార్నింగ్‌ ఇచ్చేశారు మాధవరం. గతంలో ఆమె చేసిన అవినీతి చిట్టా మొత్తం తన దగ్గర ఉందని, అది అవసరమైన సమయంలో బయటపెడతానని హెచ్చరించారు. తన దగ్గరున్న వివరాలన్నీ బయటపెడితే… ఆమె తలెత్తుకోలేరని కూడా కూకట్‌పల్లి ఎమ్మెల్యే అనడం కాక రేపుతోంది. అలాగే… బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కవిత చాలా దందాలు చేసినట్టు చెప్పారాయన.

లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవిత ఇంట్లో ఉండే కుక్క పేరు కూడా విస్కీనే అంటూ తీవ్రస్థాయిలో అటాక్‌ చేశారు మాధవరం కృష్ణారావు. ఈ రకంగా కవిత సింగిల్‌ డోస్‌లో విమర్శిస్తే… ఇక నుంచి మేం డబుల్‌ డోస్‌లోకి వెళ్తామని చెప్పకనే చెబుతున్నారు బీఆర్‌ఎస్ లీడర్స్‌. ఇక మీదట మా గురించి మాట్లాడితే మేం కూడా ఆమె గురించి ఎక్కువగానే మాట్లాడతామంటున్నారు. కవిత విషయంలో కాంప్రమైజ్‌ వద్దని గతంలోనే పార్టీ నాయకులకు క్లియర్‌ కట్‌ ఇండికేషన్‌ ఇచ్చినా… ఎంతైనా ఆధినేత కుమార్తె అన్న లెక్కలో కాస్త తటపటాయిస్తున్నారట అంతా. అయితే.. ఆమె ఏ మాత్రం కాంప్రమైజ్‌ లేకుండా టార్గెట్‌ చేస్తుండటంతో… ఇంకా మీకు మొహమాటాలు ఎందుకంటూ… పై నుంచి క్లారిటీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మాధవరం కృష్ణారావు ఆ స్థాయిలో అటాక్‌ చేయడం వెనకున్న రీజన్‌ కూడా ఇదేనన్నది బీఆర్ఎస్‌ వర్గాల అంతర్గత సమాచారం. ఇక నుంచి కవిత విమర్శిస్తే… ఏ మాత్రం తటపటాయించకుండా వెంటనే కౌంటర్స్‌ ఇచ్చేయమన్న సంకేతాలు వచ్చాయట గులాబీ లీడర్స్‌కు. దీంతో…ఈ విమర్శలు, ప్రతి విమర్శల పర్వం ఎంత దూరం వెళ్తుందో, ఎన్ని లోగుట్లు బయటపడతాయోనన్న చర్చ జరుగుతోందట బీఆర్ఎస్‌ కేడర్‌లో.

Exit mobile version