Site icon NTV Telugu

Off The Record : జూబ్లీహిల్స్ అభ్యర్థి ప్రకటనతో బీఆర్ఎస్ లో అలకలు

Brs

Brs

జూబ్లీహిల్స్‌లో గులాబీ ముళ్ళు గట్టిగానే గుచ్చుకుంటున్నాయా? అభ్యర్థి ప్రకటన తర్వాత అలకలు పెరిగిపోయాయా? వాటివల్ల విజయావకాశాలు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందా? అందుకు అధిష్టానం దగ్గర విరుగుడు ఉందా? లేక వాళ్ళవల్ల ఏమవుతుందని లైట్‌ తీసుకుంటారా? అలిగిన నేతలు ఎవరు? పార్టీ బై పోల్‌ వ్యూహం ఏంటి? ఉప ఎన్నిక… జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌లో అసంతృప్తులకు ఆజ్యం పోస్తోందట. సిట్టింగ్‌ సీటును తిరిగి నిలబెట్టుకోవాలన్న టార్గెట్‌తో.. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఇన్చార్జ్‌లుగా పెట్టింది పార్టీ. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించేసింది. సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందన్న అంచనాతో… దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ కన్ఫామ్‌ చేసింది. అయితే… అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మాగంటి కుటుంబాన్ని సపోర్ట్‌ చేయాలని ఓవైపు కేటీఆర్ చెబుతున్నా…మరోవైపు కొంతమంది నేతలు అలకపాన్పు ఎక్కేశారట. ఈ ఉప ఎనికల్లో ఎలాగైనా పోటీ చేయాలి అనుకుని టిక్కెట్‌ ఆశించిన వాళ్ళు.. ఇక టిక్కెట్‌ రాదని తెలిశాక…డివిజన్ మీటింగ్స్‌లో కూడా కనిపించడం లేదని చెప్పుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు.

ప్రధానంగా… గతంలో ఇదే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణు వర్ధన్ రెడ్డి టికెట్ ఆశించారు. ఇక టికెట్ రాదని అర్ధమయ్యాక విష్ణు ముఖం చాటేసినట్టు తెలుస్తోంది. డివిజన్ మీటింగ్ సమయంలో కేటీఆర్… విష్ణువర్ధన్ రెడ్డి గురించి చెబుతూ… మాగంటి గోపీనాథ్ కూతుళ్లు తనకు రాఖీ కట్టారని ఆ కుటుంబానికి అండగా ఉంటానని అన్నారని గుర్తు చేశారు. దీంతో విష్ణు…. మాగంటి కుటుంబాన్ని సపోర్టు చేస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ..ప్రస్తుతానికి ఆయన కొంత దూరం పాటిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. అయితే… అదంతా తాత్కాలికమేనని, కేటీఆర్ నచ్చజెబితే అంతా సెట్‌ అవుతుందని భావిస్తోంది బీఆర్‌ఎస్‌ కేడర్‌. మాగంటి మరణం తర్వాత రావుల శ్రీధర్ రెడ్డి కూడా ఇక్కడ టికెట్ ఆశించారు. మాగంటి గోపీనాథ్ సంతాప సభలలో కూడా కీలకంగా పాల్గొన్నారాయన. తర్వాత వినాయక చవితి ఉత్సవాల సమయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం గట్టిగా తిరిగారు శ్రీధర్ రెడ్డి. ఇక పార్టీ టికెట్ మాగంటి సునీత కు కన్ఫర్మ్ అయ్యాక ఆయన కూడా నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదు.

అయితే,, కేటీఆర్‌కి సన్నిహితంగా ఉండే శ్రీధర్ రెడ్డి ఆయన చెప్తే మళ్ళీ యాక్టివ్‌ అవుతారని అంటున్నారు మాగంటి అనుచరులు. ఇదంతా ఒకవైపు ఉంటే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో కూడా ఈ టికెట్ పై పెదవి విరిచినట్టుగా ప్రచారం జరుగుతోంది. స్వయానా గోపీనాథ్ అన్న వజ్రనాథ్ కూడా ఇక్కడి నుంచి బిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి ఒక దశలో సిద్ధమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు పోస్టర్లతో హడావుడి చేశాడు. ఆ తర్వాత మాగంటి సునీతకు టికెట్ రావడంతో ఆయన కూడా అలిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ని కలవడానికి వచ్చారు వజ్రనాథ్. దీంతో ఆయన కూడా సునీతకు సపోర్ట్ చేస్తారని భావిస్తోంది కేడర్‌. అధికార కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి… అది తమకు అడ్వాంటేజ్‌ అవుతుందన్నది గులాబీ నేతల లెక్క అట. గెలుపు గ్యారంటీ ఉంది కాబట్టే… తమ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీలు పడుతున్నట్టు చెబుతున్నారు వాళ్ళు. అందరికంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించిన బి ఆర్ ఎస్ అధిష్టానం ఈ అలకల వ్యవహారాల్ని కూడా త్వరలోనే సెట్‌ చేస్తుందని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. అయితే…. వాళ్ళలో ఎంతమంది పూర్తిగా ట్రాక్‌లోకి వచ్చి పార్టీ అభ్యర్థికి సపోర్ట్‌ చేస్తారన్నది చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.

Exit mobile version