Site icon NTV Telugu

Off The Record : టీడీపీ నుంచి బీజేపీలోకి గుమ్మనూరు నారాయణ.!

Tdp.

Tdp.

ఆ మాజీ మంత్రి సోదరుడికి పసుపు వాసన పడలేదా? అందుకే కాషాయం కప్పుకుని మురిసిపోతున్నారా? టీడీపీ ఎమ్మెల్యే బ్రదర్‌ మిత్రపక్షం బీజేపీలో చేరడాన్ని ఎలా చూడాలి? పాత నియోజకవర్గంలో పట్టు పోతోందని ఆ టీడీపీ ఎమ్మెల్యేనే బ్రదర్‌ని పంపారా? లేక అక్కడున్న పొలిటికల్‌ వ్యాక్యూమ్‌తో అలా అయిపోయిందా? ఎక్కడ జరిగిందా వ్యవహారం? ఎవరా బ్రదర్స్‌? మాజీ మంత్రి, గుంతకల్లు సిట్టింగ్‌ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వరుసకు సోదరుడు నారాయణ టీడీపీ కండువా తీసేసి కాషాయమ కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో అపార్టీ తీర్థం పుచ్చుకున్నారాయన. తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తో కలసి చర్చించిన ఫోటోల్ని పార్టీలో చేరక ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం కూడా చేసుకున్నారాయన. ఆలూరు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో ఐదేళ్ళు మంత్రిగా పని చేశారాయన. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ కండువా కప్పుకుని గుంతకల్ టికెట్‌ మీద గెలిచారు జయరాం. ఆ తర్వాత ఆలూరు నియోజకవర్గంపై పట్టు కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. జయరాం మంత్రిగా కొనసాగుతున్నపుడు ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నిటిని నడిపించారు గుమ్మనూరు నారాయణ. అదే సమయంలో ఎక్కువగా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారాయన.

అప్పట్లోనే జయరాం సొంతూరిలో భారీ పేకాట క్లబ్ పై మహిళా ఏఎస్పీ దాడి చేయడం, అక్కడి వ్యవహారాలు చూసే జయరాం కజిన్ నారాయణపై కేసు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. చివరికి వైసీపీ కార్యకర్తల మీద కూడా గుమ్మనూరు నారాయణ దాడిచేయడం వంటి పరిణామాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు నారాయణ. జయరాం ఆలూరు నియోజకవర్గం వదిలిపెట్టి గుంతకల్లు ఎమ్మెల్యే అయ్యాక కూడా గుమ్మనూరు నారాయణకు గుత్తి మండల బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా గుమ్మనూరు నారాయణ వివాదాలకు కేరాఫ్‌ అయ్యారట. ఆ క్రమంలోనే… పాణ్యం మండల ఇన్చార్జిగా ఉన్న జయరాం కుమారుడు ఈశ్వర్‌కు, గుమ్మనూరు నారాయణకు విబేధాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. కారణం ఏదైనాగానీ… నారాయణను గుత్తి మండల ఇన్చార్జిగా తొలగించడంతో తిరిగి ఆలూరు మీద ఫోకస్‌ పెట్టారట. ఒక దశలో జనసేనలో చేరేందుకు ప్రయత్నించినా… వర్కౌట్‌ అవలేదు. ఆ తరువాత నుంచి మళ్ళీ గుమ్మనూరు జయరాం, నారాయణ తరచూ కలుస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆలూరు రాజకీయ సమీకరణలు మారిపోవడం ఆసక్తికరంగా మారింది.

ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా వైకుంఠం జ్యోతిని నియమించారు. దీంతో జయరాంకు నియోజకవర్గంలో ఏమాత్రం పట్టులేకుండా పోయిందట. ఇది గుమ్మనూరు కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనాసరే… టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి మిత్రపక్షం బీజేపీ కండువా కప్పుకోవడం ఆసక్తికరమైన పరిణామమేనని అంటున్నారు పరిశీలకులు. తొలుత ఆ వార్తలు బయటికి వచ్చినప్పుడు జయరాం బ్రేక్ వేస్తారా….లేక పోనీలే అని మౌనం వహిస్తారా అన్న చర్చ జరిగింది. ఫైనల్‌గా మాజీమంత్రి అందులో జోక్యం చేసుకోలేదనే వారు కొందరైతే అంతా… ఆయనకు తెలిసే జరిగిందనే వాళ్ళు మరికొందరు. ఆలూరు నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ కొరత ఉంది. గుమ్మనూరు నారాయణ ఆ పార్టీలో చేరి ఇన్ఛార్జ్‌ బాధ్యతలు తీసుకొని రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నారట. గుమ్మనూరు జయరాంకు మొన్నటి వరకు కుడి భుజంగా ఉన్న నారాయణ బీజేపీ చేరడంతో లోకల్‌గా తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని చూస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.

Exit mobile version