Site icon NTV Telugu

Off The Record : మానేరు మీద వరుసగా కూలిపోతున్న చెక్ డ్యామ్లు..కూలిపోతున్నాయా? కూల్చేస్తున్నారా ?

Check

Check

అక్కడ నీళ్ళలో రాజకీయ నిప్పులు రాజుకుంటున్నాయి. చెక్‌ డ్యామ్‌తో పరస్పరం చెక్‌ పెట్టుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు మొదలు పెట్టిన గేమ్‌ చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తోంది. ఏంటా గేమ్‌? ఎవరు ఎవరికి చెక్‌మేట్‌? మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎట్నుంచి ఎటు పోతోంది? దోషులు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతోపాటు రైతులకు సాగు నీరు ఇచ్చేందుకు గతంలో చెక్‌ డ్యామ్‌లు కట్టారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన ఈ చెక్‌డ్యామ్స్‌ ద్వారా… దాదాపు 10 వేల ఎకరాల్లో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. కానీ… ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్ధకం అవడం ఆందోళన కలిగిస్తోంది. చెక్ డ్యామ్స్‌ వరుసగా కూలిపోతుండటం హాట్ టాపిక్‌గా మారింది. దానికి ఫుల్‌గా పొలిటికల్‌ కలర్‌ పులుముకుని రచ్చ మొదలైంది. నవంబర్‌లో గుంపుల-తనుగుల గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యామ్ రాత్రికి రాత్రే కొట్టుకుపోయిన ఘటన కలకలం రేపింది. తిరిగి రెండ్రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్‌పల్లి శివార్లలో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ రెండిటి ఆధారంగా వందల ఎకరాలు సాగవుతున్నాయి.

కానీ… ఉన్నట్టుండి రెండూ కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల రైతాంగానికి తీరని నష్టం జరుగుతోంది. ఆ నష్టం ఒక ఎత్తయితే… అసలు ఉన్నట్టుండి ఈ చెక్‌ డ్యామ్‌లు ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ప్రమాద వశాత్తు అలా జరుగుతోందా? లేక పనిగట్టుకుని ఎవరైనా కూల్చేస్తున్నారా అన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి సమాధానం దొరకడం లేదు. అది పూర్తిగా తేలకముందే… రాజకీయం రంగ ప్రవేశం చేసింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇందులోకి ఎంటరైపోయి పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. చెక్ డ్యామ్‌లు కూలిన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు అక్కడకు వెళ్ళి పరిశీలించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేయించిన నాసిరకం పనులు, అనాలోచిత చర్యల వల్లే చెక్‌ డ్యామ్‌ కూలిందని ఆరోపించారు. దాంతో డిఫెన్స్ లో పడ్డ బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి అధికార పార్టీపై రివర్స్‌ ఆటాకింగ్ స్టార్ట్ చేశారు. తనుగుల దగ్గర కూలిన చెక్ డ్యామ్ దగ్గరికి మాజీ మంత్రులు హరీష్, గంగుల వెళ్లి ఇసుక మాఫియా కోసమే బాంబులు పెట్టి పేల్చివేశారని ఆరోపించారు. అది కూలిపోయిందా పేల్చివేశారా అన్న చర్చలు, విచారణలు జరుగుతుండగానే అడవి సోమన్ పల్లి వద్ద ఉన్న చెక్ డ్యామ్ కొట్టుకుపోవడం ఇంకా సంచలనమైంది.

ఇక్కడ కూడా సేమ్ పొలిటికల్ సీన్ రిపీట్ అయింది. అడవి సోమన్ పల్లి విచారణకు బీఆర్ ఎస్ నిజ నిర్దారణ బృందాన్ని పంపింది. నీటిపారుదల నిపుణులు, బీఅరెస్ నేతలతో కూడిన ఆ టీమ్ శనివారం అక్కడకు చేరుకుని… చెక్ డ్యామ్ కూలిపోలేదని కూల్చివేశారని ప్రకటించింది. దానికి తోడు ఆదివారంనాడు మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ కూడా చెక్ డ్యామ్‌లను బాంబులు పెట్టి పేల్చివేస్తారా…? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారా..? మేం అధికారంలోకి రాగానే దోషులు పాతాళం లో ఉన్నా పట్టుకు వస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆ దెబ్బకు ఒక్కసారిగా హీట్‌ పెరిగిపోయింది. అసలు చెక్‌ డ్యామ్‌ల చుట్టూ ఏం జరుగుతోందన్న చర్చలు నడుస్తున్నాయి. లక్షలాది క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా చెక్కుచెదరకుండా ఉన్న చెక్ డ్యామ్స్‌ ఉన్నట్టుండి, అదీ కూడా ఎలాంటి వరదలు లేని టైంలో ఎలా కొట్టుకుపోతాయని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు… ఇసుక మాఫియా కోసం అధికార పార్టీ నేతలే ఇలాంటి దుశ్చర్యలకు పాలడ్డారంటూ ఘాటుగా అటాకింగ్‌ మొదలుపెట్టారు. బాంబులు పెట్టి పేల్చారంటూ ప్రతిపక్ష నేతలు పదే పదే ప్రస్తావించడం అధికార పార్టీకి కాస్త ఇబ్బందిగానే మారిందట.. నాణ్యతాలోపం వల్లే కూలిందని తొలుత ప్రకటించిన కారణంగా ఇప్పుడు డిఫెన్స్‌లో పడ్డామన్న అభిప్రాయం పెరుగుతోందట. లోకల్ లీడర్స్ తొందరపాటు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని హస్తం క్యాంపులో చర్చలు సాగుతున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామ్‌లు కూలిపోయాయా…? లేక కూల్చివేశారా..? అనేది తేలక ముందే పొలిటికల్ హీట్ రైజ్ అయిపోయింది. కూలిన చెక్‌ డ్యామ్‌ ఎవరికి చెక్‌మేట్‌ అవుతుందో చూడాలి.

Exit mobile version