Off The Record: సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడిచే ఆ వ్యవస్థకు ఇన్నాళ్ళుగా కేరాఫ్ అడ్రస్ లేదా? దాన్ని నడిపించే ఉన్నతాధికారి కూర్చునేందుకు ఆఫీస్ సైతం కానరాలేదా? స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్న ఆ అధికారి ఎక్కడి నుంచి ఆ వ్యవస్థని నడిపించాలి? అసలెందుకా పరిస్థితి వచ్చింది?
Read Also: TDP vs Janasena: కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు!
తెలంగాణ సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్. గడిచిన పదేళ్ళుగా… ఐటి, ఇండస్ట్రీస్ స్పెషల్ సీఎస్‌గా కొనసాగుతూ వచ్చారాయన. కానీ… ఇటీవల జరిగిన బదిలీల్లో స్పీడ్ సీఈఓగా ఆయన్ని నియమించింది ప్రభుత్వం. కానీ… ఇప్పటి వరకు ఆ సంస్థ కార్యకలాపాలు కొనసాగించేందుకు ప్రత్యేక ఆఫీసు అంటూ ఏది లేదు. దాని కోసం వెదుకులాట కొనసాగుతోందట. గతంలో బీఆర్‌ఎస్ ముఖ్యులతో అంటకాగారన్న ఆరోపణలు ఎదుర్కొన్న జయేష్‌ను ఇప్పుడు సీఎంవోలోకి తీసుకోవడంతోపాటు… స్పీడ్ లాంటి కీలక విభాగాన్ని అప్పగించింది సర్కార్. కానీ… ఆయనకు ఇటు సచివాలయంలోగాని, అటు స్పీడ్ ఆఫీస్‌గాని లేకపోవడంతో… ఎక్కడ ఛార్జ్ తీసుకోవాలో, ఎలా కూర్చోవాలో అర్ధంగాక సతమతమవుతున్నట్టు సమాచారం. స్పీడ్ ప్రోగ్రామ్‌కింద 19 ప్రాజెక్టులు ఉన్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, శాటిలైట్ టౌన్‌షిప్స్ అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్స్ అభివృద్ధి, కొత్త ఉస్మానియా హాస్పిటల్, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీల ఏర్పాటు లాంటివన్నీ దీనికిందే ఉన్నాయి. అంత ముఖ్యమైన విభాగానికి కేరాఫ్ అడ్రస్ అంటూ లేకుండా పోయింది. ఇప్పటి వరకు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాల కోసం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర్లో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆఫీస్, ముఖ్యమంత్రి నివాసం, సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ లాంటి వాటిని సందర్భానుసారం వాడుతూ వచ్చారు.
Read Also: Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..?
కానీ, ఇప్పుడు సీఈవో, అడిషన్ సీఈవో పోస్టులను ఏర్పాటు చేయడంతో కచ్చితంగా ఆఫీస్ చూడాల్సిన పరిస్థితి. జయేష్‌రంజన్‌లాంటి సీనియర్ ఐఎఎస్ ఆఫీసర్‌ని అపాయింట్ చేసేటప్పుడైనా… కనీసం ఆఫీస్ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఆయన వరకు సెక్రటేరియట్ లో తాత్కాలిక ఛాంబర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ పూర్తి స్థాయి స్పీడ్ ఆఫీస్ ఎక్కడన్న విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అనువైన భవనం కోసం వెదుకుతూనే ఉన్నారట. నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, ఔటర్ దగ్గరలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తులతో పాటు బేగంపేటలోని మెట్రో భవన్, పాత రంగారెడ్డి జిల్లా కార్యాలయం, తార్నాకలోని హెచ్ఎండీఏ బిల్డింగ్, ఆదర్శ్ నగర్ లోని హెర్మిటేజ్ బిల్డింగ్ వంటి వాటిని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అది వెంటనే దొరక్కుంటే…. ఫైనల్‌గా సచివాలయంలోనే తాత్కాలిక సర్దుబాటు చేసే యోచన ఉందట. అయితే…అంత కీలకమైన విభాగానికి ఇన్నాళ్లుగా ఒక కేరాఫ్ లేకపోవడం, ఇప్పుడు స్పెషల్ సీఎస్ హోదా ఉన్న అధికారిని అపాయింట్ చేశాక ఆఫీస్ కోసం పరుగులు పెట్టడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారట బ్యూరోక్రాట్స్. గత ప్రభుత్వంలో పదేళ్లు ఓ వెలుగు వెలిగిన జయేష్‌కు ఇప్పుడు ఓ ఆఫీసు కూడా లేకుండాపోయిందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఐటీ ప్రముఖులు, విదేశీ పర్యటనలు, స్టార్ట్ హోటల్స్‌లో బసలు, కంపెనీల ఓనర్లు, సీఈవోలతో బిజీగా ఉన్న జయేష్ రంజన్ ఇప్పుడు తను పనిచేసేందుకు ఆఫీసు వెదుక్కునే దుస్థితి వచ్చిందని మాట్లాడుకుంటున్నారట ఐఎఎస్‌లు. ఆఫీస్ ఎప్పుడు దొరుకుతుందో, స్పీడ్ కార్యక్రమాలు ఎప్పుడు స్పీడందుకుంటాయో చూడాలి మరి.
