OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్‌

Brs

Brs

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు…ములుగులో గులాబీ దళం ఇలాంటి స్కెచ్‌తోనే పొలిటికల్ హీట్ పెంచుతోంది. అటు భద్రాచలం, ఇటు ములుగులో తమ స్ట్రాటజీ అప్లై చెయ్యడానికి ఊహకందని వ్యూహం వేస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? ఈ ఒక్క వీడియో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ములుగు జిల్లాలో ఓ ప్రైవేట్ హోటల్ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ నేతలతో పోడెం వీరయ్య కనిపించిన దృశ్యాలు రకరకాల ఊహాగానాలకు తెర తీశాయి. ఇదంతా గులాబీ దళం వ్యూహమనే స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఒక్కసీన్ ఆ రేంజ్‌లో వాడివేడి డిస్కషన్‌కు దారి తీసింది. హోటల్ ఫంక్షన్‌లో రాష్ట్ర అటవీ సంరక్షణ శాఖ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య హాజరుకాగా, ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి తదితర నేతలు అటెండయ్యారు. అయితే, ఈ వేదికపై పోడెం వీరయ్య ప్రవర్తించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేవలం కాంగ్రెస్ పాత నాయకులతోనే కాదు బీఆర్ఎస్ నేతలతోనూ చాలా సన్నిహితంగా ముచ్చటించిన తీరు కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు పోడెం వీరయ్యకు ఇచ్చిన ప్రత్యేక ప్రాధాన్యత, కార్యక్రమం మొదలు నుంచి ముగింపు వరకు సాగిన వ్యవహారం వెనక అసలు కథ వేరే వుందన్న డౌట్స్‌ రైజ్‌ అయ్యేలా చేసింది.

కొంతకాలంగా కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్న పోడెం వీరయ్యను బిఆర్ఎస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సీతక్కకి చెక్ పెట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు కావాలని చూస్తున్న బిఆర్ఎస్ పెద్దలు…పోడెం వీరయ్యను లైన్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీతక్క వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్న పోడెం వీరయ్యతో కేటీఆర్ ఇప్పటికే ఒక రౌండ్ చర్చలు జరిపినట్లు కొంతకాలంగా చర్చ జరుగుతోంది. హోటల్‌ ప్రారంభోత్సవంలో పోడెం వీరయ్యకు, పల్లా, గండ్ర ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా అందుకు బలాన్నిస్తోంది.

పోడెం వీరయ్యని బిఆర్ఎస్ లోకి తీసుకోవడం వల్ల రెండు రకాల ఉపయోగాలుంటాయని లెక్కలేస్తోంది బీఆర్ఎస్. భద్రాచలంలో తమకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి చెక్ పెట్టడమే కాకుండా…ములుగు జిల్లాలో గట్టి నాయకున్ని అందుబాటులో తెచ్చినట్టు అవుతుందని సమీకరణాలు వేస్తోంది. భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్ పెద్దలు ప్రాధాన్యత ఇవ్వడం, ములుగులో సీతక్క తీరుతో పోడెం వీరయ్య అసంతృప్తిగా వున్నారట. భద్రాచలం కంటే తన సొంత నియోజకవర్గమైన ములుగు నుంచి బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నారట. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి కూడా పిలుపు రావడంతో అటు వైపుగా పోడెం మనసు మళ్లుతోందట. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ అభ్యర్థిగా పోదెం వీరయ్యను బరిలోకి దించేందుకు పావులు కదుపుతున్నారనే చర్చ ములుగు జిల్లాలో చాలా రోజులుగా నడుస్తోంది. పోడెం వీరయ్యతో అటు ములుగులో సీతక్కకు చెక్ పెట్టడమే కాకుండా, భద్రాచలంలోనూ పట్టు నిలుపుకునేందుకు గులాబీదళం పావులు కదుపుతోందన్న డిస్కషన్ జోరుగా వినిపిస్తోంది. హోటల్ ప్రారంభోత్సవంలో ఇకఇకలు, పకపకలే ఈ ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయని లోకల్ క్యాడర్ మాట్లాడుకుంటోంది.