Site icon NTV Telugu

Off The Record : ఆ టీడీపీ ఎమ్మెల్యే సీటు కింద అధిష్టానమే బాంబు పెట్టేసిందా..?

Kakinada

Kakinada

ఆ టీడీపీ ఎమ్మెల్యే సీటు కింద పార్టీ అధిష్టానమే బాంబు పెట్టిందా? ఎక్స్‌ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుందని మిగతా వాళ్ళకు కూడా సందేశం పంపిందా? కొత్త నేత చేరికను అడ్డుకోవాలని ఎమ్మెల్యే ఎంత ప్రయత్నించినా మాకంతా తెలుసునని పార్టీ పెద్దలు నిర్మొహమాటంగా చెప్పేశారా? శాసనసభ్యుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మనుషులతో అంటకాగుతున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? ఎవరా ఎమ్మెల్యే? అధిష్టానం పెట్టిన ఆ బాంబ్‌ ఏంటి? కర్రి పద్మశ్రీ… ఎమ్మెల్సీ. వైసీపీ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో అవకాశం వచ్చింది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారామె. ఆమోదం పొందకుండా అది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఎన్నికల ముందు పరిణామాలతో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ప్లస్ అవుతుందని ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది వైసీపీ. నియోజకవర్గంలో దాదాపు 40 శాతం మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి.

టిడిపి అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గం కావడంతో వైసిపి ఈ స్ట్రాటజీ అప్లై చేసింది.. పద్మశ్రీ ఎమ్మెల్సీగా ఉంటే.., కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా కొండబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పద్మశ్రీ టిడిపిలో చేరికను అడ్డుకోవడానికి కొండబాబు చాలా ప్రయత్నాలు చేశారట. నియోజకవర్గంలో మరో పవర్ పాయింట్ రాకుండా చాలా జాగ్రత్త పడాలనుకున్నా సాధ్యం కాలేదు. ఎమ్మెల్సీ పదవీకాలం 2029 ఆగస్ట్‌ వరకు ఉంది. ఎమ్మెల్యే టర్మ్ కూడా కాస్త అటు ఇటుగా అప్పటి వరకే ఉంటుంది.. దీంతో కర్రి ఫ్యామిలీ వల్ల కాకినాడలో పార్టీకి వచ్చే మైలేజ్ ఏమీ ఉండదని చెప్పే ప్రయత్నం చేశారట ఎమ్మెల్యే.. గ్రూపులు, గొడవలు అని కొత్త పంచాయతీలు వస్తాయని అడ్డు పుల్ల వేసే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు.

అయినా నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, కొత్త వారి అవసరం ఉండదని చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పినా వర్కౌట్‌ కాలేదట. పార్టీ కూడా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి పెట్టి ఇంటర్నల్ సర్వే చేయించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని లెక్కలు వేసిన తర్వాతే ఎమ్మెల్సీ చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. సర్వే తర్వాత కొండబాబు పదే పదే ఆ వ్యవహారాన్ని ప్రస్తావించినా పట్టించుకోలేదట.. ఏది ప్లస్ ఏది మైనస్ అన్నది మాకు తెలుసు. మీ పని మీరు చేసుకోండి మా పని మమ్మల్ని చేసుకోనివ్వండని పార్టీ పెద్దలు అన్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రయోజనాల విషయం మాకు వదిలేయండి, మీరు మరీ ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి అని కూడా చెప్పేశారట. ఇప్పటికీ కాకినాడ సిటీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు పెత్తనం నడుస్తోందన్న ప్రచారం ఉంది. దానికి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారనే గుసగుసలు ఉన్నాయి.. అటువంటి వ్యవహారాలు పై కూడా పార్టీ దృష్టి పెట్టిందట.

 

పరిధి దాటి ప్రవర్తిస్తే ట్రీట్మెంట్ వేరే విధంగా ఉంటుందని కూడా ఎమ్మెల్యేకి పెద్దలు చెప్పేశారట. గత ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి జనసేన నుంచి ఎటువంటి ప్రపోజల్ లేదు.. అయినప్పటికీ ఆ సీటును మాత్రం చివరి వరకు పెండింగ్లో పెట్టారు.. వేరొకరికి ఇద్దామని సర్వేలు కూడా చేశారు.. చివరి నిమిషంలోనే కొండబాబు వైపు మొగ్గు చూపింది టీడీపీ అధిష్టానం. అయినా పద్ధతి మార్చుకోలేదని ఎమ్మెల్సీ వర్గం చెబుతోంది. మొత్తానికి నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్‌ రాకుండా ఎమ్మెల్యే చాలా ప్రయత్నాలు చేసినా… ఎమ్మెల్సీ చేరికను అడ్డుకోలేకపోయారు. పార్టీ పెద్దలు కూడా కొండబాబును పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవడంతో… కొండ కింద కొత్త బాంబు పెట్టినట్టేనన్న చర్చ జరుగుతోంది కాకినాడలో.

 

 

Exit mobile version