OTR : బాజిరెడ్డి కి బీఆర్ఎస్ అధిష్టానం షాక్ ..! ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారా ?

Bajireddy

Bajireddy

అంతన్నారింతన్నారు…. అంతా నువ్వేనన్నారు. ఇక చూస్కో…. దూసుకుపో…. అంటూ భరోసా ఇచ్చేశారు. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ఎదురే నాకు లేదు…. ఇంకెవరూ నన్ను ఆపలేరు అంటూ సాంగులు సింగుతూ… యాక్టివ్‌గా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ టిక్కెట్ నాదేనని ఫీలవుతున్న టైంలో బీఆర్‌ఎస్‌ అధిష్టానం ఊహించని షాక్‌ ఇచ్చింది. చేసింది చాలు… మరో చోటికి పొమ్మనడంతో అవాక్కవడం సదరు మాజీ వంతయింది? ఎవరాయన? ఏంటా స్టోరీ? కామారెడ్డి జిల్లా బాన్సువాడ గులాబీ పార్టీకి పెద్ద దిక్కు కరవైంది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం పార్టీ మారిపోయాక సమస్య మొదలైంది. ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో తెలియక గులాబీ బాస్ తర్జనభర్జన పడుతున్న టైంలో…నేనున్నానంటూ ఎంటరయ్యారు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అంతా తానై చూసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. బాజిరెడ్డి బాన్సువాడ పై ఫోకస్ పెట్టడంతో.. రూరల్‌లో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో… రూరల్ బాధ్యతలు తన కుమారుడు బాజిరెడ్డి జగన్‌కు అప్పగించాలని కోరారట ఆయన. తాను బాన్సువాడ, కుమారుడు జగన్ రూరల్‌లో పార్టీ వ్యవహారాలు చక్కబెడతానని ప్రతిపాదించినట్టు తెలిసింది.

అధికారికంగా క్లారిటీ ఇవ్వకున్నా…. కొడుకును సమన్వయం చేసుకుని రూరల్, బాన్సువాడ రెండు నియోజకవర్గాలను బాజిరెడ్డి చూస్తున్నారట. కానీ… పార్టీ చేస్తున్న సర్వేలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న గులాబీ పెద్దలు బాజిరెడ్డిని రూరల్‌కు పరిమితం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని తేలిందట. కార్యకర్తలు కూడా రూరల్‌లో బాజిరెడ్డి కావాలని కోరుకుంటున్నట్టు చెబుతున్నారు. దీనికి తోడు ఓ మాజీ ఎమ్మెల్యే గులాబీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. కుదిరితే బాన్సువాడ, లేదంటే ఎల్లారెడ్డిలో తనకు పోటీకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. దీంతో ఆయన కోసం బాజిరెడ్డిని రూరల్ కు పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం.. కాంగ్రెస్ కు దగ్గరగా ఉండటంతో.. ఆ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అనాథగా మారిందని అంటున్నారు. కష్ట కాలంలో బాజిరెడ్డి ఇంచార్జ్‌ బాధ్యతలు తీసుకుని క్యాడర్‌లో భరోసా నింపారు. ఐతే ఒకప్పుడు బీఆర్‌ఎస్‌లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం గులాబీ గూటికి వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్టు చర్చ నడుస్తోంది. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ తో చర్చలు సైతం జరిపారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్నా.. ఆయన ఎక్కడా ఖండించడం లేదు. అధికార పార్టీలో దూకుడుగా ఉండే రవీందర్ రెడ్డి కొద్ది రోజులుగా దూకుడు తగ్గించారు. పోచారం నియోజకవర్గంపై పట్టు సాధించడంతో.. రవీందర్ రెడ్డికి ప్రాధాన్యం తగ్గిందట. దీంతో ఆయన పార్టీ మారి ఇక్కడే ఉండి తేల్చుకోవాలనుకుంటున్నారట.

×
×
Ad

కాంగ్రెస్ లో ఉండి పోచారం పై పోటీ చేసే అవకాశం లేకపోవడంతో .. గులాబీ పార్టీ వైపు చూస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఆయన కోసం బాజిరెడ్డిని రూరల్ పై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారట. ఇటీవల జరిగిన రూరల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదులో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి … బాజిరెడ్డి రూరల్‌లోనే పోటీ చేస్తారని ప్రకటించారు. అధిష్టానం మాట మాజీ మంత్రి నోటి వెంట పలికించారనే చెబుతోంది క్యాడర్. కానీ బాజిరెడ్డి మాత్రం ఆడా ఉంటా .. ఇడా ఉంటా అంటున్నారట. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి .. తన స్దానాన్ని కుమారుడు జగన్ కు వదిలేశారు. కానీ అధిష్టానం రూరల్ పై ఫోకస్ చేయాలని చెప్పడంతో.. ఏటూ తేల్చుకోలేకపోతున్నారట గోవర్ధన్‌. కొడుకు జగన్ ను ఎలా సెట్ చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు బీఆర్ఎస్‌లో చేరిక మీదే బాజిరెడ్డి కుమారుడి భవితవ్యం ఆధారపడి ఉందని అంటున్నారు.