తెలంగాణలో ఇప్పుడు టచ్ పాలిటిక్స్ జోరు పెరిగిపోయిందా? కొందరు నాయకులకు గులాబీ రంగు మీద మొహం మొత్తి కాషాయంపై మనసు పారేసుకుంటున్నారా? అట్నుంచి కూడా కొంచెం టచ్‌లో ఉంటే… చెబుతామన్న సమాధానం వస్తోందా? తెలంగాణలో బీజేపీ కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్న నాయకులెవరు? ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. శరవేగంగా మారుతున్న పరిణామాలు కూడా అదే చెబుతున్నాయి. అసలే అష్టకష్టాలతో సతమతం అవుతున్న గులాబీ పార్టీని మరిన్ని సమస్యలు వెంటాడబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈసారి బీజేపీ రూపంలో బీఆర్‌ఎస్‌కు థ్రెట్ రాబోతున్నట్టు చెప్పుకుంటున్నారు. చాలామంది నాయకులు కారు దిగేసి కమలాన్ని పట్టుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మొదలయ్యే వలసల పర్వం ఈసారి గట్టిగానే ఉండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే రకరకాల పేర్లు చక్కర్లు కొడుతుండటం అటు బీఆర్‌ఎస్ వర్గాలను కూడా కలవరపెడుతోందట. బయట ప్రచారంలో ఉన్న పేర్లలో కొందరు తాము పార్టీ మారబోవడంలేదని ఇప్పటికే క్లారిటీ ఇవ్వగా ఇంకొందరు మాత్రం కామ్‌గా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. సరిగ్గా ఇక్కడే మరోసారి మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎపిసోడ్ తెర మీదికి వచ్చింది. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో స్టింగ్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. అయినా సరే… తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసిందని, ఆ ఫామ్‌హౌస్‌లోనే తమ పార్టీ కి చెందిన నలుగురితో మంతనాలు జరిపినట్టు ఆరోపించింది బీఆర్‌ఎస్. దాని మీద నిఘా పెట్టి వాళ్ళ బండారం బట్టబయలు చేశామంటూ… స్వామీజీల వీడియోలు, బీజేపీ నేతల ఆడియోలను బయటపెట్టారు అప్పటి సీఎం కేసీఆర్.
Tragedy : రైల్వే ట్రాక్ వద్ద లభించిన డెడ్ బాడీ వెనుక దాగి ఉన్న ఘోర నిజం..!
దాని మీద చాలా పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. తర్వాత మెల్లిగా చల్లబడింది. మళ్ళీ ఇప్పుడు… అట్నుంచి ఇటు వలసలు ఉంటాయని చెప్పుకుంటున్న టైంలో…మరోసారి తెర మీదికి వచ్చింది ఆ అంశం. నాడు ఫామ్‌హౌస్ కేసులో కీలకంగా ఉన్న అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రస్తుత మాజీలు ఇప్పుడు కమలం పార్టీకి టచ్‌లోకి వెళ్ళారట. నాడు పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావుతో బీజేపీ మంతనాలు జరిపి లాగేసేందుకు ప్రయత్నించినట్టు ఆరోపించారు బీఆర్‌ఎస్ పెద్దలు. వీళ్ళలో గువ్వల బాలరాజు ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు కూడా. ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఇక లాంఛనమే. గువ్వల బాలరాజు ఇప్పటికే బీజేపీ ఢిల్లీ పెద్దలను కలిసినట్టు తెలిసింది. అలాగే నాటి మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌లో కీలకంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్న బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్‌ని కూడా గువ్వల కలిసినట్టు చెప్పుకుంటున్నారు. ఆ టైంలోనే… తాను ఇంకొంతమందిని పార్టీలోకి తీసుకువస్తానని కాషాయ పెద్దలకు చెప్పేశారట బాలరాజు. అందుకు అట్నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టు తెలిసింది. అయితే… వాళ్ళలో పైలట్ రోహిత్‌రెడ్డికి మాత్రం నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసిందట కమలం పార్టీ.
మిగతా వాళ్ళు ఇవాళ కాకుంటే రేపు అయినా… మా పార్టీ కండువాలు కప్పుకుంటారని చెబుతున్నారట బీజేపీ నాయకులు. వాళ్ళతో ఇప్పటికే చర్చలు జరిగాయన్న ప్రచారం కూడా ఉంది. అలాగే… ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు కూడా బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. అలా జిల్లాల వారీగా.. మెల్లిగా గులాబీ నేతలు చాలా మంది మా పార్టీలో చేరతారన్నది తెలంగాణ బీజేపీ వర్గాల మాట. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాలను కలవరపెడుతోందట. అదే సమయంలో స్టింగ్ ఆపరేషన్ ఎపిసోడ్ తర్వాత కామ్‌గా ఉన్న ఫామ్‌హౌస్ బ్యాచ్ ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళి నోరు విప్పితే ఎవరి కొంపలు మునుగుతాయోనన్న చర్చలు సైతం నడుస్తున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి గేమ్ ఆడబోతోంది? దాన్ని బీఆర్‌ఎస్ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
