Site icon NTV Telugu

Off The Record : లోక్ సభ ఎన్నికల తర్వాత ఈటలకు ప్రాధాన్యం తగ్గుతోందా?

Etela

Etela

తెలంగాణ బీజేపీలో తన ప్రాధాన్యం తగ్గిపోతున్నట్టు ఎంపీ ఈటల రాజేందర్‌ ఫీలవుతున్నారా? ఇక లాభం లేదు, తాడో పేడో తేల్చేసుకోవాలని డిసైడయ్యారా? కొందరు పనిగట్టుకుని తనను బద్నాం చేస్తున్నట్టు ఆయన భావిస్తున్నారా? ఏ విషయంలో ఎంపీ ఆ స్థాయిలో హర్ట్‌ అయ్యారు? ఇన్నాళ్లు కాస్త అటు ఇటుగా ఉన్నా… ఇప్పుడెందుకు అంత సీరియస్‌ అవుతున్నారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నుంచి 2004 – 2023 మధ్య నాలుగు సాధారణ ఎన్నికలు, మూడు ఉప ఎన్నికల్లో గెలిచి తన పట్టు నిలుపుకున్నారు ఈటల రాజేందర్‌. కేసీఆర్‌తో విభేదించడంతో పాటు రకరకాల కారణాల వల్ల బీఆర్‌ఎస్‌ నుంచి బయటికి వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నారాయన. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లో అప్పటి సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఈటల. అయితే…. తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి బరిలో దిగి గెలిచారు. అయితే… పార్లమెంట్ ఎన్నికల తర్వాతి నుంచి బీజేపీలో ఈటల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతుందని, ఇంకా చెప్పాలంటే… ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారు ఆయన అనుచరులు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవడాన్నే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అదే సమయంలో మల్కాజిగిరి ఎంపీ అయ్యాక హుజూరాబాద్‌కు టైం ఇవ్వడం బాగా తగ్గించేశారు రాజేందర్‌. అంతకు ముందు వారంలో ఐదు రోజులకు తగ్గకుండా నియోజకవర్గంలో ఉండే నాయకుడు తర్వాత చుట్టపుచూపుగా మారిపోయారన్నది లోకల్‌ కేడర్ మాట. అయితే ఆ లోటును పూరిస్తూ… ఇటీవల పంచాయతీ ఎన్నికల సమయంలో తరచుగా హుజూరాబాద్‌కు వచ్చి తన మనుషులను పలు చోట్ల సర్పంచ్‌లుగా గెలిపించుకున్నారు. కానీ… ప్రస్తుతం జరుతున్న మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ మళ్లీ ఇటువైపు రావడం మానేశారాయన.

ఈ నియోజకవర్గం పరిధిలో జమ్మికుంట, హుజూరాబాద్ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ పట్టు సాధిస్తేనే ఎమ్మెల్యేగా విజయం దక్కుతుంది. అంత ప్రాధాన్యత ఉన్న పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్ని ఈటెల ఎందుకు పట్టించుకోవడం లేదన్న అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన హుజురాబాద్‌ వైపు రావడం లేదన్నది లోకల్‌ కేడర్‌ చెబుతున్న మాట. రాష్ట్రంలో పార్టీకి 8మంది ఎంపీలు ఉండగా…. ఒకరి నియోజకవర్గంలో మరొకరు జోక్యం చేసుకోవద్దని పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాలిచ్చిందట.అందుకే రావడంలేదని కొందరు అంటుంటే…. మరికొందరు మాత్రం…. మున్సిపల్ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్స్‌ లిస్టులో ఈటల ఉన్నారు.ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు. రావద్దని అంటే స్టార్ట్ క్యాంపెయినర్‌గా ఎందుకు ఎంపిక చేస్తారని అడుగుతోంది మరో వర్గం. కానీ అసలు విషయం వేరే వుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ముక్కోణపు పోటీ, లోకల్ బీజేపీ నేతల సహకారం లేకపోవడం, స్థానిక ఎంపీ బండి సంజయ్ అప్పర్ హ్యాండ్ సాధించడం లాంటి కారణాలతో ఇక్కడి మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోక పోవడమే నయం అని తొలుత భావించారట ఆయన. కానీ…పక్క నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ నాయకత్వం సీరియస్‌గా చెప్పాక పునారాలోచనలో పడ్డట్టు తెలిసింది. అసలు ఆ రూల్‌ పెట్టిందే తన కోసమని, తనను హుజురాబాద్ రాకుండా చేసేందుకే నిబంధన పెట్టారని గట్టిగా భావించి మనసు మార్చుకున్నట్టు తెలిసింది. ఆ క్రమంలోలే… లోకల్‌గా ఉన్న తన గ్రూప్‌తో సంప్రదించి వాళ్ళ ప్రభావం ఉన్న చోట్ల పోటీలో ఉండమని చెప్పేశారట.

ఈ రెండు మున్సిపాలిటీల్లో బీజేపీ ప్రకటించిన కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాలో తమకు తగినంత ప్రాధాన్యత దక్కలేదని ఆయన అనుచరులు ఈటల దృష్టికి తీసుకువెళ్ళారు. అదే సమయంలో ఆయన అనుచరులుగా పేరున్న కొందరు నేతలు ఫార్వార్డ్ బ్లాక్ తరపున, ఇండిపెండెట్లుగా బరిలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పైకి మాత్రం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకే తమ మద్దతు అని స్థానిక ఈటల టీం ముఖ్యులు అంటున్నా… లోపల వేరే జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల ప్లాన్‌నే ఇప్పుడు కూడా అమలు చేయాలన్న నిర్ణయానికి ఎంపీ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో అక్కడక్కడ ఆయన ఫోటో లేకుండా ఫ్లెక్సీలు వెలుస్తుండటం దీనికి మరింత ఊతం ఇస్తోంది. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ నిర్వహించిన సుడిగాలి ప్రచారానికి సైతం టచ్‌మీ నాట్ అన్నట్టే ఉన్నారట ఈటల అనుచరులు.పార్టీ ఆదేశం ప్రకారం నియోజకవర్గానికి రాకపోయినా….. తన మార్క్ చూపించాలని రాజేందర్‌ డిసైడైనట్టు తెలుస్తోంది. తాను ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించకుండానే… తన వారికి కావాల్సిన అన్ని హంగులు సమకూర్చాలని భావిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రెండు మున్సిపాలిటీల్లో పొలిటికల్‌గా కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు. అటు రాష్ట్ర పార్టీలో అందివచ్చిన అవకాశం దక్కకుండా పోవడం, ఒంటరిని చేసే ప్రయత్నాలు ఊపందుకోవడం, ఇటు సొంత నియోజకవర్గంలో అడుగుపెడితే పార్టీతో ఇబ్బంది,వెళ్లకపోతే క్యాడర్‌తో కష్టం..
ఈ సమయంలో ఇంకా సంయమనం పాటించడం సరికాదనే భావనకు వచ్చిన ఈటల తాడో పేడో తేల్చుకోవడానికి సిద్దమయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తాడో పేడో అన్నది డైరెక్ట్‌గా పార్టీతోనా..? లేక తన అసెంబ్లీ నియోజకవర్గం హుజురాబాద్ వరకే పరిమితమా అన్నది క్లారిటీ రావాల్సి ఉందని అంటున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా పావులు కదుపుతున్న ఈటల వ్యూహం ఫలిస్తుందా…? ఆయన విసరబోతున్న ఈట ఏ లక్ష్యాన్ని చేరుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version