Off The Record : సుప్రీంలో ఫిరాయింపుల కేసు తేలగానే అధికారికంగా బీఆర్ఎస్లోకి?
- గెలిచిన ఆరు నెలల్లో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి
- కాంగ్రెస్‌లో ఇమడలేకపోయిన మహిపాల్ రెడ్డి
- స్థానిక కాంగ్రెస్ నేతల సహాయ నిరాకరణ
- ఓవైపు సహాయ నిరాకరణ, మరోవైపు ఫిరాయింపుల గందరగోళం
- మా భవిష్యత్ అగమ్యగోచరంగా ఉందని అనుచరుల వత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యే బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా? కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసేసుకున్నట్టేనా? సకుటుంబ సపరివార సమేతంగా కారెక్కేందుకు సిద్ధమై టైం కోసం చూస్తున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో తన వాళ్ళందరితో బీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయించిన ఆ శాసనసభ్యుడు ఎవరు? తదుపరి స్టెప్ ఏంటి? పటాన్ చెరు నుంచి హ్యాట్రిక్ కొట్టారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 2023 ఎన్నికల్లో తాను గెలిచినా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం, మైనింగ్ కేసులో సోదరుడు మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం లాంటి కారణాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారాయన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కారు స్టీరింగ్ వదిలి హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు.తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నా రాను రాను కాంగ్రెస్‌లో ఇమడలేకపోయారట ఆయన.బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు మహిపాల్‌రెడ్డి తీరును జీర్ణించుకోలేకపోయిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆయనకు సహకరించలేదంటారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందిపెట్టిన మహిపాల్ రెడ్డిని ఎలా చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.
ఆ విషయం అలా ఉంచితే…..మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ కోవర్ట్ అనేది కాంగ్రెస్ నాయకుల ప్రధాన ఆరోపణ. పటాన్ చెరులో కాంగ్రెస్‌ను సర్వనాశనం చేయడానికే పార్టీలోకి వచ్చారంటూ వాదించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి, ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్ కి పడలేదు. ఆయన ఎక్కడికెళ్లినా కాంగ్రెస్ నాయకులు అడ్డుకుని చుక్కలు చూపించారు. ఇక బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. వాళ్ళ మీద వేటేయాలని ఫిర్యాదు చేసింది. ఓ వైపు స్థానిక కాంగ్రెస్ నాయకుల సహాయ నిరాకరణ, మరోవైపు ఫిరాయింపు కేసు కారణంగా తీవ్ర గందరగోళంలో పడ్డారు మహిపాల్‌రెడ్డి. కాంగ్రెస్ కేడర్‌కు దగ్గర కాలేక, తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్లలేక సతమతమయ్యారట ఆయన. పరిస్థితి ఇలానే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అనుచరగణం మొత్తం ఎమ్మెల్యే దగ్గర గోడును వెళ్లబోసుకుందట. ఏదో ఒకటి తేల్చుకోలేకపోతే మొదటికే మోసం వస్తుందని, ఇక నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది.
Also Read
దీంతో మహిపాల్‌రెడ్డి యూ టర్న్ తీసుకున్నా…. కారు ఎక్కేందుకు మొదట్లో బీఆర్‌ఎస్ అధిష్టానం ఒప్పుకోలేదట. సుప్రీంలో పార్టీ ఫిరాయింపుల కేసు నడుస్తున్న సమయంలో తిరిగి పార్టీలోకి వస్తే వేరే సంకేతాలు వెళ్తాయని చెప్పారట గులాబీ పెద్దలు. దీంతో… తన బంధు, అనుచర గణాన్ని మొత్తం బీఆర్ఎస్‌కి పంపేసి తాను అలా ఉండిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి ఎమ్మెల్యే అసలు రూపం బయటపడిందని అంటున్నారు కాంగ్రెస్ లీడర్స్. తాను చేరిన పార్టీపైనే బహిరంగంగానే విమర్శలు చేశారాయన. కాంగ్రెస్‌లో చేరితే వెంట్రుక వాసి లాభం కూడా జరగలేదని తన అనుచరులతో అన్నారట. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని ఆఫ్ ద రికార్డ్‌లో అన్నట్టు సమాచారం. అంతటితో ఆగకుండా కార్మిక సంఘాల సన్నాహక సమావేశంలోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ మరోసారి మనసులో మాటను బయటపెట్టారాయన.
తన భార్య, సోదరుడు, కుమారుడు బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేల లిస్ట్ నుంచి మహిపాల్ రెడ్డి పేరు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిరాయింపుల కేసుపై సుప్రీం కోర్ట్ తుది తీర్పురాగానే… అధికారికంగా గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ని మధ్యలోనే వదిలేయడంపై క్యాడర్ గుర్రుగా ఉంది. ఆయన్ని చేర్చుకోవద్దు మొర్రో అంటే వినలేదు, చివరికి పార్టీని విమర్శించినా ఎందుకు యాక్షన్ లేదంటూ హైకమాండ్ పై కోపంగా ఉందట పటాన్‌చెరు కేడర్. సర్పంచ్ ఎన్నికల సమయంలో సైలెంట్‌గా ఉన్న మహిపాల్ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి బహిరంగంగా బీఆర్ఎస్ కి ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు ఇబ్బందేనన్నది కేడర్ వాయిస్. ఎవరి వాదన ఎలా ఉన్నా… మహిపాల్ రెడ్డి గులాబీ గూటికి చేరడం మాత్రం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం పటాన్ చెరులోని 5 మున్సిపాలిటీల ఫలితాలపై ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
-
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!