Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు

Brs

Brs

బీఆర్‌ఎస్‌లో కొత్త పదవి క్రియేట్‌ అవబోతోందా? అదే అత్యంత కీలకంగా మారబోతోందా? ఆ కొత్త పోస్ట్‌ని కూడా బలహీనవర్గాలతో భర్తీ చేయబోతున్నారా? ఇంతకీ… ఏదా కొత్త, కీలకమైన పదవి..?, దాని కోసం పరిశీలనలో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్‌ అధిష్టానం. అందులో భాగంగా సభ్యత్వ నమోదును ప్రయారిటీలో తీసుకుని ఇప్పటికే జిల్లా, నియోజకవర్గ స్థాయి ఇన్చార్జ్‌లను నియమించారు. ఆపని పూర్తవగానే…. గ్రామ, మండల, జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి ఆ కార్యవర్గమే సంచలనం అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నాయి గులాబీ వర్గాలు. వెనుకబడిన తరగతులకు ప్రతినిధిగా పార్టీలో ఓ పెద్ద పోస్ట్‌ క్రియేట్‌ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ ఉన్నారు. పార్టీ వ్యవహారాలన్నీ ఈ రెండు పదవుల చుట్టూనే తిరుగుతుంటాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే… ఇక్కడే కొత్త ఆలోచన చేస్తోందట అధిష్టానం. కుటుంబ ముద్ర నుంచి బయటపడటంతో పాటు సామాజిక సమీకరణల్ని గట్టిగా పాటిస్తున్నామని చెప్పే క్రమంలో…కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ని సృష్టించాలనుకుంటున్నట్టు సమాచారం. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగే సెప్టెంబర్, అక్టోబర్‌లోనే ఈ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని కూడా చేపట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆ పోస్ట్‌లో ఒక బీసీ నేతను నియమించాలనుకుంటున్నారన్నది బీఆర్‌ఎస్‌ ఇంటర్నల్‌ టాక్‌. కొత్తగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఏర్పాటు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు పార్టీ నేతలు. ప్రస్తుతం దేశంతో పాటు రాష్ట్రంలో కూడా బీసీ ఉద్యమం వాయిస్‌ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ పదేపదే చెబుతోంది. ఈ సమయంలో బీసీలకు న్యాయం చేసేది తామేనని చెప్పుకునే క్రమంలో కేటీఆర్ స్థాయికి సమానంగా ఉండే మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్‌ సృష్టించి దాన్ని బీసీ నేతలు ఇవ్వాలని భావిస్తున్నారట. అలా…. బీసీ నేతకు పార్టీలో కేటీఆర్‌తో సమాన స్థాయి ఇవ్వడం ద్వారా బలహీనవర్గాలకు ప్రాధాన్యం, కుటుంబ ముద్ర చెరిపేసుకోవడం లాంటి బహుళ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ కొత్త పదవికి ఎవర్ని ఎంపిక చేయాలనే దానిపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు, హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల స్థానానికి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఆ జిల్లాలకు సంబంధించిన నేతను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ముందు వరసలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

×
×
Ad

ప్రస్తుతం తలసాని గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలోనే సమావేశాలు జరుగుతున్నాయి. వచ్చే గ్రేటర్ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయనకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారన్న అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు తలసానితో పాటు మరికొంత మంది బీసీ నేతల పేర్లు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రేస్‌లో వినిపిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా పరిశీలనలో ఉందట. ఉత్తర తెలంగాణలో కీలక నేతగా ఉన్న మరో మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు కూడా బీసీ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే… పార్టీలో సీనియర్ నేత అయిన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనా చారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట. దీంతో… ఫైనల్‌గా కొత్త పదవి ఎవర్ని వరిస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి గులాబీ వర్గాలు.