Site icon NTV Telugu

Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?

Gutta

Gutta

ఆ సీనియర్ లీడర్ స్వరం మారుతోందా? అందులో పైకి కనిపించని అసంతృప్తి ఏదో ధ్వనిస్తోందా? సొంత కాంగ్రెస్‌ ప్రభుత్వం మీదే ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారా? అది నిజంగా ప్రజా సమస్యలు పరిష్కారం అవలేదన్న ఫ్రస్ట్రేషనా..? లేక అంతకు మించిన స్పెషల్‌ ప్లానింగ్‌ ఉందా? ఎవరా ఫ్రస్ట్రేటెడ్‌ సీనియర్‌? ఏమా కథ? సీనియర్ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి తీరు ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఏ మాత్రం మొహమాట పడకుండా…. నేరుగా ప్రభుత్వానికి చురకలంటిస్తుండటంతో… స్వరం మారుతున్నట్టుందన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనన్‌పై ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టారాయన. సూచిస్తున్నాను, విజ్జప్తి చేస్తున్నానని అంటూనే… ప్రభుత్వ వైఖరిపై కాస్త ఘాటుగా రియాక్ట్‌ అవడంతో…. ఇదేం యాదృచ్చికంగా జరుగుతున్నది కాదు, వెనక ఏదో మతలబు ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సాధారణంగా తన సూచనలు, సలహాలను లేఖ రూపంలోనే ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు పంపించే గుత్తా… తాజాగా సుదీర్ఘకాలం తర్వాత నల్లగొండలోని తన ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఓపెనైపోవడాన్ని ప్రత్యేకంగానే చూడాలని అంటున్నారు పరిశీలకులు.ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తోందని, నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకు ఇస్తున్నారని, పక్కరాష్ట్రాల నుండి వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవడం లేదని, రైతు భరోసా అందరికీ అందలేదని… ఒకటేమిటి, ఇలా చాలా అంశాలను డైరెక్ట్‌గానే టచ్‌ చేశారాయన.

రైతు భరోసా లేదా సన్నాలకు బోనస్… వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాలన్నది గుత్తా మాట… ఏది ఇవ్వాలో ప్రభుత్వం ఓ క్లారిటీకి రావాలని అన్నారాయన. ఏది చేసినా రైతులకు సంపూర్ణంగా ఇవ్వాలన్నదే నా అభిప్రాయం అన్నది మండలి ఛైర్మన్‌ మాట. సన్నాలకు బోనస్ ఇస్తే… వాటిని పండించే రైతులకు మాత్రమే లబ్ది జరుగుతుందని, అదే రైతు బంధు అయితే…. ఎక్కువ మందికి లబ్ధి చేకూరుతుందన్నది గుత్తా ఆలోచన. సాధారణంగా అయితే…దీనంతటినీ… తన ఓల్డ్‌ స్టైల్‌లో లేఖ రూపంలో ప్రభుత్వానికి చెప్పవచ్చు. కానీ… ఈ సారి ఆ పంథాను ఎంచుకోలేదు మండలి చైర్మన్. ప్రెస్ మీట్ పెట్టి మరీ…. అందులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ హయాంలో… రైతుబంధు సమితి చైర్మన్ గా పనిచేసిన గుత్తాకు వ్యవసాయం, సాగునీటి రంగాలపై మంచి పట్టుంది. ఆ అనుభవంతోనే… SLBC కాలువలను కూడా వరద తీవ్రతకు అనుగుణంగా వెడల్పు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అలాగే… డిండి నీటిని సద్వినియోగం చేసుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా రెండు రకాల రేషన్ కార్డుల లాంటి చాలా ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచారు.

 

కానీ… వాటిని వేటినీ పట్టించుకోలేదన్న అసహనం ఆయనలో పెరుగుతోందట.తాను లేఖలు రాయడం, దానికి ప్రభుత్వం నుండి రిప్లై రావడం వరకు అంతా సవ్యంగానే జరుగుతున్నప్పటికీ….. ఏవీ ఆచరణలోకి రాకపోవడంపై కొంత కాలంగా గుత్తా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దీంతో తాను ఏం చేసినా, ఏది చెప్పినా ప్రజలకు తెలియాలన్న ఉద్దేశ్యంతోనే ప్రెస్‌ మీట్‌ పెట్టి ఉండవచ్చని అంటున్నారు. ఎప్పుడు, ఎలా, దేని గురించి మాట్లాడాలో స్పష్టమైన అవగాహన ఉండే నేతగా పేరున్న సుఖేందర్ రెడ్డి… తాజా ప్రెస్ మీట్ వ్యాఖ్యల వెనక కూడా పెద్ద ప్లానింగే ఉండవచ్చన్నది పొలిటికల్‌ వాయిస్‌. రాజకీయంగా ముందు చూపుతో, స్పష్టమైన ప్లానింగ్‌తోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని చెవులు కొరుక్కుంటున్నారు కొందరు. గుత్తా వ్యూచర్ పాలిటిక్స్ కోసం బిగ్‌ ప్లాన్‌లో ఉన్నారన్నది కొందరి విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో… ఇక నుంచి తన సూచనలన్నిటినీ ఇలా బహిరంగంగానే చెప్తారా.. వాయిస్‌ పెంచుతారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్‌.

Exit mobile version