ఎవరో జ్వాలను రగిలించారు….దానికి వేరెవరో బలైపోయారంటూ ఆ ఎంపీ పాడుకోవాల్సి వస్తోందా? గాలికి పోయే కంప నేరుగా వచ్చి తన మీదే పడ్డట్టు ఫీలవుతున్నారా? పక్క రాష్ట్రంలో ఉన్న వ్యాపారాలు, అక్కడి నేతలతో ఉన్న సంబంధాలే ఆయనకు రాజకీయ ప్రతిబంధకాలు కాబోతున్నాయా? చివరికి సొంత ఊళ్ళోనే అనుమానించే పరిస్థితి వచ్చిందా? ఎవరా రాజ్యసభ సభ్యుడు? ఏంటా బోట్స్ మేటర్? కఠినమైన కుల కట్టుబాట్లు… సున్నిత ఆచార వ్యవహారాలు ఉండే నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు పేరు వింటేనే మండిపడుతున్నారు. ఆయన నేరుగా కనిపిస్తే సంగతి చూస్తామన్నంతగా కన్నెర్ర చేస్తున్నారట. మా పొట్ట కొట్టిన తమిళ జాలర్లకు సహకరిస్తారా? పట్టుబడ్డ వాళ్ళ బోట్లను తరలించడానికి సపోర్టు చేస్తారా..? తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పరిధిలోకి వచ్చి చేపలు పడుతున్న నాలుగు బోట్లను స్వాధీనం చేసుకుని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఉంచారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాకే వాటిని వదలాలని పెద కాపులు తీర్మానించారు. ఆ మేరకు రెండు మూడు దఫాలు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో ఆ నాలుగు బోట్లను తమిళ జాలర్లు సీక్రెట్‌గా ఎత్తుకుని పోవడంతో వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇందులోనే ఇరుక్కున్నారు బీద మస్తాన్‌రావు. గతంలో వైసీపీలో ఉన్న మస్తాన్‌రావు…. ఎన్నికల తర్వాత టిడిపి కండువా కప్పుకున్నారు.అప్పటినుంచి పూర్తిగా వ్యాపారాల మీదే దృష్టి పెట్టారు.
అప్పుడప్పుడు స్వగ్రామమైన ఇసుకపల్లికి వస్తూ.. రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారాయన. తమిళ జాలర్ల బోట్ల విడుదలలో ప్రమేయం ఉందంటూ… అదే ఇసుకపల్లికి చెందిన పెద కాపును మత్స్యకారులు తాళ్లతో బంధించారు. ఆ సందర్భంగా ఆయన రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు పేరు చెప్పారట. ఆయన సూచనల మేరకే తాను తమిళ జాలర్లకు సహకరించానని క్లారిటీ ఇచ్చేసరికి మత్స్యకార గ్రామాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఆయన ఎంత ఎంపీ అయితే మాత్రం… మమ్మల్ని కాదని తమిళ జాలర్లకు సహకరిస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతున్నారు స్థానిక మత్స్యకారులు. తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని బీద మస్తాన్ రావు వీడియో రిలీజ్ చేసినా…. మత్స్యకారులు మాత్రం కన్విన్స్ అవడం లేదట. సంబంధం లేదని పైకి చెబుతున్నా…. బీద సహకరించే ఉంటారంటూ కొన్ని ఈక్వేషన్స్ చెబుతున్నారు. మస్తాన్‌రావుకు తమిళనాడు, పాండిచ్చేరిలో హేచరీస్ ఉన్నాయి.
రొయ్యల ఎగుమతుల ద్వారా ఆయన అక్కడి నేతలతో మంచి కాంటాక్ట్స్ పెట్టుకున్నారట. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల మూడ్‌లో ఉన్నందున బోట్‌ల వ్యవహారం రాజకీయంగా తమను డ్యామేజ్ చేయకుండా అక్కడి నేతలు వత్తిడి తెచ్చి ఉండవచ్చని, అందుకే రాజ్యసభ సభ్యుడు కూడా కన్విన్స్ అయి ఉండవచ్చంటూ విశ్లేషిస్తున్నారు. తమిళ నేతలతో ఉన్న సన్నిహిత సంబంధాలే ఆయనకు తలనొప్పులు తెచ్చి ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి నేతలతో ఉన్న రిలేషన్ చెడకుండా… ఉండటం కోసం ఆంధ్ర మత్స్యకారుల చెరలో ఉన్న బోట్లను విడుదల చేయించారన్నది ఇసుకపల్లి మత్స్యకారుల అనుమానం. పెద కాపులను చేరదీసి.. వారికి డబ్బులు ఇచ్చి తమిళ జాలర్లకు సహకరించాలని బీద మస్తాన్‌రావు సూచించారనేది మత్స్యకారుల ప్రధాన ఆరోపణ. ఆ నాలుగు బోట్లను తీసుకెళ్లేందుకు రెండు నెలల క్రితమే అక్కడి జాలర్లు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు వచ్చారట.
సరైన సమయం కోసం ఎదురు చూశారని. అదను చూసి ఎత్తుకెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. ఎంపీ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. సొంత గ్రామం ఇసుకపల్లి మత్స్యకారుల కట్టుబాట్లను తాను గౌరవిస్తానని, తనపై నిందలు వేస్తూ దుష్ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ఓవైపు మత్స్యకారుల ఆరోపణలు, మరోవైపు బీద మస్తాన్‌రావు రియాక్షన్ క్రమంలో ఎంట్రీ ఇచ్చిన వైసీపీ దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. మస్తాన్‌రావు కనుసన్ననల్లోనే ఈ వ్యవహారం అంతా నడిచిందనే విషయాన్ని మత్స్యకారుల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ ఆధారంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఉన్న మత్స్యకారులను తమ వైపుకు తిప్పుకునేందు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద బోట్ల చోరీ వ్యవహారం కావాల్సినంత పొలిటికల్ కలర్ పులుముకుని చినికి చినికి గాలివానగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. దీని మీద ప్రభుత్వం స్పందించకపోతే.. మత్స్యకార గ్రామాల్లో బీద మస్తాన్ రావుకి గడ్డు కాలమేనన్న అభిప్రాయం బలపడుతోంది. మేటర్‌ని ఎలా డీల్ చేస్తారో చూడాలి.
