Off The Record : తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం.. కోఆర్డినేషన్ పేరుతో కొత్త డ్రామా..!

  • కాంగ్రెస్‌ అగ్ర నేతల మధ్య సమన్వయం లేదా?
  • సమన్వయ కమిటీ ప్రకటనలోనే ఆ విషయం బయటపడిందా?
  • కేసీ వేణుగోపాల్‌ ప్రకటనలో ముందు సీఎం రేవంత్‌ పేరు
  • మీనాక్షి నటరాజన్‌ లేఖలో ముందు పీసీసీ చీఫ్‌ పేరు
Congress

Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉన్నాయా? కొత్తగా వేసిన సమన్వయ కమిటీతో ఆ లోపం ఇంకా గట్టిగా బయటపడిందా? అసలు కమిటీ ప్రకటనలోనే సమన్వయం కొరవడిందా? అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళకు ఇప్పుడు కొత్తగా కమిటీ వేశారంటే… నిజంగానే పార్టీ, ప్రభుత్వం మధ్య కో ఆర్డినేషన్‌ లేదా? కాంగ్రెస్‌ పార్టీలో అసలేంటీ గందరగోళం? తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెర లేచింది. పార్టీ నాయకుల మధ్య సమన్వయం కోసమంటూ కమిటీ వేసింది ఏఐసీసీ. కానీ… అసలు కో ఆర్డినేషన్‌ కమిటీ వేసిన పార్టీ అగ్రనేతల మధ్యనే కో ఆర్డినేషన్ లేనట్టు కనిపిస్తోంది.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ విడుదల చేసిన రెండు వేర్వేరు ప్రకటనల్ని చూస్తుంటేనే…. ఆ ఇద్దరి మధ్య సయోధ్య లేదన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేసీ వేణుగోపాల్ విడుదల చేసిన ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మొదట్లో పెట్టారు. కానీ… మీనాక్షి నటరాజన్ ఇచ్చిన లేఖలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు ముందుకొచ్చింది. దీంతో కాంగ్రెస్‌ వ్యవహారాలకు సంబంధించి సోషల్‌ వీధుల్లో చర్చోపచర్చలు జరిగిపోతున్నాయి. వాళ్ళు చేస్తున్నారనేకంటే… ఈ చర్య ద్వారా పార్టీ అగ్ర నాయకులే సోషల్ మీడియాకు కావాల్సినంత స్టఫ్‌ ఇచ్చారంటూ కాంగ్రెస్‌లో అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు.

అసలు సమన్వయ కమిటీ వేయడంలోనే సమన్వయం లేదన్న ఇండికేషన్‌ పంపినట్టయింది. సహజంగా ఎప్పుడు అధికారంలో ఉన్నా.. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయ కమిటీ ఉంటుంది. కానీ… ఈసారి పవర్‌లోకి వచ్చిన రెండున్నరేళ్ళకు కమిటీ వేయడంపై డిస్కషన్స్‌ నడుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో పార్టీ సీనియర్ నాయకులందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కమిటీ ఏర్పడడంతో ఈ చర్చకు అవకాశం కల్పించినట్లు అయింది. ఇంత ఆలస్యంగా కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా… ఇన్నాళ్ళు ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం లేదని పార్టీ పెద్దలు చెప్పాలనుకున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఢిల్లీలో అధిష్టానం వద్ద ముఖ్యమైన నేతలు వన్ టు వన్ సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ఒకరిద్దరు సీనియర్ నేతలు సమన్వయం లేదన్న అంశంపై అధిష్టానానికి చెప్పడం వల్లనే ఈ కమిటీ వచ్చిందనట్టు చెప్పుకుంటున్నారు. మరి పార్టీలో, ప్రభుత్వంలో జరిగే కీలక నిర్ణయాలని ఈ కమిటీని ఫైనల్ చేయబోతుందా..? ఇది ఎవరికి చెక్ పెట్టడానికి, ఎవర్ని బుజ్జగించడానికి అన్న చర్చలు నడుస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్‌లో.