Site icon NTV Telugu

Off The Record : చేసింది మంచి పని అయినా చెప్పుకోలేకపోతున్న ప్రభుత్వం

Hydra

Hydra

Off The Record : తెలంగాణ ప్రభుత్వ పెద్దలు,కాంగ్రెస్ నేతలు.. చేసింది కూడా చెప్పుకోలేక పోతున్నారా..? మంచి చేసిన చెప్పుకోలేకపోవడంతో ప్రత్యర్థులు చేసే ప్రచారమే పైచేయిగా మారుతుందా? చెప్పేవాళ్లు లేకనా… ఏమవుతుందిలే అని వదిలేస్తున్నారా..? పదేపదే అదే లోపం కనిపిస్తోందా?. ఇంతకీ ఆ లోపమెక్కడుంది?చేసింది ఏమీ లేకపోతే చెప్పుకోకపోవడం అనేది ఉండదు.. ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి. కానీ చేసింది మంచి పని అయినా చెప్పుకోలేకపోతోంది ప్రస్తుత ప్రభుత్వం. చేసింది చెప్పుకునే వరకు ప్రతిపక్షం దాన్ని రాచీ రంపాన పెట్టీ… వాళ్ళు చెప్పిందే నిజమేమో అనే స్థాయిలో బ్రాంతి కల్పించే వరకు వెళుతుంది. జరుగుతున్న వ్యవహారం.. ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు తెలియదా అనుకుంటే పొరపాటు. తెలిసినా కూడా ఎందుకు చూసి చూడనట్టు ఉంటున్నారు అనేది అంతుచిక్కని సమస్యగా మారింది.

తెలంగాణలో ఇటీవల రైతాంగం యూరియా కొరతతో ఇబ్బంది పడిన మాట వాస్తవం. రైతులకు యూరియా సకాలంలో అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం మొదలుకొని మంత్రుల వరకు అంతా కేంద్ర ప్రభుత్వాన్ని మాకు సకాలంలో యూరియా అందించండి అని వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు కానీ అనుకున్నంత స్థాయిలో యూరియా సరఫరా కాలేదు. కారణం ఏదైనా కావచ్చు దీన్ని కూడా యూరియా అందించాల్సిన బీజేపీనే… రాష్ట్రంపై నెపంవేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అడపా దడపా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పితే కేబినెట్‌లో ఉన్న ముఖ్యమైన మంత్రులు ఎవరు అది తమ విషయమే కాదన్నట్టు లైట్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేని యూరియా విషయంలోనే ప్రతిపక్షం.. రేవంత్ సర్కారు వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారని రేంజ్ లో ప్రచారం చేశారు. అయినా చీమకు కుట్టినట్టు కూడా లేదు….అటు కేబినెట్‌లో ఉన్న కొందరు మంత్రులకు ఇటు పార్టీలో ఉన్న నేతలకు.

యూరియా సంగతి అలా ఉంటే… తాజాగా హైదరాబాదులో హైడ్రా వ్యవహారం మరొకటి. గాజులరామారం ఏరియాలో ప్రభుత్వ భూమిని కొందరు భూకబ్జా దారులు వెనకాల ఉండి ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం జరిగింది అంటూ హైడ్రా చెప్తుంది. అందుకే పేదల పేరుతో వేసుకున్న భూ బకాసురుల నిర్మాణాలు కూల్చామని అని అంటోంది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడితే దానిపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ప్రతిపక్షం దీనిపై గగ్గోలు పెడుతుంటే కూడా మౌనంగానే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ భూమి కబ్జాకు గురైన బాధ్యులు… కబ్జా కి గురి అవుతున్న పట్టించుకోని అధికారుల గురించి అసలు దృష్టి పెట్టినట్టు కనిపించట్లేదు. ప్రభుత్వ భూములను కాపాడే పని సర్కారు చేస్తున్న దాని వెనకాల భూకబ్జాదారులు.. దాంతో నష్టపోయే వాళ్లు రాజకీయంగా కాంగ్రెస్ ను డ్యామేజ్ చేస్తున్న ఎందుకో మౌనంగా ఉంటున్నారు.. అనేది సొంత పార్టీలోని నాయకులే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు… జిల్లా మంత్రులు కావచ్చు.. లేదంటే జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అంతెందుకు ఎంతో ఆక్రమణకు గురైన బతుకమ్మ కుంటను అద్భుతంగా రూపొందించినా.. దాన్ని కూడా పూర్తిస్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయింది. చేసింది గోరంత.. చెప్పుకునేది కొండంత అనే స్టాటజీని రాజకీయ పార్టీలు బాగా వంట పట్టుకుంటాయి. కానీ తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీ చేసింది కూడా చెప్పుకోలేకపోతోంది. లోపం ఎక్కడ అనేది ప్రభుత్వ పెద్దలు… పార్టీ పెద్దలు తేల్చుకుంటే మంచిదేమో.

 

Exit mobile version