జనసేన శాసనసభ్యులకు తాము పవర్ ఉన్నామా? లేదా? అన్న డౌట్స్ పెరిగిపోతున్నాయా? నియోజకవర్గాల్లో తోలు బొమ్మల్లా మిగిలిపోతున్నామన్న ఆవేదన వాళ్ళలో సుడులు తిరుగుతోందా? ఏంటీ గతి… మనకెందుకీ ఖర్మ…? ఇందుకేనా జనం మనకు ఓట్లేసి గెలిపించిందంటూ తెగ ఫీలైపోతున్నారా? మెజార్టీ జనసేన ఎమ్మెల్యేలు అలా ఎందుకు ఫీలవుతున్నారు? వాళ్ళకు ఎక్కడ తేడా కొడుతోంది?
వంద శాతం స్ట్రైక్‌రేట్….. ఆంధ్రప్రదేశ్ కూటమిలో కీలక పాత్ర….. అధికారంలో భాగస్వామ్యం….. ఇదంతా పైకి చెప్పుకోవడానికి బాగానే ఉన్నా, వినడానికి వాహ్… అన్నట్టు ఉన్నా… వాస్తవంలో మాత్రం జనసేన ఎమ్మెల్యేలు అంత సంతోషంగా లేరట. ఇంకా మాట్లాడుకుంటే… వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఓ స్థాయి దాటి వెళ్ళిపోయినట్టు చెప్పుకుంటున్నారు. అసలు మనం గెలిచామా? శాసనసభ్యులమేనా? మనకూ పవర్స్ ఉంటాయా అన్న డౌట్స్ వస్తున్నాయట ఎక్కువ మంది గ్లాస్ పార్టీ ఎమ్మెల్యేలకు. ఎన్నికలు ముగిసి ఏడాది గడిచినా… తామింకా ప్రభుత్వంలో భాగస్వాములం కాదా అన్న అనుమానాలు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోమని సదరు శాసనసభ్యులు సన్నిహితుల దగ్గర ఘొల్లుమంటున్నట్టు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలున్న మెజార్టీ నియోజకవర్గాల్లో… లోకల్ టీడీపీ నాయకులు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారట. అందుకే… కడుపు చించుకుంటే కాళ్ళమీద పడేట్టుంది మా పరిస్థితి అంటూ…వాళ్ళు మధన పడుతున్నట్టు సమాచారం. ప్రతి ఒక్కరూ…. నాకే ఇలా ఉందా? లేక అందరిదీ అదే పరిస్థితా అని క్రాస్ చెక్ చేసుకుంటుండటంతో…. మెల్లిగా విషయం బయటపడుతోందట. మనమే కాదు… చివరికి పిఠాపురంలో పార్టీ అధినేత పరిస్థితి కూడా అలాగే ఉందా అనే అనుమానాలు సైతం వెంటాడుతున్నాయట కొందరు జనసేన ఎమ్మెల్యేల్ని.
అనుమానం కాదు.. అది కూడా నిజమే. డిప్యూటీ సీఎంగా, సినిమాలతో పవన్ బిజీగా ఉన్నందున పిఠాపురంలో కూడా టీడీపీ పెత్తనమే నడుస్తోందని, వెరసి..ఒకటి రెండు తప్ప మెజార్టీ జనసేన నియోజకవర్గాల్లో…అలాంటి వాతావరణమే ఉందన్న గుసగుసలు పార్టీలో గట్టిగానే వినిపిస్తున్నాయట. అక్కడంతా… టిడిపి నేతల పెత్తనాలే ఎక్కువగా ఉంటున్నాయి తప్ప తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కడంలేదన్నది గ్లాస్ శాసనసభ్యుల ఆవేదనగా తెలుస్తోంది. అయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేనే ఫైనల్ అని పార్టీ పెద్దలు చెబుతున్నా… టిడిపి గెలిచిన చోట ఒకలా.. జనసేన గెలిచినచోట మరోలా ఉంటోందన్నది గ్లాస్ లీడర్స్ ఆవేదన. ఎమ్మెల్యేలుగా తాము చేయాల్సిన పనులను సైతం టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు భుజానికెత్తుకోవడం, ప్రభుత్వంలో మేం మాత్రమే అన్నట్టుగా అధికారులను సైతం వాళ్ళ వెంట తిప్పుకోవడాన్ని చూస్తూ భరించలేకపోతున్నామని అంటున్నారట. కోపం కట్టలు తెంచుకుంటున్నా… బయటికి మాత్రం ఏం చెప్పలేకపోతున్నామంటూ లోలోపల రగిలిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. పోనీ… ఎక్కడన్నా బరస్ట్ అవుదామా అంటే… ఎక్కడ పరువు పోతుందోనన్నది ఇంకో భయం. అందుకే కక్కలేక, మింగలేక అన్నట్టుగా ఉంటోందట జనసేన ఎమ్మెల్యేల పరిస్థితి. జనసేన గెలిచిన అన్ని చోట్ల దాదాపుగా అక్కడి టిడిపి ఇంఛార్జిలకు బలమైన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. పైగా వాళ్ళలో ఎక్కువ మంది సీనియర్స్ కావడంతో ఎమ్మెల్యేలకంటే దూకుడుగా ఉంటున్నట్టు తెలుస్తోంది.
పిఠాపురంలో ఓపక్క డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ….. అక్కడి టిడిపి ఇన్ఛార్జ్ వర్మ జిల్లా స్థాయి మీటింగులు పెట్టి కథ నడిపిస్తున్నా…. దాన్ని ఆ పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోడంలేదని.. అదేపని తాము చేస్తే మాత్రం టిడిపి నేతలు గగ్గోలుపెట్టేస్తున్నారని ఆవేదనగా అంటున్నారట జనసేన నేతలు. కలసి వెళ్ళమని పైకి చెబుతున్నా… విడివిడిగా ఎవరి దారివారిదేనని టిడిపి ఇంఛార్జిలు చెప్పకనే చెబుతున్నారనేది జనసేన నేతల మాట. కూటమిలో టీడీపీకి ఉన్న ప్రాధాన్యత మిగతా రెండు పార్టీలకు లేకుండా పోయిందంటున్నారు వాళ్ళు. జనసేనలో సీనియర్స్‌కే టీడీపీ ఇన్ఛార్జ్‌ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీన్నిబట్టి అసలు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నది గ్లాస్ వాయిస్. పైకి ఏదన్నా మాట్లాడదామంటే…. పార్టీ అధినేత పవన్ మాట జవదాటలేకపోతువన్నామని, ఇక మేం గెలిచి ఏం ప్రయోజనం అన్నది సేన ఎమ్మెల్యేల ఫ్రస్ట్రేషన్ అట.
రెండు పార్టీల నేతల మధ్య ఏదైనా సమస్యవస్తే సమన్వయ కమిటీ మీటింగ్‌లో ప్రస్తావిస్తూ… సర్దుకుపోవాలని చెబుతున్నారని, ఎంతసేపూ… సర్దుకుపోవాల్సింది మేమేనా అని తెగ ఫీలైపోతున్నారట కొందరు జనసేన నాయకులు. ఓవైపు పార్టీ అధినేతకు తమ బాధ అర్ధంకాకపోవడం, మరోవైపు టిడిపి నేతలు లెక్కచేయకపోవడంతో… కనీసం ఎమ్మెల్యేలుగా గెలిచామన్న ఆనందాన్ని కూడా అనుభవించలేకపోతున్నామన్నది ఎక్కువ మంది జనసేన నేతల మనోవ్యథగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ మరింతగా చొచ్చుకుపోవాలంటే తమకు స్వేచ్ఛ ఉండాలని పవన్‌కళ్యాణ్ దగ్గర కుండబద్దలు కొట్టే ప్లాన్‌లో ఉన్నారట కొందరు నాయకులు. అయితే… ఇక్కడ కూడా పిల్లి మెడలో గంట కట్టేది ఎవరంటూ వెనకా ముందాడుతున్నట్టు తెలుస్తోంది. కనీసం మరో పది పదిహేనేళ్ళు కలిసుండాలని పార్టీ పెద్దలు చెబుతున్నా… క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదని, వాటి మీద సీరియస్‌గా దృష్టి పెడితేనే ఆ లక్ష్యం నెరవేరుతుందన్నది జనసేన నేతల అభిప్రాయం.
