జనసేనలో జూనియర్స్ వర్సెస్ సీనియర్స్, పాత వర్సెస్ కొత్త అంటూ… రచ్చ రాజకీయం నడుస్తోందా? నేతల మధ్య సయోధ్య నేతి బీరలో నెయ్యేనా? ప్రత్యేకించి అత్యంత కీలకమైన ఆ జిల్లాలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయికి అంతర్గత విభేదాలు చేరుకున్నాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? బూస్ట్ కావాలా బాబూ అంటూ సెటైర్స్ ఎందుకు పడుతున్నాయి? జనసేన పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులకు, అధికారంలోకి వచ్చాక చేరిన వాళ్ళకు మధ్య లెక్కలు కుదరడం లేదని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా… విజయవాడలో జూనియర్స్, సీనియర్స్, పొత, కొత్త అంటూ… రచ్చ రచ్చ చేసుకుంటున్నారట. పార్టీకి సంబంధించినంతవరకు ఇప్పటివరకు ఎన్టీఆర్ జిల్లాలో వోవరాల్‌గా ప్రభావితం చేయగల నాయకుడెవరూ లేరు. విజయవాడ నగరంతో సహా… క్యాడర్ మీద ఆధారపడి నడుస్తున్న పరిస్థితి. ఇలాంటి వాతావరణంలో… మొదట్నుంచి ఉన్న వాళ్ళకు, పవర్లోకి వచ్చాక చేరిన వాళ్ళకు మధ్య సమన్వయం కుదిరితే బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నా.. ఆ ఒక్కటి మాత్రం జరగడం లేదట.
ఏ గ్రూప్‌కి ఆ గ్రూప్ విడివిడిగా రాజకీయం నడపడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. గతంలో కాంగ్రెస్, వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన సామినేని… 2024 ఎన్నికల్లో ఓడిపోయాక గ్లాస్ పార్టీ పంచన చేరారు. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించారు పవన్ కళ్యాణ్. మొత్తం ఐదుసార్లు పోటీచేసి మూడుసార్లు గెలిచిన అనుభవం ఉదయభానుది. అయితే… జనసేనలో చేరే నాటికి పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకు, ఉదయభానుకు పడటం లేదట. ప్రధానంగా రాష్ట్ర కార్యదర్శి, బెజవాడ పార్లమెంట్ ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసుతో తీవ్ర విభేదాలున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న పోతిన మహేష్ ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవటంతో సిటీలో అమ్మిశెట్టి వాసు కీలకంగా మారిపోయారు. అయితే… ఉదయభాను చేరిత తర్వాత…ఆయనకు అమ్మిశెట్టికి పొసగడంలేదని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇద్దరూ… ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహించుకున్నారట.
ఇటీవల జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. కానీ… తప్పనిసరి పరిస్థితుల్లోనే ఒక చోట కనిపించారు తప్ప… మనసులు కలిసి కాదన్నది కేడర్ వాయిస్. ఉదయభాను పొలిటికల్‌గా సీనియర్, ఆయన అనుభవంతో… జిల్లాలో బలోపేతం చేద్దామని అనుకుంటోందట గ్లాస్ పార్టీ అధిష్టానం. కానీ… పాత నేతల నుంచి ఆయనకు పూర్తిస్థాయిలో సహకారం అందటం లేదనేది మాజీ ఎమ్మెల్యే వర్గం చెబుతున్న మాట. అమ్మిశెట్టి వర్గం ఇలా వ్యవహరించడానికి పార్టీలో సీనియర్ నేతల సపోర్టేనన్నది సామినేని బ్యాచ్ అనుమానంగా తెలుస్తోంది. అటు అమ్మిశెట్టి వర్గం వాదన వేరేలా ఉంది. కష్ట కాలంలో ఉన్న నాటి నుంచి పార్టీ కోసం పనిచేశామని, ఇప్పుడు పవర్ వచ్చాక కూడా… అదే స్ఫూర్తితో ఉన్నామని, అలాంటి మా మీద కొత్త వాళ్ళు వచ్చి సవారీ చేస్తామంటే ఊరుకుంటామా అన్నది వాళ్ళ వాదన. మా వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా…. పవన్ కళ్యాణ్ ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు కాబట్టి కలిసి పని చేద్దామనుకుంటున్నా…ఆ వర్గంలోని కొందరు ఇబ్బంది పెడుతున్నారన్నది అమ్మిశెట్టి సన్నిహితుల ఆరోపణ. కార్యక్రమాలకు పిలవటం లేదని, ఫ్లెక్సీల్లో ఫోటోలు వేయకుండా అవమానిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్లు మమ్మల్ని తక్కువ చేసి చూస్తుంటే ఊరుకుంటామా అని ప్రశ్నిస్తోంది వాసు వర్గం.ఈ వ్యవహారం ముదిరి పవన్ దృష్టికి కూడా వెళ్ళిందట. అందరూ కలిసి పనిచేయాలని ఆయన సందేశం పంపినా… మాటలు కలవడం లేదట. ఏదో… పై నుంచి చెప్పారు కాబట్టి, కలిసి పనిచేస్తున్నట్టు నటిస్తూ… కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నట్టు చెప్పుకుంటోంది జనసేన కేడర్. విజయవాడ నగరంలో కనీస ప్రాతినిధ్యం కూడా లేని జనసేన బలపడాలంటే అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని, ఆ పని వదిలేసి ఇలా కీచులాడుకుంటుంటే బలోపేతం సంగతి తర్వాత.. ఉన్న ఈ కాస్త బలం కూడా పోతుందని, తర్వాత బూస్ట్‌లు, బోర్న్‌విటాలు ఎన్ని తాగినా ఉపయోగం ఉండబోదని కార్యకర్తలే సెటైర్స్ వేస్తున్నారు.