తెలంగాణ పీసీసీకి కొత్త హంగులు రాబోతున్నాయా? పూర్తి స్థాయి కమిటీ నియామకం కోసం కసరత్తు దాదాపు పూర్తి కావచ్చిందా? వర్కింగ్ ప్రెసిడెంట్ విషయంలో కూడా పిక్చర్ క్లియరైందా? ఆపోస్ట్‌తోనే మహిళా కోటాను కూడా భర్తీ చేయాలన్న ప్లాన్ ఉందా…? అలాగైతే రేస్‌లో వినిపిస్తున్న పేరేంటి? ఆ నాయకురాలి విషయంలో ఉన్న లెక్కలేంటి? తెలంగాణ PCC చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు తీసుకుని ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ.. ఇంతవరకు పూర్తి స్థాయిలో కమిటీ వేసుకోలేక పోయారు. ఆ విషయంలో ఆయనకే ఆసక్తి లేదో.. లేక ఆ స్వేచ్ఛ ఇవ్వలేదోగానీ… Pcc కమిటీలో కార్యదర్శుల నియామకం లేదు. అధికార ప్రతినిధుల పట్టింపు అంతకంటే లేదు. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్స్ సంగతి సరేసరి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా కీలకం. కానీ… గడిచిన ఏడాదిన్నరలో ఆ పోస్టుల్ని భర్తీ చేయలేదు. ఈ పరిస్థితుల్లో… త్వరలోనే ఆ నియామకం దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం Pcc చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, CM రేవంత్‌రెడ్డి… పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీ కోసం కసరత్తు చేస్తున్నారట. ఇటీవల కొన్ని పదవుల్ని అర్హులకు ఇవ్వగా….. మిగిలిన నామినేటెడ్ పోస్ట్‌లతో పాటు పార్టీ పదవుల్ని కూడా భర్తీ చేయబోతున్నారు. ఆ క్రమంలోనే… పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా.. కోదాడ MLA ఉత్తం పద్మావతి పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి పద్మావతి కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఆశించినట్టు తెలుస్తోంది. అయితే… కేబినెట్ హోదాలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం పట్ల పార్టీ ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తోంది. ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. దాంతో… ఒకే ఇంట్లో రెండు కేబినెట్ ర్యాంక్స్ ఉన్నాయన్న చర్చకు అవకాశం ఇవ్వకుండా.. పద్మావతికి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఆ విషయంలో మరో లెక్క కూడా ఉందట. పద్మావతికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇస్తే… మహిళా, రెడ్డి రెండు కోటాలు ఒకేసారి భర్తీ అయినట్టు అవుతుందని పెద్దలు భావిస్తున్నారని సమాచారం. మొత్తం నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కు అవకాశం ఉండగా…. మహిళా..రెడ్డి కోటాను ఒక్కరితోనే ఫిల్ చేస్తే… ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తలో పదవి ఇవ్వవచ్చనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ మిగతా ముగ్గురు ఎవరై ఉంటారన్న డిస్కషన్స్ మొదలయ్యాయి గాంధీభవన్‌లో.
