ఓటమి తర్వాత రకరకాల సమస్యలతో సతమతం అవుతున్న బీఆర్‌ఎస్… ఫస్ట్ టైం… డబుల్ డోస్ పొలిటికల్ ప్లానింగ్ చేస్తోందా? జంబ్లింగ్ సిస్టంతో కొత్త ప్రయోగం చేయాలనుకుంటోందా? ఒక నాయకుడి చేరికతో రెండు నియోజకవర్గాల్లో బలపడాలని భావిస్తోందా? అది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఇంతకీ ఏంటా పొలిటికల్ ప్లాన్? దానితో ఏయే నియోజకవర్గాల్లో పుంజుకోవాలనుకుంటోంది? ఓటమి తర్వాత వరుస దెబ్బలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది బీఆర్‌ఎస్. వలసలు ఆ పార్టీని ఇంకా దెబ్బతీస్తున్నాయి. అందునా ఇటీవల మాజీ ఎమ్మెల్యే, ఒకనాటి ఉద్యమనేత గువ్వల బాలరాజు కారు దిగేసి కాషాయ కండువా కప్పుకోవడంతో గులాబీ అధిష్టానానికి మైండ్ బ్లాంక్ అయిందని చెప్పుకుంటున్నారు. దీంతో వెంటనే అచ్చంపేట నియోజకవర్గంలో డ్యామేజ్ కంట్రోల్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. క్యాడర్ ఇప్పటిదాకా చెల్లాచెదువరకుండా ఉన్నప్పటికీ… ఇంకా ఆలస్యం చేస్తే ఏమవుతుందోనన్న భయంతో త్వరపడాలనుకుంటున్నారట. పార్టీ పెద్దలు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణుల్లో భరోసా నింపాలని భావించినా ఎటూ తేలడం లేదట. బీఆర్‌ఎస్ మండల ముఖ్యనేతలంతా గువ్వల వైఖరిని తప్పు పట్టడం గులాబీ పార్టీకి కాస్త ఊరట అయితే… ఆలస్యం చేస్తే పరిస్థితులు మారిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలున్నాయి.
తాత్కాలికంగా నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని అచ్చంపేట ఇన్ఛార్జ్‌గా నియమించినా పూర్తి స్థాయి ఇన్ఛార్జ్‌గా ఎవర్ని నియమించాలని తర్జనభర్జన పడుతున్నారట పార్టీ పెద్దలు. ఈ క్రమంలోనే… మాజీ ఐపీఎస్ అధికారి, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వస్తోంది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు ఆర్‌ఎస్. ఆయనకు అచ్చంపేట అప్పజెబితే ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టవచ్చనుకుంటున్నారట. ప్రవీణ్‌కుమార్‌ని అచ్చంపేట ఇన్ఛార్జ్‌గా ప్రకటిస్తే… అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చన్నది గులాబీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇక్కడ పార్టీ నుంచి వెళ్ళిపోయిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను తిరిగి రప్పించే ప్రయత్నం జరుగుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నుంచే ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు కోనప్ప, ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్. నాడు ఆర్.ఎస్. బీఎస్పీ నుంచి, కోనప్ప బీఆర్‌ఎస్ తరపున తలపడ్డారు.
వీళ్ళిద్దరూ కాకుండా అక్కడ బీజేపీ గెలిచింది, అది వేరే సంగతి. అయితే… అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రవీణ్‌కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. అక్కడే హర్ట్ అయ్యారట కోనప్ప. ఎన్నికల్లో నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వ్యక్తిని ఎలా తీసుకుంటారు? అదీ… కనీసం నాతో సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ అలిగి… కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారాయన. కోనప్ప కాంగ్రెస్‌లో చేరినా… ఎన్నడూ బీఆర్‌ఎస్‌ను విమర్శించలేదు. పైగా పలు సందర్భాల్లో కేసీఆర్ నాకు దేవుడంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో… కోనప్ప ఎప్పుడైనా కారెక్కేయవచ్చన్న ప్రచారం జరుగుతూనే ఉంది. ఇక్కడే తమ రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారట గులాబీ పెద్దలు. ఎలాగూ అచ్చంపేట ఖాళీ అయింది, అది ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ని బరిలో దింపి సిర్పూర్‌లో కోనప్పను తిరిగి తీసుకుంటే.. రెండు నియోజకవర్గాల్లో బలపడవచ్చు, ఎలాగూ జిల్లాలు మారిపోతాయి కాబ్టటి ఇక వాళ్ళిద్దరికీ గొడవ కూడా ఉండబోదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోనప్ప కాంగ్రెస్‌లో ఉండీ లేనట్టుగా ఉన్నారు. దాంతో కండువా కప్పేయడం తేలికేనని భావిస్తున్నారట బీఆర్‌ఎస్ పెద్దలు. ఈ పరిస్థితుల్లో రెండు నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. నేను మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని గతంలో సిర్పూర్ కేడర్‌కు చెప్పిన మాటకే ప్రనీణ్‌కుమార్ కట్టుబడతారా? లేక అధిష్టానం చెప్పినట్టు అచ్చంపేటకు వెళ్ళి వర్కౌట్ చేసుకుంటారా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న గులాబీ పెద్దల ఫార్ములా వర్కౌట్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
