బొగ్గుబాయిలో కొత్త బంధాలు పుడుతున్నాయా? మైన్స్ సాక్షిగా మేటర్ మలుపులు తిరగబోతోందా? తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల ప్రభావం సింగరేణి ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా? పాత మిత్రుల్ని పక్కనపెట్టి… కొత్త వాళ్ళు దోస్త్ మేరా దోస్త్ అంటూ సాంగ్ సింగబోతున్నారా? అసలేంటా సమీకరణలు? ఇప్పుడు కొత్తగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది? తెలంగాణలోని ఆరు జిల్లాలు, 11 ఏరియాల్లో విస్తరించి ఉంది సింగరేణి. ఎన్నిక ఏదైనా సరే… ఇక్కడి కార్మికుల ఓట్లు చాలా కీలకం. అందుకే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెడుతుంటాయి. ఆ ప్రయారిటీలోనే… సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక కూడా అసెంబ్లీ ఎలక్షన్స్‌ని తలపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం బొగ్గుబాయిల్లో అదే హీట్ పెరుగుతోందట.
గుర్తింపు సంఘానికి రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో సంస్ధలో మళ్లీ ఎన్నికల మూడ్ వచ్చేసింది.కానీ… ఇక్కడే ఓ కొత్త వివాదం కూడా మొదలైంది. గడువు తీరిపోయినందున ప్రత్యేకంగా గుర్తింపు సంఘం ఏదీ లేదు కాబట్టి అన్ని యూనియన్స్‌కు సమాన హోదా ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆ డిమాండ్‌ను ఆమోదిస్తే…నిన్నటిదాకా అధికారం ఉన్న ఏఐటీయూసీ ప్రాధాన్యత తగ్గినట్టేనా? మళ్ళీ ఎన్నికలై ఫలితాలు వచ్చేదాకా యాజమాన్యంతో సంప్రదింపుల్లో ఆ సంఘాన్ని కూడా మిగతా వాటితో సమానంగా చూస్తారా లేక కొంచెం ఎక్కువ సమానం అంటారా అన్న చర్చలు జరుగుతున్నాయి కార్మిక వర్గాల్లో. అదే సమయంలో బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సీపీఐ సై అంటోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి.
మామూలుగా అయితే…. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్, సీపీఐ మిత్రపక్షాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేశాయి. కానీ… మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహారం కాస్త తేడాగా కనిపించింది. అక్కడక్కడా బీఆర్‌ఎస్, సీపీఐ స్నేహగీతం ఆలపించాయి. ఇప్పుడు అదే ఈక్వేషన్ సింగరేణిలో కూడా వచ్చి ఆ బంధం అలాగే కొనసాగుతుందా అన్న చర్చలు మొదలయ్యాయి రాజకీయవర్గాల్లో. చివరిసారిగా 2023 డిసెంబర్ 27న సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా ఎన్నికయ్యాయి. ఇప్పుడు ఆ రెండిటి కాలపరిమితి ముగిసినందున యాజమాన్యం నిర్వహించే అధికారిక సమావేశాలకు అన్ని యూనియన్స్‌ను కలిపి పిలవాలన్న డిమాండ్ తెర మీదికి వచ్చింది. అలాగే… కాలయాపన చేయకుండా వెంటనే ఎన్నికలు నిర్వ హించాలని ప్రతిపక్ష సంఘాలు కోరుతున్నాయి. అలాగే… ఆయా మైన్స్‌తో పాటు కంపెనీ వ్యాప్తంగా అన్ని సంఘాలకు సమాన హోదా ఇవ్వాలంటూ ఎక్కడికక్కడ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఎన్నికల కోసం అన్ని యూనియన్లు, వాటి ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలు పెట్టడం ఆసక్తికరంగా మారింది. సరిగ్గా ఇక్కడే మున్సిపల్ ఎన్నికల నాటి పరిణామాలు చర్చకు వస్తున్నాయి. ఇప్పటికే సింగరేణి ప్రాంతమైన క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో సీపీఐ పొత్తుపెట్టుకుంది.
సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీనే నిన్నటిదాకా సింగరేణిలో గుర్తింపు సంఘం. రాష్ట్ర స్థాయి పొత్తు కోణంలో గతంలో సీపీఐ, దాని అనుబంధం సంఘం సైతం కాంగ్రెస్‌తోనే ఉన్నాయి. కానీ… ఇప్పటికీ అదే అవగాహన ఉందా లేదా అన్నది ఇప్పుడు వస్తున్న సరికొత్త డౌట్. సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ కాంగ్రెస్ సంఘంతో కలిసి వెళ్తుందా లేక బీఆర్‌ఎస్ అనుబంధ సంఘానికి దగ్గరవుతుందా? లేక ఈ రెండూ కాదని సోలో సాంగ్ పాడుతుందా అన్నది ప్రస్తుతం కోల్ బెల్ట్‌లో ఇంట్రస్టింగ్ టాపిక్. మరి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహిస్తుందా, లేక తాత్సారం చేస్తారా? అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారం ఎలక్షన్ జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీల బంధాలు, సంఘాల అనుబంధాలు ఎలా ఉంటాయన్నది మాత్రం కాస్త ఇంట్రస్టింగ్ సబ్జెక్టేనన్నది వాళ్ళ మాట.
