ఆ నియోజకవర్గంలో గులాబీ కేడర్ బలంగానే ఉన్నా…. నడిపే నాయకుడు మాత్రం లేకుండా పోయారా? నాయకత్వం ఇస్తే తీసుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కిస్తోందా? సందట్లో సడేమియా అంటూ… కింది స్థాయి బీఆర్‌ఎస్ లీడర్స్ మీదికి కాంగ్రెస్ వల విసురుతోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎందుకలా? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్‌ఎస్ కారు నడిపే డ్రైవర్ కరవయ్యారట. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో…లోకల్‌గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారవడం చూసి కేడర్‌లో కంగారు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. వైరాలో ప్రభావం చూపగలరని పేరున్న మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సైతం… తాజాగా కాంగ్రెస్‌లో చేరిపోవడం గులాబీ దళాన్ని మరింత కంగారు పెడుతోందట.
మధిర ఎమ్మెల్యేగా, భద్రాచలం దేవస్థానం ఛైర్మన్‌గా పని చేయడంతోపాటు…. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎనిమిదేళ్ళకు పైగా వివిధ కార్పొరేషన్స్ ఛైర్మన్ హోదాలో ఉన్నారు కొండబాల. అలాంటి నాయకుడు పార్టీని వదిలిపోవడం వైరా బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైరాలో కొండబాల కోటేశ్వరరరావు సామాజికవర్గం ప్రభావం చాలా ఎక్కువ. అందుకే ఆయన పార్టీ మారిపోకుండా… బీఆర్‌ఎస్ నాయకత్వం చాలా ప్రయత్నాలు చేసినా… వర్కౌట్ కాలేదట. అయితే… కేడర్ కూడా ఆయన వెనక క్యూ కట్టకుండా ఆపేందుకు ఆపసోపాలు పడుతున్నారు గులాబీ నాయకులు.
కానీ… ఇవాళ కాకుంటే రేపు అయినా… ఎక్కువ మంది అటువైపు వెళ్ళడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు సరైన నాయకత్వం లేదన్న ఉద్దేశ్యంతోనే అంతా పక్క చూపులు చూస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. 2014లో వైసీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన మదన్‌లాల్ ఆ తరువాత 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా కొనసాగుతూ… గత మేలో చనిపోయారాయన. ఇక అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగానే ఉండిపోయింది. మదన్‌లాల్ చనిపోయి కొద్ది కాలమే అయినా… ఇది స్థానిక ఎన్నికల పోరు సమమయం కావడంతో.. నడిపే నాయకుడు లేకుండా కష్టమని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. మరోవైపు 2009లో సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రావతి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2014లో బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారామె. ఇక ఆ తర్వాత చంద్రావతికి సీటు ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే… నిర్వహించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదట. అటు మదన్‌లాల్ భార్య మంజుల కూడా రేస్‌లో ఉన్నారట.
దీంతో.. ఇప్పుడు మదన్‌లాల్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక సీనియర్‌గా చంద్రావతిని గౌరవిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. పార్టీ అధిష్టానం తమ నాయకురాలిని అవసరమైనప్పుడల్లా వెంట తిప్పుకుంటూ తీరా పదవుల దగ్గరికి వచ్చేసరికి హ్యాండ్ ఇస్తోందన్న అసహనం ఇప్పటికే చంద్రావతి వర్గంలో ఉంది. ఈ పరిస్థితుల్లో… అధినాయకత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని, ఆలస్యం అయ్యేకొద్దీ నష్టం జరుగుతుందని అంటోంది కేడర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గ్రామ , మండల స్థాయి నాయకులకు గాలం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వైరా పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.
