బీఆర్‌ఎస్‌లో సభ్యత్వాల నమోదు ప్రహసనంగా మారబోతోందా? ఆ విషయంలో అధ్యక్షుడు కేసీఆర్ చేసిన సూచనపై కొందరికి అనుమానాలు ఉన్నాయా? ఆయన చెప్పింది కూడా బాగానే ఉందిగానీ…. అంటూ సాగదీసే బ్యాచ్ పెరుగుతోందా? ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం విషయంలో భిన్నాభిప్రాయాలు ఎందుకున్నాయి? కేసీఆర్ చేసిన కొత్త ప్రతిపాదన ఏంటి? తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్…క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా విలేజ్ లెవల్ నుంచి సీరియస్‌గా సభ్యత్వ నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీ అధినేత కేసీఆర్. అందుకు సంబంధించి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ట్రెండ్‌కు తగ్గట్టు ఆన్‌లైన్‌లో సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాల వారీగా పార్టీ ప్రధాన కార్యదర్శులను కో ఆర్డినేటర్స్‌గా నియమించారు. కానీ… అసలు కథ ఇక్కడే మొదలైంది. జిల్లాల ఇన్ఛార్జ్‌లకు వేరే పని అప్పగించి… గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు బాధ్యతను నియోజకవర్గ ఇన్చార్జ్‌లకు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ… ఆ నియోజకవర్గ ఇన్చార్జ్‌లను నియమించే బాధ్యతను మాత్రం తిరిగి ఈ జిల్లా కో ఆర్డినేటర్స్‌కే అప్పజెప్పారు కేసీఆర్. ఇలా… నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల నియామకం ఇప్పుడు పెద్ద ప్రహసనం కాబోతోందని పార్టీలో చర్చ మొదలైంది. నియోజకవర్గాల్లో ఇప్పటికే ఉండే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జ్‌లకు సంబంధం లేకుండా… కేవలం సభ్యత్వ నమోదు కోసం వేరే ఇన్ఛార్జ్‌లను పెట్టాలని ఆదేశించడం ఏంటో పార్టీ నాయకులకు అర్ధం కావడం లేదట. ఇలా ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా వేరే వాళ్ళను నియమించడం ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
కానీ… ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా పార్టీ సభ్యత్వాలు చేయాలనుకోవడం వెనక పెద్ద కథే ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు సభ్యత్వాలు చేసే బాధ్యత అప్పచెబితే క్రెడిట్ కోసం ఇష్టం వచ్చినట్టుగా చేయించేస్తారని అనుమానిస్తున్నారట కేసీఆర్. అందుకే మొదటి నుంచి రాశి కాదు వాసి ముఖ్యమని చెప్పుకొస్తున్నారు. తన దగ్గర మార్కులు కొట్టేయడానికో, లేదా వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకేనని అనిపించుకోవడానికో సభ్యత్వాలు ఎక్కువ చేసి చూపించే ప్రమాదం ఉందన్నది పార్టీ అధ్యక్షుడి అభిప్రాయం. అందుకోసమే నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళకు సంబంధం లేకుండా… రాష్ట్ర పార్టీ నుంచి సభ్యత్వం కోసం ప్రత్యేకంగా ఇన్ఛార్జ్‌లను పంపించాలని అనుకుంటున్నట్టు సమాచారం. అలాంటి వాళ్ళ జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నొచ్చుకోకుండా ఈ నియామకం జరగాలని పార్టీ అధ్యక్షుడు చెప్పినట్టు తెలుస్తోంది. కానీ… లోకల్ లీడర్స్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర పార్టీ నుంచి వేరే వాళ్లను పంపిస్తే కో ఆర్డినేషన్ ఎలా ఉంటుందో చెప్పలేమన్న గుసగుసలు పార్టీలేనే పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కేసీఆర్ సూచన కూడా చాలా బాగుందని, ఎక్కువ సభ్యత్వాలు చూపించడం ద్వారా పార్టీ ఎలాంటి లాభం ఉండదన్న అభిప్రాయం సైతం పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంకో వారం రోజుల్లో నియోజకవర్గాల ఇన్చార్జిల నియామకం జరిగాక పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలంటున్నారు పరిశీలకులు.
