Site icon NTV Telugu

Off The Record : జూబ్లీహిల్స్ లో ప్లస్, మైనెస్ లపై కాంగ్రెస్ లో చర్చ

Jubilee

Jubilee

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిస్తే…. ఆ క్రెడిట్‌ ఎవరి ఖాతాలోకి? ఒకవేళ తేడా పడితే బద్నాం అయ్యేది ఎవరు? చివర్లో డైరెక్ట్‌గా రంగంలోకి దిగిపోయి అంతా తానై నడిపిన సీఎం రేవంత్‌రెడ్డి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఆయన ఎక్కడ దొరుకుతాడా అని కాచుక్కూర్చున్న పార్టీలోని ఓ వర్గం ఎక్స్‌ప్రెషన్‌ ఎలా ఉంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీనియర్స్‌ సహా… నాయకులు అందర్నీ గల్లీ గల్లీ తిప్పింది. అన్ని రకాల వనరులను సమకూర్చి… గెలుపు మాత్రమే కనిపిస్తోందన్నట్టుగా యుద్ధం చేసింది. అంతవరకు బాగానే ఉన్నా….ఇప్పుడు పార్టీ అభ్యర్థి గెలిస్తే… క్రెడిట్‌ ఎవరికి? తేడా పడితే… బద్నాం అయ్యేది ఎవరన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీ వర్గాల్లో. జూబ్లీహిల్స్‌లో పార్టీ కాస్త ఎక్కువగానే కష్టపడాల్సి వచ్చిందన్న అభిప్రాయం ఉంది. బరిలో ఉన్న ప్రత్యర్థులు కూడా చెమటోడ్చారు.

దాంతో ఫైట్‌ టైట్‌ అయిందన్న విశ్లేషణలున్నాయి. మూడు నెలల ముందు నుంచే… ముగ్గురు మంత్రులకు ఉప ఎన్నిక బాధ్యత అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ… వాళ్ళు ఆశించిన స్థాయిలో వర్కవుట్ చేయలేకపోయారనే ఫీలింగ్ పార్టీ పెద్దల్లో ఉందట. ఇక ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి…. డివిజన్స్‌ వారీగా మంత్రులకు బాధ్యతలు ఇవ్వడం, ఆయనే స్వయంగా పర్యవేక్షించడంతోపాటు క్షేత్ర స్థాయిలో రోడ్ షోలు నిర్వహించారు. ప్రతి100 మంది ఓటర్స్‌కు ఒక నాయకుడిని కేటాయించి పని చక్కబెట్టారు. ఇక ఆ తర్వాతి నుంచే… కాంగ్రెస్ కేడర్‌, లీడర్స్‌లో గెలుపు ధీమా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడిక గెలుస్తామా లేదా అన్న మీమాంస నుంచి గెలుపు గ్యారంటీ… మెజార్టీ గురించే మాట్లాడుకుందామనేలా పరిస్థితి మారిపోయిందంటే… అందుకు CM రేవంత్ చొరవే కారణమన్న టాక్‌ నడుస్తోంది కాంగ్రెస్‌ వర్గాల్లో.

అలాగే…. ఆయన బాధ్యతలు అప్పగించిన వారిలో మెజారిటీ నేతలు గ్రౌండ్‌లో సమర్ధవంతంగా పరిస్థితిని చక్కబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా అన్ని రకాలుగా మంత్రుల్ని సమన్వయ పరుస్తూ వచ్చారు. ఇక పోల్ మేనేజ్మెంట్‌ విషయంలో గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ నేతలు మంచి సమన్వయంతో పని చేశారు. అందుకే గెలుపు గ్యారంటీ ధీమా పెరిగిపోయిందని అంటున్నారు. అదే సమయంలో ఫలితం తేడా కొడితే…… అంతా ఆయనే చేశారంటూ సీఎంని ఎత్తిపొడవడానికి కాంగ్రెస్‌సో కొంత మంది నేతలు కాచుక్కూర్చున్నారు. కానీ… పోలింగ్‌ సరళి, ఎగ్జిట్‌పోల్స్‌తో అలాంటి వాళ్ళంతా బాగా డిజప్పాయింట్‌ అయ్యారట.

ప్రస్తుతం వాతావరణం కాంగ్రెస్‌ పార్టీ పైచేయి సాధించేలా ఉండటంతో.. అన్నీ తానై నడిపిన సీఎం రేవంత్‌రెడ్డికే క్రెడిట్ దక్కుతుందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఇదే సమయంలో భారీ మెజార్టీ వస్తే మాత్రం ఆయనకు వెయ్యి ఏనుగుల బలం తోడవుతుందని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ, పార్టీ పరంగా చాలా సవాళ్ళు ఉన్నాయి కాబట్టి…వాటిని సెట్ చేసుకునే అవకాశం జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ద్వారా వచ్చిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. జూబ్లీహిల్స్‌ క్రెడిట్‌ మొత్తం ముఖ్యమంత్రి ఖాతాలోకే వెళ్తుందని అంచనా వేస్తున్న పార్టీ లీడర్స్‌… అనుకున్న మెజార్టీ వస్తే మాత్రం ప్రభుత్వంలో భారీ మార్పులే ఉండవచ్చని లెక్కలేస్తున్నారు.

Exit mobile version