OTR : అశోక్ గజపతిరాజు ఆరోపణలు.. వైసీపీ కౌంటర్.. విజయనగరంలో రాజకీయ హీట్.!

Ashok

Ashok

రాజుగారు కోట రాజకీయానికి దూరంగా ఉండలేకపోతున్నారా? వేరే స్టేట్‌లో రాజ్యాంగబద్ద పదవిలో ఉండి కూడా…లోకల్‌ పాలిటిక్స్‌ మీద ఫోకస్‌ పెడుతున్నారా? అక్కడ ఉండి కూడా ఇక్కడేం జరుగుతోందో తెలుసుకుని సీరియస్‌గా రియాక్ట్‌ అవుతున్నారా? లోకల్‌ పాలిటిక్స్‌లో హీట్‌ పెంచిన ఆ గవర్నర్‌ ఎవరు? ఏంటా వ్యవహారం? విజయనగరం రాజకీయాలు ఉన్నట్టుండి హీటెక్కాయి. వైసీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించిన భూమి వివాదం ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య ప్రతిష్ఠాత్మక పోరుకు దారి తీస్తోంది. ఒకవైపు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు… మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఉండటంతో పొలిటికల్‌ కాక రేగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతున్నాయి. గతంలో ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి వైసీపీ ఆఫీస్‌ కోసం కేటాయించారంటూ అశోక్ గజపతిరాజు ఆరోపిస్తుంటే… అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి, నిబంధనల ప్రకారమే స్థలం లీజుకు వచ్చిందని మజ్జి శ్రీనివాసరావు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఈ భూ వివాదం ఇప్పుడు రాజకీయంగానూ, చట్టపరమైన వ్యవహారాలకు సంబంధించి ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో గవర్నర్‌గా గోవాలో బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్ గజపతిరాజు… పూర్తిగా విజయనగరం రాజకీయాలపైనే దృష్టి పెట్టారనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక వైసీపీ జిల్లా ఆఫీస్‌కు కేటాయించిన భూమి తమ కుటుంబానికి చెందిన ప్రైవేట్ ఆస్తి అని వాదిస్తున్నారు అశోక్ గజపతిరాజు. చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా అబాండన్డ్ ల్యాండ్‌ పేరుతో కేవలం కొద్ది నెలల్లోనే ప్రభుత్వ భూమిగా మార్చి, అనంతరం వైసీపీ కార్యాలయానికి లీజుకు ఇచ్చారని ఆరోపిస్తున్నారాయన. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాశామని, చట్టపరమైన ఆధారాలు, రెవెన్యూ రికార్డులు, న్యాయస్థానాల తీర్పులను సమర్పించినట్టు వివరిస్తున్నారు అశోక్‌

మరోవైపు మజ్జి శ్రీనివాసరావు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. 2021లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసి, నగర పాలక సంస్థ తీర్మానం, ప్రభుత్వ జీవో, రెవెన్యూ శాఖ అనుమతులతోనే 2022లో భూమిని లీజుకు తీసుకున్నామని అంటున్నారాయన. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన భూమిలోనే పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామని, అక్రమం జరిగిందన్న ప్రచారం రాజకీయ దుష్ప్రచారమేనన్నది ఆయన వెర్షన్‌. గవర్నర్ హోదాలో ఉన్న అశోక్ గజపతిరాజు రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని కూడా వ్యాఖ్యానిస్తున్నారు మజ్జి. ఈ వివాదం ఇలా నడుస్తుంటే…. స్థానిక రాజకీయ వర్గాల్లో మాత్రం మరో రకమైన డిస్కషన్‌ నడుస్తోంది. అశోక్ గజపతిరాజు ఒక రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పటికీ… తరచూ విజయనగరానికి వచ్చి స్థానిక అంశాలపై స్పందించడం వెనుక రాజకీయ ఉన్నది రాజకీయ వ్యూహమా.. లేక కుటుంబ ఆస్తి వివాదంపై తన వైఖరి చెబుతున్నారా అంటూ ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చెబుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఈ వివాదాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్లి తమపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఇలా ఒకవైపు ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చారన్న అశోక్ గజపతిరాజు ఆరోపణలు… మరోవైపు అన్ని అనుమతులు ఉన్నాయంటున్న వైసీపీ వాదనల మధ్య విజయనగరంలో రాజకీయ వేడి రగులుతోంది. భూ యాజమాన్యం, రికార్డుల మార్పులు, లీజు ప్రక్రియపై అధికారిక నిర్ణయం లేదా న్యాయ విచారణ ఎలాగూ జరుగుతాయి..‌ కానీ… ఆలోపు అశోక్ గజపతి రాజు ఇలా మట్లాడ్డం, ప్రత్యేకించి రాజ్యాంగ పదవిలో ఉండి ఆ తరహా స్టేట్‌మెంట్స్‌ ఏంటన్న ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి.